Abn logo
Apr 7 2021 @ 02:44AM

‘వైజాగ్‌’ ఫర్‌ సేల్‌!

4 స్థలాలు రూ.1,465 కోట్లకు బేరం

బీచ్‌ రోడ్డులోని ఒక్కస్థలం విలువే 1,452 కోట్లు

గత ప్రభుత్వంలో ఈ భూమిపై లులూ ఆసక్తి

అభివృద్ధి చేయడానికి ఓకే.. వైసీపీ రాగానే రద్దు

నిధుల కోసం ఇప్పుడు 3 స్థలాలతో కలిపి వేలం

22న ఈ-వేలం.. నిర్మాణాలకు రూల్స్‌ అడ్డంకి!


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

చేతిలో రూపాయి లేక ఉద్యోగులకు జీతాలివ్వడానికి నానా తంటాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం...పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో ఖరీదైన భూములను వేలానికి పెట్టింది. ఇంతకు ముందు కూడా ‘బిల్డ్‌ ఏపీ మిషన్‌’ పేరుతో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్న స్థలాలను, పరిశ్రమలకు ఉద్దేశించిన భూములను వేలం వేస్తామని ప్రకటించింది. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌కి (ఎన్‌బీసీసీ) అప్పగించింది. ఏడాది పూర్తయినా ఆ ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా మరో నాలుగు స్థలాలను అమ్ముతామంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘ఎన్‌బీసీసీ’ ప్రకటన వచ్చింది. అందులో ముఖ్యమైనది బీచ్‌ రోడ్డులో 13.59 ఎకరాల స్థలం. గత టీడీపీ ప్రభుత్వం ఇక్కడ పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌, స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించేందుకు దుబాయ్‌కు చెందిన లులూ గ్రూపుతో రూ.2,200 కోట్లకు ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వానికి (ఏపీఐఐసీ దగ్గర) 10.65 ఎకరాలే ఉండగా, దానిని ఆనుకొని బీచ్‌కు అభిముఖంగా వున్న 3.4 ఎకరాలను సీఎంఆర్‌ గ్రూపు నుంచి తీసుకుంది. అందుకు ప్రతిఫలంగా వారికి నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఖరీదైన భూములను ఇచ్చింది. ఇక్కడ నిర్మించే కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌ వల్ల ఐదు వేలమందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం. దీనికి పెట్టుబడిదారుల సదస్సులో శంకుస్థాపన కూడా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లులూతో ఒప్పందం రద్దు చేసుకుంది. రెండేళ్లుగా ఆ భూమి ఖాళీగానే ఉంది. 


చాలకపోతే మరికొంతా...: కొన్నాళ్ల క్రితం భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించడానికి ఆసక్తి గల సంస్థలు ముందుకురావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించి, అడుగు రూ.6,500 చొప్పున అమ్మి తమకు నిధులు ఇవ్వాలని పేర్కొంది. దానికి పెద్దగా స్పందన లభించలేదు. దాంతో ఇప్పుడు బీచ్‌రోడ్డు స్థలంతో పాటు గాజువాక సమీపాన ఉన్న అగనంపూడి, ఫకీర్‌తకియాల్లో మరో మూడు ఎకరాలు కలిపి మొత్తం రూ.1,465 కోట్లకు అమ్మకానికి పెట్టింది. అందులో బీచ్‌ రోడ్డులో 13.59 ఎకరాలకు రూ.1,452 కోట్లు విలువ నిర్ణయించింది. వీటిని ఈ నెల 22న ఆన్‌లైన్‌లో వేలం వేస్తామని ప్రకటించింది. దానికి ప్రీబిడ్‌ వేలం 19న నిర్వహిస్తామని ప్రకటించింది. ఇంతకు ముందు బీచ్‌ రోడ్‌లో 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలని ప్రకటించి, ఇప్పుడు దానిని 10 లక్షలు పెంచి 40 లక్షల చదరపు అడుగుల నిర్మాణం అని పేర్కొంది.


అనుమతి దొరికేనా!: ప్రభుత్వం అమ్మదలచిన బీచ్‌ రోడ్డు స్థలానికి సంబంధించి.. తప్పనిసరిగా కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్‌) అనుమతులు తీసుకోవాలి. తీరానికి అతి సమీపాన అంత పెద్ద భారీ భవంతుల నిర్మాణానికి అనుమతులు లభిస్తాయా అనేది అనుమానమే. ఇది ఎంతవరకు ముందుకు వెళుతుందనేది వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement