పుతిన్ పుట్టుకే గ్రేట్.. ఆసక్తికర విషయం వెలుగులోకి!

ABN , First Publish Date - 2022-02-27T00:05:10+05:30 IST

యాదృచ్ఛికంగానో, కాకతాళీయంగానో చరిత్రలో జరిగిన కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఔరా అనిపిస్తాయి.

పుతిన్ పుట్టుకే గ్రేట్..  ఆసక్తికర విషయం వెలుగులోకి!

మాస్కో: యాదృచ్ఛికంగానో, కాకతాళీయంగానో చరిత్రలో జరిగిన కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఔరా అనిపిస్తాయి. పూర్వజన్మలను, కర్మ సిద్ధాంతాలను నమ్మేవారు వాటి గురించి తెలిసినప్పుడు ‘అవును సుమా’ అంటూ ఉంటారు. వాటిపై నమ్మకం లేనివారు మరో రకంగా చెప్పుకుంటారు.


ఇక్కడ ఒకసారి అడాల్ఫ్ హిట్లర్ గురించి చెప్పుకోవాలి. హిట్లర్‌కు కళ అంటే ఎనలేని అభిమానం. అందులో నిష్ణాతుడు కావాలని, మంచి కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కన్నాడు. ఇందుకోసం వియన్నాలోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. రెండుసార్లు అతడి దరఖాస్తులు తిరస్కరానికి గురయ్యాయి. దీంతో ఇక లాభం లేదని సైన్యంలో చేరాడు. ఆ తర్వాత అతడు ప్రపంచానికి ఎలా పరిచయమైందీ చెప్పుకోవడం ఇక్కడ అప్రస్తుతం. కొన్ని ఘటనలు మానవ జీవన గమనాన్ని ఒక్కసారిగా మారుస్తుంటాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 


ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. వ్లాదిమిర్ పుతిన్. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోళ్లలోనూ నానుతోంది. కారణాలేమైనా.. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడడమే అందుకు కారణం. రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుంటే ప్రపంచం మొత్తం చేష్టలుడిగి చూస్తోంది.


అసలు పుతిన్ అంత గొప్ప బలశాలి ఎలా అయ్యారు? అగ్రరాజ్యాల ఆంక్షల్ని సైతం బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్‌పై  విరుచుకుపడేంత తెగువ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే అతడి పుట్టుక గురించి తెలుసుకోవాలి. అందుకోసం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటికి వెళ్లాలి.


రెండో ప్రపంచ యుద్ధం హోరాహోరీగా జరుగుతోంది. రష్యా సైనికుడు ఒకరు యుద్ధం నుంచి కొద్దిపాటి విరామం తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అతడు తాను నివాసముండే అపార్ట్‌మెంట్‌కు సమీపిస్తున్న సమయంలో చూసిన ఓ ఘటన కన్నీళ్లు తెప్పించింది. రోడ్డుపై గుట్టలుగా పడివున్న శవాలను శ్మశానాలకు తరలించేందుకు ఓ వ్యక్తి వాటిని ట్రక్కులోకి ఎక్కిస్తున్నాడు.


కాసేపట్లోనే అతడు అక్కడికి సమీపించాడు. గుట్టలుగా పడివున్న మృతదేహాల్లోని ఓ మహిళ కాళ్లు అతడిని ఆకర్షించాయి. షూ ధరించి ఉన్న ఆ కాళ్లను అతడు గుర్తు పట్టాడు. ఆమె తన భార్యేనని తెలుసుకోవడానికి అతడికి ఎన్నో క్షణాలు పట్టలేదు. వెంటనే గుండెబరువెక్కింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ మృతదేహాన్ని తీసేందుకు ప్రయత్నించాడు. అక్కడున్న వ్యక్తి వారించి వాగ్వివాదానికి దిగాడు.


చివరికి భార్య మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకుని తన అపార్ట్‌మెంట్‌లోకి పరుగులు తీశాడు. ఆ తర్వాత ఆమెను శరీరం వెచ్చగా ఉండడం, ముక్కుపుటాలు అదురుతుండడంతో ఆమె బతికే ఉందని గ్రహించాడు. మరేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సాయం అందించాడు. దీంతో ఆమె కోలుకుంది. అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.


ఈ ఘటన జరిగిన సరిగ్గా 8 ఏళ్లకు అంటే.. 7 అక్టోబరు 1952లో ఆమె ఓ అబ్బాయికి జన్మనిచ్చింది. అతడే.. ఇప్పుడు ప్రపంచం మొత్తం కలవరిస్తున్న వ్లాదిమిర్ పుతిన్. మరో క్షణంలో శ్మశానానికి చేరుకోవాల్సిన ఆమె తిరిగి జీవించడం వెనక ఏదైనా పరమార్థం ఉందా? ఆమె శ్మశానానికి చేరుకుని ఉంటే పుతిన్ అనేవాడు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యేవాడా? సమాధానాలు లేని ప్రశ్నలివి.


అప్పటి లెనిన్‌గ్రాడ్, ఇప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుతిన్ జన్మించాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ నగరంలో 900 రోజులపాటు మూతలోనే ఉంది. 10 లక్షల మందికిపైగా ఆకలితో అలమటించి చనిపోయారు. చాలా కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ సమయంలో జన్మించినవాడే పుతిన్. తండ్రి వ్లాదిమిర్. తల్లి మరియా. ‘హార్డ్ చాయిసెస్’ అనే పుస్తకంలో హిల్లరీ క్లింటన్ ఈ విషయాలను పంచుకున్నారు. 


స్కూలు విద్యను పూర్తి చేసిన తర్వాత పుతిన్ లెనిన్‌గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి, న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. ఆ తర్వాత 100 మందికిపైగా విద్యార్థులను రష్యా గూఢచార సంస్థ కేజీబీలోకి తీసుకున్నారు. వారిలో పుతిన్ ఒకరు.


నిజం చెప్పాలంటే పుతిన్ పాఠశాల విద్య పూర్తికాక ముందే ఇంటెలిజెన్స్‌లో పనిచేయాలని కోరుకున్నారు. 16 ఏళ్ల వయసులోనే స్వచ్ఛందంగా అందులో పనిచేశారు. 1990 వరకు ‘కేజీబీ’లో పనిచేసిన పుతిన్.. సోవియట్ యూనియన్ పతనానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. పోరాట పటిమ, లక్ష్యాలను సాధించాలనే దృఢ సంకల్పం వంటి విలక్షణమైన లక్షణం పుతిన్ సొంతమని ఆయన కళాశాల క్లాస్‌మేట్,  ఒకప్పటి సహచర కేజీబీ అధికారి పావెల్  కోషెలెవ్ గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2022-02-27T00:05:10+05:30 IST