జనం చెవిలో పువ్వు!

ABN , First Publish Date - 2022-08-08T06:12:50+05:30 IST

మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు ప్లాట్లు అందిస్తామంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పేరుతో పథకాన్ని ప్రకటించిన వీఎంఆర్‌డీఏ యంత్రాంగం ల్యాండ్‌పూలింగ్‌లో రైతులనుంచి భూములను సమీకరించింది.

జనం చెవిలో పువ్వు!
రియల్టర్లతో సమావేశమైన వీఎంఆర్‌డీఏ చైౖర్‌పర్సన్‌ (ఫైల్‌ఫొటో)

ఎంఐజీ ప్లాట్లపై రియల్టర్లతో వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ భేటీ

లాభాపేక్ష లేకుండా ముందుకు రావాలని పిలుపు

 

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) జనం చెవిలో పువ్వులు పెడుతోంది. ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ - తక్కువ ధరకు ఎంఐజీ ప్లాట్లు’ పేరుతో రూపొందించిన పథకానికి ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఎలా అయినా దానిని ముందుకు తీసుకెళ్లడానికి పడరాని పాట్లు పడుతోంది.  ఇందులో భాగంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ముందుకురావాలని వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ కోరడం దీనికి బలాన్నిస్తోంది.   


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)  

మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు ప్లాట్లు అందిస్తామంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పేరుతో పథకాన్ని ప్రకటించిన వీఎంఆర్‌డీఏ యంత్రాంగం ల్యాండ్‌పూలింగ్‌లో రైతులనుంచి భూములను సమీకరించింది. నిబంధనల మేరకు వాటిని అభివృద్ధి చేసి అందులో రైతులకు వాటా ఇవ్వాలి. మిగిలిన వాటిని విక్రయించాలి. ఈ మేరకు ఆనందపురంలోని మూడు చోట్ల వేసిన లే అవుట్‌లలో ప్లాట్లను అమ్మకానికి పెట్టి నాలుగునెలలైనా జనం నుంచి స్పందన కనిపించడంలేదు. దీనికి రెండు కారణాలున్నాయి. పాలవలస, రామవరం, గంగసాని అగ్రహారాల్లో లేఅవుట్లు వేస్తున్నామని ప్రకటించారే తప్ప అక్కడ ఎటువంటి పనులు చేపట్టలేదు.  బీడు భూములు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది ఒక కారణం కాగా, మార్కెట్‌ ధర కంటే తక్కువకు అందిస్తామని చెప్పి,  ప్రైవేటు రియల్టర్లు ప్రస్తుతం విక్రయిస్తున్న ధరలనే ప్రకటించారు. ఇది రెండో కారణం. అయితే వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌ కాబట్టి... ఎలాంటి సమస్యలు ఉండవని కొనుగోలు చేయాలే తప్ప... ధర తక్కువని చెప్పడానికి లేదు. ఈ నేపథ్యంలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌పై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. 


లాభాపేక్ష లేకుండా ఎలా?

జగనన్న ఎంఐజీ ప్లాట్ల పథకానికి సహకరించాలని, ఎలాంటి లాభాపేక్ష రాకుండా ముందుకు రావాలని వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల శనివారం వీఎంఆర్‌డీఏలో నిర్వహించిన సమావేశంలో అప్రెడా, నరెడ్కో సంఘాలకు చెందిన రియల్టర్లను కోరారు. లాభం లేకుండా రియల్టర్లు ఎందుకు ముందుకు వస్తారన్నది ఇక్కడ ప్రశ్న. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు వారి సొంత భూముల్లో లేఅవుట్లు వేసి, అందులో 40 శాతం వాటా ప్లాట్లు వీఎంఆర్‌డీఏకి ఇస్తే... వాటిని మార్కెట్‌ రేటు కంటే తక్కువకు ప్రజలకు విక్రయించాలనేది వీఎంఆర్‌డీఏ ప్రతిపాదన. సాధారణంగా తెలిసిన రియల్టర్‌ అయినా కనీసం గజానికి రూ.50 కూడా ధర తగ్గించరు. అంతేకాకుండా ఇప్పుడు లేఅవుట్‌ వేస్తే.. ఫీజులతో పాటు స్థానిక నేతలకు ఎకరాకు ఇంత అని ఇవ్వాల్సి వస్తోందని, పెద్దగా లాభాలు రావడం లేదని అనేక సందర్భాల్లో ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంలో 40 శాతం అంటే దాదాపుగా లేఅవుట్‌లో సగం ప్లాట్లను తక్కువ ధరకు వీఎంఆర్‌డీఏకు ఎందుకు ఇస్తారు? వారు వేసిన లే అవుట్‌లలో వీఎంఆర్‌డీఏనే తక్కువ ధరకు అమ్మితే.. మిగిలిన ప్లాట్లను అధికధరకు ఎలా విక్రయించగలరనేది ఆలోచించాల్సిన విషయం.


ఆక్రమిత భూముల అనుమతికేనా?

ఈ పథకంలో భూములు రియల్టర్లవి కాబట్టి... వాటిలో లేఅవుట్లు వేస్తే అనుమతులు త్వరగా ఇస్తామని వీఎంఆర్‌డీఏ ఆశ చూపుతోంది. రియల్టర్లలో పేరున్న వారు సహా కొంతమంది ప్రభుత్వ భూములను, పక్కవారి భూములను ఆక్రమించి లేఅవుట్లు వేసేవారున్నారు. అలాంటి వారికే ఈ పథకం ఉపయోగపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమిత భూములతో కలిపి లేఅవుట్‌ వేస్తే... వీఎంఆర్‌డీఏ అనుమతి ఇచ్చేస్తుంది కాబట్టి... ఉభయులకూ లాభం. ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు నడపడానికే ఈ పథకం ప్రవేశపెట్టారని పలువురు  ఆరోపిస్తున్నారు.  వీలుంటే ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి తక్కువ ధరకు ప్రజలకు ఇవ్వాలని, భూమి లేకుండా, అభివృద్ధి చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పథకాలు ప్రకటించి, వాటికి జనం నుంచి సొమ్ము సేకరించే ఆలోచనలు ఎలా చేస్తున్నారని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని పథకాలను ప్రచారంలోకి తెచ్చి.. జనం చెవిలో పువ్వులు పెట్టవద్దని నగరంలోని మధ్య తరగతి జనం సూచిస్తున్నారు. 

Updated Date - 2022-08-08T06:12:50+05:30 IST