రెట్రో’ ట్యాక్స్‌ కేసులో వొడాఫోన్‌కు ఊరట

ABN , First Publish Date - 2020-09-26T06:39:54+05:30 IST

రెట్రోస్పెక్టివ్‌ పన్ను విషయంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టులో బ్రిటిష్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ గ్రూప్‌ పీఎల్‌సీ విజయం సాధించింది...

రెట్రో’ ట్యాక్స్‌ కేసులో వొడాఫోన్‌కు ఊరట

  • ఆర్బిట్రేషన్‌ కోర్టులో భారత్‌పై విజయం
  • రూ.22,100 కోట్ల పన్ను వసూలు సరికాదు
  • కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశం 


న్యూఢిల్లీ : రెట్రోస్పెక్టివ్‌ పన్ను విషయంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టులో బ్రిటిష్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ గ్రూప్‌ పీఎల్‌సీ విజయం సాధించింది. వెనుకటి తేదీలతో వర్తించేలా (రెట్రోస్పెక్టివ్‌) వొడాఫోన్‌ గ్రూప్‌ నుంచి రూ.22,100 కోట్ల పన్ను వసూ లు చేయాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలకు నెదర్లాండ్స్‌.. హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్‌) ట్రైబ్యునల్‌ బ్రేక్‌ వేసింది. పాత తేదీలతో పన్ను చెల్లించాలన్న భారత ప్రభు త్వ డిమాండ్‌.. ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పంద స్ఫూర్తికి పూర్తిగా విరుద్దంగా ఉందని ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇలా వెనుకటి తేదీలతో కంపెనీల నుంచి పన్నులు వసూ లు చేయాలనుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని పేర్కొంది. అలాగే కేసు ఖర్చుల కింద 54.7 లక్షల డాలర్లు వొడాఫోన్‌కు చెల్లించాలని కూడా ట్రైబ్యునల్‌ భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ట్రైబ్యునల్‌ ఆదేశాలకు లోబడి వొడాఫోన్‌కు భారత్‌ రూ.75 కోట్ల బకాయి మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


ఇదీ కేసు 

భారత్‌లో టెలికాం సేవలు అందిస్తున్న హచిసన్‌ ఈక్విటీలో 67 శాతం వాటాను వొడాఫోన్‌ 2007లో 1,100 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. దీనికి టీడీఎస్‌ కింద రూ.11,000 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను  శాఖ నోటీసులు జారీ చేసింది. వొడాఫోన్‌ ఈ మొత్తం చెల్లించక పోవడంతో జరిమానా, వడ్డీలతో ఈ మొత్తాన్ని రూ.22,100 కోట్లకు పెంచారు. 2012 జనవరిలో ఐటీ శాఖ డిమాండ్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనుకటి తేదీలతో వర్తించేలా చట్టాన్ని సవరించి మళ్లీ వొడాఫోన్‌ గ్రూప్‌నకు పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. దాంతో వొడాఫోన్‌ 2014లో ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేసింది. 


ఇతర కేసులపై ప్రభావం 

కాగా ప్రస్తుతం అంతర్జాతీయ ఇంధన సంస్థ కెయిర్న్‌ ఎనర్జీపైనా ఇదే తరహా కేసు నడుస్తోంది. బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ సంస్థ 2006లో రాజస్థాన్‌లోని చమురు క్షేత్రం వాటాను వేదాంత గ్రూప్‌నకు విక్రయించింది. ఈ అమ్మకం ద్వారా వచ్చిన లాభాలపై రూ.10,247 కోట్లు మూలధన లాభాల పన్ను చెల్లించాలని ఐటీ శాఖ.. కెయిర్న్‌కు నోటీసులు జారీ చేసింది. కెయుర్న్‌ కూడా దీన్ని ట్రైబ్యునల్‌లో సవాల్‌ చేసింది. 


అన్ని అంశాలను పరిశీలిస్తాం: కేంద్రం

వొడాఫోన్‌ ఆర్బిట్రేషన్‌ వ్యవహారంలో అన్ని అవకాశాలను కూలంకషంగా పరిశీలించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తమ కౌన్సిల్స్‌తో చర్చించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పన్ను రిఫండ్‌ కేవలం రూ.75 కోట్లకు పరిమితం కావచ్చని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో రూ.30 కోట్లు ఖర్చులు కాగా రూ.45 కోట్లు పన్ను రిఫండ్‌ ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Updated Date - 2020-09-26T06:39:54+05:30 IST