సైబర్‌ నేరాల నియంత్రణకు ‘స్వచ్ఛంద’ సైన్యం

ABN , First Publish Date - 2021-01-24T08:18:49+05:30 IST

టెక్నాలజీ వాడకం పెరిగిన తర్వాత నేరాల తీరు ఒక్కసారిగా మారిపోయింది. కంటికి కనిపించకుండా నే.. అవతలి వ్యక్తిని ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురిచేస్తూ.. మానసికంగా కోలుకోలేనంతగా దెబ్బకొడుతున్నారు

సైబర్‌ నేరాల నియంత్రణకు ‘స్వచ్ఛంద’ సైన్యం

కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ఆదేశం


హైదరాబాద్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): టెక్నాలజీ వాడకం పెరిగిన తర్వాత నేరాల తీరు ఒక్కసారిగా మారిపోయింది. కంటికి కనిపించకుండా నే.. అవతలి వ్యక్తిని ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురిచేస్తూ.. మానసికంగా కోలుకోలేనంతగా దెబ్బకొడుతున్నారు నేరగాళ్లు. 2019లో తెలంగాణలో 2,240 సైబర్‌ నేరాలు నమోదవగా 2020లో ఆ సంఖ్య ఏకంగా 4,544కు పెరిగింది. అంటే ఏడాదిలోనే 103ు పెరిగాయి. వీటిలో బాధితులు మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో సైబర్‌ స్పేస్‌ స్వచ్ఛంగా, భద్రంగా ఉంచేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేసేందుకు తెలంగాణ పోలీసు లు సిద్ధమవుతున్నారు. కేంద్రం మార్గదర్శకాలకు లోబడి.. నేరాల నియంత్రణకు ‘‘సైబర్‌ వాలంటీర్ల’’ పేరిట ‘‘స్వచ్ఛంద’’ సైన్యం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కమిషనర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు.


ప్రజా భాగస్వామ్యంతో అడ్డుకట్ట ఉద్దేశంతో..

సైబర్‌ నేరాల నియంత్రణ, బాధితులు ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘‘ఇండియన్‌ సైబర్‌ క్రైం కో-ఆర్డినేషన్‌ సెంటర్‌’(ఐ4సీ)ని ఏర్పాటు చేసింది. ఐ4సీలో భాగంగా నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ను నిర్వహిస్తోం ది. ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడం, మహిళలు, చిన్నారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాల పెరుగుదలను గమనించి.. ప్రజా భాగస్వామ్యంతోనే వీటి ని నియంత్రించవచ్చనే ఉద్దేశంతో పోర్టల్‌లో కొత్తగా ‘సైబర్‌ క్రైం వాలంటీర్‌ ఫ్రేం వర్క్‌’ను అందుబాటులోకి తెచ్చింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారి సేవలను ఇందుకు వినియోగించుకోనుంది. ఆసక్తి ఉన్న భారతీయులు సైబర్‌ వాలంటీర్లుగా నమోదుకావొచ్చు. 


సైబర్‌ వాలంటీర్ల నమోదు, విధి ఇలా..

సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌లో వ్యక్తిగతంగా ఎవరికివారు ‘సైబర్‌ వాలంటీర్‌’గా నమోదు చేసుకోవాలి. పూర్తి పేరు, చిరునామాతో పాటు వ్యక్తిగత గుర్తింపు, చిరునామాకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. సంబంధిత విభాగం అధికారులు పూర్తి వివరాలు పరిశీలించి వాలంటీర్‌గా కొనసాగేందుకు అనుమతి ఇస్తారు.  


దుర్వినియోగం కాకుండా చర్యలు

వాలంటీర్లకు సంబంధించి కేంద్రం హోం శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. స్వచ్ఛంద సేవ అందించాలే తప్ప దీనిని వారు వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోకూడదు. గుర్తింపు కార్డులు, హోదాలు కోరేందుకు వీలుండదు. కేంద్ర హోం శాఖతో కలిసి పనిచేస్తున్నామని చెప్పుకోవడం, సామాజిక మాధ్యమాల్లో పేర్కొనడం చేయకూడదు. వాలంటీర్‌కు కొంత కాలానికి ఆసక్తి లేకపోతే తప్పుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గుర్తిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.

Updated Date - 2021-01-24T08:18:49+05:30 IST