Vizainagaram: తెలుగుదేశం పార్టీ అధినేత నారా Chandrababu నాయుడు శుక్రవారం విజయనగరం జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. ఇందుకోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో ‘ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న బరోసా’ కార్యక్రమాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. భోగాపురం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు రోడ్ షో ప్రారంభంకానుంది. విజయనగరంలోని దాసన్నపేట రైతు బజారు కూడలి, నెల్లిమర్ల, చీపురపల్లి వరకు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు.
చంద్రబాబు నాయుడు ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లో శుక్రవారం రోడ్‌షోలు నిర్వహించనున్నారు. విజయనగరం మీదుగా నెల్లిమర్ల, చీపురుపల్లిలో పర్యటిస్తారు. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు రెండు రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రబాబును చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు భారీగా అభిమానులు, శ్రేణులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు ఆయన రాకకోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఒంగోలులో ఇటీవల జరిగిన మహానాడు విజయవంతమైంది. ఇదే స్ఫూర్తితో అనకాపల్లి మినీ మహానాడు కూడా అద్వితీయంగా జరిగింది. విజయనగరం జిల్లాలో పర్యటనకు తక్కువ సమయం కేటాయించడంతో చంద్రబాబు రోడ్ షోలు మాత్రమే నిర్వహిస్తున్నారు. భోగాపురం మండలంలోని ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో గురువారం రాత్రి బస చేశారు. శుక్రవారం భోగాపురం మీదుగా డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి అనంతరం చీపురుపల్లి చేరుకుంటారు. కొన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రజల నుద్దేశించి చంద్రబాబు వాహనం నుంచే ప్రసంగిస్తారు.