వీవోఏ నాగదుర్గపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-17T06:02:27+05:30 IST

వీవోఏ నాగదుర్గపై చర్యలు తీసుకోవాలి

వీవోఏ నాగదుర్గపై చర్యలు తీసుకోవాలి
అధికారులతో వాగ్వివాదానికి దిగిన డ్వాక్రా మహిళలు

ఆమె వాడుకున్న సొమ్ము తిరిగి ఇప్పించాలి..గ్రామసభలో డ్వాక్రా మహిళల ఆందోళన

పాలకొల్లు రూరల్‌, మే 16: మండలంలోని లంకలకోడేరులో డ్వాక్రా వీవోఏగా పనిచేస్తున్న సీహెచ్‌ నాగదుర్గ గ్రూపుల నిధులు సొంతానికి వాడుకుని అవినీతికి పాల్పడ్డారని, సొమ్ము తిరిగి ఇప్పించి, ఆమెపై చర్యలు తీసుకోవాలని గ్రామసభలో డ్వాక్రా మహిళలు డిమాండ్‌ చేశారు. స్పందనలో వారంతా నాగదుర్గపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సోమవారం గ్రామంలో అధికారులు విచారణ చేశారు. 25 డ్వాక్రా గ్రూపులు ఉండగా వాటిలో 16 గ్రూపుల నుంచి రూ.19.98 లక్షలు నాగదుర్గ సొంతానికి వాడుకున్నట్టు విచారణలో నిర్ధారణ అయిందని ఏపీఎం పి.సతీష్‌ కుమార్‌ తెలిపారు. నాగదుర్గ అధికారులకు సహకరించడం లేదని ఆయన తెలిపారు. నాగదుర్గను సమావేశానికి పిలిచి తమకు న్యాయం చేయాలని పెద్ద సంఖ్యలో సమావేశానికి వచ్చిన డ్వాక్రా మహిళలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అనారోగ్యంగా ఉండటంతో నాగదుర్గ రాలేదని తమకు సమాచారం వచ్చిందని, ఆమెను ఇక్కడకు పిలిపించే పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. నాగదుర్గ వాడుకున్న సొమ్మును తిరిగి గ్రూపు సభ్యులకు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని, శ్రీనిధి మేనేజర్‌ హామీ ఇచ్చారు. దీంతో మహిళలు శాంతించారు. సర్పంచ్‌ చొప్పల రజని, వైస్‌ ఎంపీపీ వై.నాగేశ్వరరావు, యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామచంద్రారెడ్డి, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:02:27+05:30 IST