Advertisement
Advertisement
Abn logo
Advertisement

పార్కులో పాగా!

వెలంపల్లి ఫౌండేషన్‌ చేతికి వీఎంసీ పార్కు

ఫౌండేషన్‌ పేరుతో కల్యాణ మండపం నిర్మాణం

పెత్తనం కోసం వైసీపీ కార్పొరేటర్ల మధ్య పోటీ


విజయవాడ నగరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సరైన ఉద్యానవనాలే లేవు. ఉన్న ఉద్యానవనాలను నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించే రీతిగా అభివృద్ధి చేయాల్సిన నగర పాలకులు ఆ పని చేయకపోగా, కల్యాణ మండపాల పేరిట ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేస్తున్నారు. 56వ డివిజన్‌లోని నగర పాలక సంస్థ పార్కులో కల్యాణ మండపం నిర్మాణ పనులను చేపట్టడమే ఇందుకు నిదర్శనం. ఇంతకూ కల్యాణ మండపం ముసుగులో పార్కును స్వాహా చేసింది మామూలు వ్యక్తులు కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర దేవదాయశాఖ మంత్రికి చెందిన వెలంపల్లి ఫౌండేషన్‌ కావడం గమనార్హం. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ నగరంలోని 56వ డివిజన్‌లో ఫోర్‌మెన్‌ బంగ్లాకు ఆనుకుని నగర పాలక సంస్థ పార్కు ఉంది. ఆ పార్కు నిర్వహణ సరిగా లేక చాలా కాలంగా నిరుపయోగంగా ఉంటోంది. దీన్ని అభివృద్ధి చేయాల్సిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించకుండా, పార్కును ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు సిద్ధమయ్యారు. పార్కు గంజాయి బ్యాచ్‌లకు అడ్డాగా మారిందని, దాన్ని కల్యాణ మండపంగా మార్చాలని గతంలో టీడీపీ హయాంలోనే కౌన్సిల్‌లో ప్రతిపాదన రాగా అప్పటి పాలకవర్గం తిరస్కరించింది. వైసీపీ వీఎంసీ పీఠాన్ని దక్కించుకున్న వెంటనే పాత ప్రతిపాదనను మళ్లీ ముందుకు తెచ్చి, ఆమోదించేశారు. 56వ డివిజన్‌ కార్పొరేటర్‌ యలకల చలపతిరావు ఈ ప్రతిపాదనను కౌన్సిల్‌లో ప్రవేశపెట్టగా.. ఆగమేఘాలపై దానిని ఆమోదించేశారు. దీంతో ఆ పార్కును తొలగించి, ఆ ప్రదేశంలో వెలంపల్లి ఫౌండేషన్‌ పేరుతో కల్యాణ మండపం నిర్మాణ పనులను చేపట్టారు. దానిని శనివారం ప్రారంభించారు. అసలే నగరంలో పచ్చదనం కరువై.. నగరవాసులకు ఆహ్లాదం దూరమవుతుంటే, ఉన్న పార్కులను సైతం కల్యాణ మండపాలుగా మార్చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్కును అభివృద్ధి చేసి, స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలసిన నగర పాలకులు నిరుపయోగంగా ఉందంటూ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


పెత్తనం కోసం కార్పొరేటర్ల పోటీ

ఈ పార్కు గతంలో పాత 36వ డివిజన్‌లో ఉండేది. డివిజన్‌ల సర్దుబాటులో ఇది కొత్త 56వ డివిజన్‌ పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం 56వ డివిజన్‌కు యలకల చలపతిరావు కార్పొరేటర్‌గా ఉన్నారు. పాత 36వ డివిజన్‌ ప్రస్తుతం 55వ డివిజన్‌గా మారింది. దానికి శిరంశెట్టి పూర్ణచంద్రరావు కార్పొరేటర్‌గా ఉన్నారు. ఈ కల్యాణ మండపం నిర్మిస్తున్న ప్రాంతం గతంలో తన డివిజన్‌లోనే ఉండేదని, కాబట్టి ఇక్కడ ఏదైనా తాను చెప్పినట్టే జరగాలని 55వ డివిజన్‌ కార్పొరేటర్‌ పట్టుబడుతుండగా.. ప్రస్తుతం ఈ ప్రాంతం తన డివిజన్‌ పరిధిలో ఉందని, దానిపై తనకే అధికారం ఉందని 56వ డివిజన్‌ కార్పొరేటర్‌ వాదనకు దిగుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్యా మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో మంత్రి రంగప్రవేశం చేసి ఇద్దరికీ సర్దిచెప్పి, పార్కు స్థలంలో వెలంపల్లి ఫౌండేషన్‌ పేరుతో కల్యాణ మండపాన్ని నిర్మించారు.


కాగా పార్కు స్థలాన్ని ప్రైవేటు ఫౌండేషన్‌కు అప్పగించడంపై వీఎంసీ ఈఈ నారాయణమూర్తి మాట్లాడుతూ.. కల్యాణ మండప నిర్మాణాన్ని మరికొద్ది రోజుల్లో పూర్తి చేసి, వీఎంసీ ఎస్టేట్‌ సెక్షన్‌కు అప్పగిస్తామని ఫౌండేషన్‌ వారు హామీ ఇచ్చారని చెప్పారు. 

Advertisement
Advertisement