బద్దలైన అగ్నిపర్వతం.. ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. పలు నగరాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

ABN , First Publish Date - 2022-01-16T06:53:04+05:30 IST

పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం పేలుడి ధాటికి సముద్రంలో భారీ ప్రకంపనలు జరిగి సముద్ర జలాలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. అగ్నిపర్వతం బద్దలవడంతో తీరప్రాంతాల్లో పెద్దఎత్తున బూడిద పడుతోంది...

బద్దలైన అగ్నిపర్వతం.. ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. పలు నగరాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి సముద్రంలో భారీ ప్రకంపనలు జరిగి సముద్ర జలాలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. అగ్నిపర్వతం బద్దలవడంతో తీరప్రాంతాల్లో పెద్దఎత్తున బూడిద పడుతోంది. ఈ బూడిద ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాల రూపంలో కనబడుతోందని స్థానిక మీడియా తెలిపింది.


టోంగా దీవులు.. అస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఫిజీ దీవుల సమీపంలో ఉన్నాయి. అగ్నిపర్వతం పేలుడు స్థాయి భారీగా ఉండడంతో సముద్ర జలాలు ముంచుకొచ్చే ప్రమాదముందని సమీప దేశాలు, దీవుల అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశాయి.


అస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఫిజీ దీవులతో పాటు, అమెరికా, జపాన్‌లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీవులు, సముద్ర సమీపంలో ఉన్న నగరాలలో నివసించే ప్రజలు తీరానికి దూరంలో ఏదైనా ఎత్తైనా ప్రదేశానికి వెంటనే వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

 

టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ వివరాల ప్రకారం.. పసిఫిక్‌లో మహాసముద్ర అంతర్భాగంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయి. టోంగా వద్ద అగ్నిపర్వతం 'హుంగా టోంగా-హుంగా హా'పై ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. సముద్రంలో పేలిన అగ్నిపర్వతం దృశ్యాలను శాటిలైట్లలో రికార్డయ్యాయి. హిమావరీ శాటిలైట్‌‌లో రికార్డైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


ఈ అగ్నిపర్వతం.. టోంగాన్‌ రాజధాని నుకువాలోఫాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగ్నిపర్వతం పేలిన శబ్దాలు 8 నిమిషాల పాటు వినిపించాయి. విస్ఫోటన ప్రభావం 800 కిలోమీటర్ల దూరంలో ఫిజీ దీవులకు కనబడింది.   పేలుడు తర్వాత నమోదైన గరిష్ట సునామీ వేవ్ 30 సెంటీమీటర్లుగా రికార్డు అయింది. పేలుడుతో ఆవరించిన అసిడిక్ బూడిద పడకుండా నీటి సేకరణ ట్యాంకులను కప్పి ఉంచాలని అక్కడ నివాసితులను అధికారులు హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండాలని, బయటకు వస్తే మాస్క్ ధరించాలని టోంగా జియోలాజికల్ సర్వీసెస్ అధిపతి తానియెలా కులా ప్రజలకు సూచించారు.










Updated Date - 2022-01-16T06:53:04+05:30 IST