Mohammed Zubair Case: అసమ్మతి గళం అవసరం : ఢిల్లీ కోర్టు

ABN , First Publish Date - 2022-07-16T17:07:34+05:30 IST

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబెయిర్‌కు బెయిలు

Mohammed Zubair Case: అసమ్మతి గళం అవసరం : ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబెయిర్‌కు బెయిలు మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ మతం అత్యంత పురాతన మతాల్లో ఒకటి అని, అంతేకాకుండా అత్యంత సహనశీల మతమని పేర్కొంది. 2018లో జుబెయిర్ ఇచ్చిన ఓ ట్వీట్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పోలీసులు చేసిన వాదనను తోసిపుచ్చింది. 


జుబెయిర్ ఇచ్చిన ట్వీట్‌లో ‘‘2014కి పూర్వం’’, ‘‘2014 తర్వాత’’ అని పేర్కొన్నారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయం సాధించి, నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జుబెయిర్‌కు అడిషినల్ సెషన్స్ జడ్జి దేవేందర్ కుమార్ జంగాల బెయిలు మంజూరు చేశారు. భారత దేశ ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు విమర్శలను ఎదుర్కొనదగినవేనని తెలిపారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం అసమ్మతి గళం అవసరమని చెప్పారు. ప్రజాస్వామిక సమాజానికి సరైన పునాది నిస్సందేహంగా వాక్ స్వాతంత్ర్యమేనని తెలిపారు. ఓ వ్యక్తిని శిక్షించడానికి ఆ వ్యక్తి ఓ రాజకీయ పార్టీని విమర్శించడం ప్రాతిపదిక కాబోదని వివరించింది. 


అత్యంత ప్రాచీన మతాల్లో హిందూ మతం ఒకటి అని, ఇది అత్యంత సహనశీల మతమని జడ్జి తెలిపారు. హిందూ మతాన్ని అనుసరించేవారు కూడా సహనశీలురని తెలిపారు. హిందూ మతం ఎంత సహనశీలమైనదంటే, ఆ మతాన్ని అనుసరించేవారు తమ దేవీ, దేవతల పేర్లను సంస్థలు, వ్యవస్థలు, కేంద్రాలకు పెట్టుకోవడం గర్వకారణంగా భావిస్తారన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే, హిందూ దేవీ, దేవతల పేర్లపై ఇన్‌కార్పొరేట్ అయిన కంపెనీలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయన్నారు. కాబట్టి హిందూ దేవీ, దేవతల పేరును ఓ సంస్థ/ కేంద్రం/ వ్యవస్థ/ బిడ్డకు పెట్టడం భారత శిక్షా స్మృతి (IPC)లోని సెక్షన్ 153ఏ, సెక్షన్ 295ఏలను ఉల్లంఘించడం కాదని వివరించారు. ఈ రెండు సెక్షన్లు మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, తదితర ఆరోపణలకు సంబంధించినవి. 


ప్రజాదరణ పొందిన ఓ హిందీ సినిమా సన్నివేశాన్ని స్క్రీన్‌షాట్ తీసి 2018లో ట్వీట్ చేసినందుకు  ఢిల్లీ పోలీసులు జుబెయిర్‌పై కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదుపై  కేసు నమోదు చేసి, ఆయనను జూన్ 27న అరెస్టు చేశారు. ఈ ట్వీట్ వల్ల హిందువుల మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేసిన ఈ ఫిర్యాదుదారును ఢిల్లీ పోలీసులు గుర్తించలేకపోయారని హైకోర్టు వ్యాఖ్యానించింది. 


జుబెయిర్‌కు ఈ కేసులో బెయిలు మంజూరైనప్పటికీ, ఉత్తర ప్రదేశ్‌లో ఆరు కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఆయన జైలులోనే గడపవలసి ఉంటుంది. 


ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ముందుకు రాకపోతే ప్రజాస్వామ్యం పని చేయదని, వృద్ధి చెందదని జుబెయిర్‌కు ఇచ్చిన బెయిలు ఆర్డర్‌లో జడ్జి పేర్కొన్నారు. ప్రజలకు వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కల్పిస్తున్న రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఏ)ను ప్రస్తావించారు. సరైన ప్రాతిపదికపై అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి ఈ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత సమాచారం తెలుసుకుని, ప్రజలు తమ సాంఘిక, ఆర్థిక, రాజకీయ హక్కులను సమాజంలో స్వేచ్ఛగా వినియోగించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. 


‘‘దరఖాస్తుదారు 1983లో విడుదలైన ‘కిసీ సే నా కెహనా’ చలన చిత్రంలోని సన్నివేశానికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సర్టిఫై చేసింది. ఇది ప్రభుత్వ చట్టబద్ధ వ్యవస్థ. ఇది అప్పటి నుంచి ప్రజలు చూడటానికి అందుబాలులో ఉంది. ఈ సన్నివేశం సమాజంలోని ఫలానా వర్గానికి చెందినవారి మనోభావాలను గాయపరచినట్లు ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలైనట్లు కనిపించలేదు’’ అని కోర్టు తెలిపింది. పాస్‌పోర్టును ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అందజేయాలని జుబెయిర్‌ను ఆదేశించింది. 




Updated Date - 2022-07-16T17:07:34+05:30 IST