వాలంటీర్‌ వ్యవస్థ ‘హ్యాండ్సప్‌’

ABN , First Publish Date - 2020-03-30T11:10:13+05:30 IST

ప్రభుత్వ పథకాల లబ్ధిని అర్హుల ఇళ్లకే చేరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీరు వ్యవస్థ సరిగ్గా ఆపత్సమయంలో చతికిలబడిపోయింది.

వాలంటీర్‌ వ్యవస్థ ‘హ్యాండ్సప్‌’

రేషన్‌ షాపుల్లోనే సరుకుల పంపిణీ 

కొండెక్కిన ‘ఇంటివద్దకే పంపిణీ’ విధానం

దుకాణాల ముందు గంపులుగా లబ్ధిదారులు

ఇలాగైతే కరోనా వ్యాప్తి నివారణ ఎలా?


తిరుపతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల లబ్ధిని అర్హుల ఇళ్లకే చేరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీరు వ్యవస్థ సరిగ్గా ఆపత్సమయంలో చతికిలబడిపోయింది. సాధారణ సమయాల్లో ఇంటికి చేర్చకున్నా పర్వాలేదు గానీ.. కరోనా వైరస్‌ వ్యాప్తి భయపెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ  ఆ పని చేయకపోవడంతో ఈ వ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీ ఆదివారం ప్రారంభం కాగా పలుచోట్ల  వాలంటీర్ల సేవలు కనిపించలేదు.


వాలంటీర్లు వంతుల వారీగా తమ పరిధిలోని కార్డుదారులను చౌకదుకాణానికి పంపాలని ఆదేశాలు వచ్చినా అదీ జరగలేదు. లబ్ధిదారులంతా ఒక్కసారిగా తరలివచ్చి చౌక దుకాణాల ముందు పెద్దఎత్తున గుమికూడారు. అక్కడక్కడా మీటరు దూరంతో క్యూలు ఏర్పాటు చేసినా, అదీ కాసేపు ముచ్చటే అయింది. వాలంటీరు వ్యవస్థ గురించి పదేపదే ప్రశంసించే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సహా పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయా చౌక దుకాణాల్లోనే లబ్ధిదారులకు సరుకుల పంపిణీ ప్రారంభించడం గమనార్హం.


జిల్లాలో తొలివిడత రేషన్‌ సరుకుల పంపిణీ ఆదివారం మొదలైంది. జిల్లాలో మొత్తం 2900 చౌక దుకాణాలున్నాయి. వాటి ద్వారా 1.64 లక్షల కార్డులకు సరుకులు ఇవ్వాల్సి వుంది. వాస్తవానికి సరుకులను వాలంటీర్లే కార్డుదారుల ఇళ్ళకు చేర్చాలి. కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సక్రమంగా అమలు కావాలంటే ఇది మరింత పకడ్బందీగా అమలుకావాలి. జిల్లాలో 21 వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.


కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ఆదేశాల ప్రకారం వాలంటీర్లు ఇంటింటికీ వెళ్ళి విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా సొంతింటికి  వచ్చారా, అలాగే ఇళ్ల నుంచి ఎవరైనా ఇటీవలి కాలంలో విదేశాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారా అనే  వివరాలు సేకరించాల్సి వుంది. అయితే ఈ తరహా ఇంటింటి సర్వేలో కొన్నిచోట్ల మాత్రమే వాలంటీర్లు పాల్గొంటున్నారు. మరికొన్ని చోట్ల వైద్య సిబ్బందికి సహకరిస్తున్నారు. ఈ విధులెలాగూ పూర్తిస్థాయిలో నిర్వర్తించడం లేదు కనుక కనీసం రేషన్‌ సరుకుల పంపిణీలో అయినా వాలంటీర్ల సేవలను జిల్లా యంత్రాంగం వినియోగించుకోవలసి ఉండగా విఫలమైంది. ఫలితంగా నెలకొన్న ప్రమాదకర పరిస్థితులకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు...


కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ చౌక దుకాణాల వద్ద జనం గుంపులు కట్టారు. పోలీసులు నిర్బంధంగా వారిని దూరదూరంగా నిలబెట్టినా కొద్దిసేపటికే మళ్ళీ మొదటికొచ్చారు. ఈ నియోజకవర్గంలో పలుచోట్ల వాలంటీర్లు సర్వే పేరిట కాలక్షేపం చేస్తూ కనిపించారు.


పుంగనూరు నియోజకవర్గంలో ఇటు సరుకులను ఇంటింటికీ చేరవేయకుండా, అటు సర్వేలోనూ పాల్గొనకుండా వాలంటీర్లు చౌక దుకాణాల వద్ద మాత్రం హడావిడి చేస్తూ కనిపించారు.


ఐరాల మండలంలో చౌక దుకాణాల వద్ద పోలీసులు ఎంత ఒత్తిడి చేసినా జనం దూరం పాటించలేదు. గుంపులుగానే గుమిగూడారు.


వాల్మీకిపురం, చింతపర్తిల్లో ప్రజలు రేషన్‌ సరుకుల కోసం ఎగబడ్డారు. దూరదూరంగా నిలబడాలన్న పోలీసుల హెచ్చరికలను ఎవ్వరూ  ఖాతరు చేయలేదు.


పుత్తూరు పట్టణంలో బయోమెట్రిక్‌ పనిచేయక 11 గంటల వరకూ పంపిణీ మొదలు కాలేదు. దీంతో లబ్దిదారులు తమసంచులు క్యూలో వుంచి తామంతా నీడపట్టున గుంపులుగా చేరారు.


జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో కూడా ఇంటింటికీ సరుకుల చేరవేత అమలు కాలేదు.

Updated Date - 2020-03-30T11:10:13+05:30 IST