ఇవ్వమన్నది రూ.10వేలు.. ఇచ్చేది రూ.8వేలే..

ABN , First Publish Date - 2022-03-18T05:29:56+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో డ్వాక్రా సంఘాల వద్ద పనిచేస్తున్న వీవోఏ (గ్రామీణ సంస్థ సహాయకులు)లకు నెలకు జీతం రూ.10వేలు ఇచ్చేలా వరాలు కురిపించారు.

ఇవ్వమన్నది రూ.10వేలు.. ఇచ్చేది రూ.8వేలే..
వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం కార్యాలయం

ఎమ్మెల్యే ఆదేశాలు పాటించని వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం అధికారులు

రెండేళ్లుగా రూ.14లక్షలు నష్టపోయిన వీవోఏలు  


మనుబోలు, మార్చి 17: వైసీపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో డ్వాక్రా సంఘాల వద్ద పనిచేస్తున్న వీవోఏ (గ్రామీణ సంస్థ సహాయకులు)లకు నెలకు జీతం రూ.10వేలు ఇచ్చేలా వరాలు కురిపించారు. దీంతో వారు సంతోషంతో రెండేళ్ల క్రితం సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి జై కొట్టారు. అయితే ఈ విధానం అంతటా అమలు కావడం లేదు. సర్వేపల్లి నియోజవర్గంలో మాత్రం ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రతి వీవోఏకు రూ.10వేలు ఇచ్చేలా ఏపీఎంలను ఆదేశించారు. నియోజకవర్గంలోని 4మండలాల్లో వీవోఏలకు రూ. 10వేల జీతం అందుతున్నా.. మనుబోలు మండలంలో మాత్రం వీవోఏలకు రూ.10వేలు జీతం అందని ద్రాక్షలా మారింది. ఎమ్మెల్యే ఆదేశాలను వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం అధికారులు తుంగలో తొక్కేశారు. రెండేళ్లుగా అదనంగా ఇచ్చే రూ.2వేల జీతంలో అవకతవకలు జరిగి ఉంటాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.  

మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 886 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిని  29 సంఘబంధాలకు అనుసంధానం చేశారు. ఒక్కో సంఘబంధంకు ఒక్కో వీవోఏ పనిచేస్తుంటారు. వీరికి గత ప్రభుత్వంలో జీతాలు  చాలా తక్కువగా ఉండేవి. అప్పగించిన పనిలో ప్రతిభ ఆధారంగా కమీషన్లు ఇచ్చేవారు. కాగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక సెర్ప్‌ నుంచి ప్రతి వీవోఏకు రూ. 8వేలు, సంఘబంధాల్లో ఆదాయాలు ఉంటే వాటి నుంచి రూ.2వేలు అదనంగా జీతంలో కలిపి ప్రతినెలా రూ.10వేలు ఇవ్వాలని 2019 నవంబరులో ఆదేశాలు ఇచ్చారు. అయితే గ్రామీణ వీవోఏలకు నెలకు రూ.10వేల జీతం కలగా మారింది. 29మంది వీవోఏలకు రెండేళ్ల నుంచి అదనపు రూ.2వేలు అందడం లేదని తెలుస్తోంది. ఒక నెలకు 29మంది వీవోఏలు రూ.58వేలు నష్టపోతున్నారు. ఈ క్రమంలో రెండేళ్లలో దాదాపుగా రూ.14లక్షలు కోల్పోయారు. సెర్ప్‌ నుంచి ప్రతినెలా జీతాలు అందవు. మూడు, ఐదు నెలలకోసారి వస్తాయి. వచ్చినప్పుడల్లా  సీఎం సహాయనిధికి అని, కార్యాలయంలో ప్రింటర్‌కని, ఎమ్మెల్యే సమావేశాలు అంటూ వాటాలు వేసి వసూలు చేస్తున్నారని వీవోఏలు ఆరోపిస్తున్నారు. వాటాలు పోగా వచ్చే జీతంలో ఎలా బతకాలని వారు పేర్కొంటున్నారు. పై అధికారిని గట్టిగా ప్రశ్నిస్తే.. తమ ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనన్న భయాందోళనలో  ఉన్నారు. కాగా తొలగించిన వీవోఏలను లెక్కల్లో కొనసాగిస్తూ జీతాలు స్వాహా చేస్తున్నారని, కొత్త వీవోఏల నియామకంలో కమీషన్లు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో వీవోఏల జీతభత్యాలపై ఉన్నతాధికారులు క్షుణ్ణంగా విచారణ జరిపి వారికి అందాల్సిన రూ.2వేలు అదనపు జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మహిళామణులు కోరుతున్నారు.

ఈ విషయంపై మండల ఏపీఎం శైలజను వివరణ కోరగా.. రెండేళ్లగా   అదనపు జీతం రూ.2వేలు ఎవ్వరికి ఇవ్వలేదన్నారు. ఆడిట్‌ ఇటీవలే జరిగిందని, ఎమ్మెల్యే 2021 డిసెంబరు నుంచి ఆదాయం ఉన్నా, లేకున్నా ప్రతి వీవోఏకి ఇవ్వమన్నారని, ఈ విషయం పీడీకి తెలిపామన్నారు. త్వరలోనే పరిశీలించి అందరికి జీతం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Updated Date - 2022-03-18T05:29:56+05:30 IST