వాన..వణుకు

ABN , First Publish Date - 2022-01-17T04:39:55+05:30 IST

అకాల వర్షం రైతులను వణికిస్తోంది. జిల్లాలో నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన వాన ఆదివారం కూడా పలుప్రాంతాల్లో కొనసాగింది. కొన్ని మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా కురిసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. కోతలు జరిగిన పొలాల్లో వరి ఓదెలు, కల్లాల్లో ఉన్న మిర్చి నీటి పాలయ్యాయి. పలుప్రాంతాల్లో శనగ, పొగాకు ఇతర మెట్ట పంటలు సాగు చేసిన చేలల్లో వర్షపు నీరు చేరి దెబ్బతింటున్నాయి. ఇలా దాదాపు 25 నుంచి 30 వేల ఎకరాల్లో పంటలు ఇప్పటికే దెబ్బతిన్నాయి.

వాన..వణుకు
త్రిపురాంతకంలో వర్షాలకు నేలవాలిన మిర్చిచేను

కొనసాగుతున్న వర్షం

ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం

పలుచోట్ల తడిసిన వరి ఓదెలు, కల్లాల్లో మిర్చి

శనగ, పొగాకు, మినుము చేలల్లో చేరిన వర్షపు నీరు

ఇంకా కురిస్తే కోలులేని దెబ్బ

ఆందోళనలో అన్నదాతలు 

ఒంగోలు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : అకాల వర్షం రైతులను వణికిస్తోంది. జిల్లాలో నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన వాన ఆదివారం కూడా పలుప్రాంతాల్లో కొనసాగింది. కొన్ని మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా కురిసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. కోతలు జరిగిన పొలాల్లో వరి ఓదెలు, కల్లాల్లో ఉన్న మిర్చి నీటి పాలయ్యాయి. పలుప్రాంతాల్లో శనగ, పొగాకు ఇతర మెట్ట పంటలు సాగు చేసిన చేలల్లో వర్షపు నీరు చేరి దెబ్బతింటున్నాయి.  ఇలా దాదాపు 25 నుంచి 30 వేల ఎకరాల్లో పంటలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. వర్షం ఇంకా కొనసాగితే అంతకురెండు మూడు రెట్లు పంటలకు నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో కర్షకుల్లో కలవరం మొదలైంది. 

నాలుగు రోజుల్లో 30మి.మీ సగటు వర్షపాతం

జిల్లాలో బుధవారం రాత్రి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈనాలుగురోజుల వ్యవధిలో 30 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. సగం మండలాల్లో 50 మి.మీపైగా కురిసింది. ఆదివారం ఉదయం 9గంటలకు 24 గంటల వ్యవధిలో 4.0 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గరిష్ఠంగా సింగరాయకొండలో 49.6 మి.మీ, దొనకొండలో 41.0, త్రిపురాంతంలో 30.0, టంగుటూరులో 22.6, మార్కాపురంలో 19.8, కందుకూరులో 16.4, తర్లుబాడులో 14.8, వై.పాలెంలో 13.8, ఉలవపాడులో 10.8 మి.మీ కురిసింది. ఇతర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. తిరిగి ఆదివారం పగలు కూడా పలు చోట్ల జల్లులు పడ్డాయి. దొనకొండ మండలంలో 63.50 మి.మీ వర్షం కురిసింది. సింగరాయకొండ మండలంలో 16.2, ఒంగోలు రూరల్‌ మండలంలో 15.5, దర్శిలో 15.0, కందుకూరు అద్దంకి, కొనకనమిట్ల,పంగులూరు ముండ్లమూరు తదితర మండలాల్లో జల్లులు పడ్డాయి. 

ఇప్పటికే పలు పంటలకు నష్టం 

 అకాల వర్షాలకు సాగర్‌, కొమ్మమూరు ఆయకట్టు ప్రాంతాల్లో వరిపంట దెబ్బతింది. దర్శి ప్రాంతంలో దాదాపు 5వేల ఎకరాల్లో వరి కోత కోసి ఓదెలపైనా, మరికొంత కోతదశలో ఉండగా ప్రస్తుత వర్షంతో అది దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. చీరాల ప్రాంతంలో దాదాపు 2వేల ఎకరాల్లో కోసి  ఉన్న వరి ఓదెలు నీట మునిగాయి. దొనకొండ మండలంలో కల్లాల్లోని మిరప కాయలు తడిసిపోయాయి. త్రిపురాంతకం మండలం గాంధీనగర్‌, మిరియంపల్లి గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. ఇక ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల్లో దాదాపు 2వేల ఎకరాలకుపైగా శనగ పంట నీట మునగగా కందుకూరు, ఒంగోలు వేలం కేంద్రాల పరిధిలోని దాదాపు 5వేల ఎకరాల్లోని పొగాకు తోటలు ఉరకెత్తడం లేదా వర్షాలకు ఆకులపై మడ్డి కారిపోయి నాణ్యత తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. పర్చూరు, అద్దంకి, దర్శి ప్రాంతాల్లో సాగు చేసిన వైట్‌బర్లీ, చినగంజాం ప్రాంతంలో ఉప్పు పంటకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.  మరో రెండు, మూడు రోజులు ఇలాగే జల్లులు కొనసాగితే కోలుకోలేని నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. 

 




Updated Date - 2022-01-17T04:39:55+05:30 IST