డాక్టర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. కేసీఆర్‌ను మెచ్చుకుంటూ.. ఏపీ ప్రభుత్వాన్ని..

ABN , First Publish Date - 2020-04-08T16:45:52+05:30 IST

తగిన రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు వున్న వారికి వైద్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి చెందిన ఎనస్థిషియన్‌ చేసిన ఆరోపణలు రాజకీయ వివాదంగా మారాయి.

డాక్టర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. కేసీఆర్‌ను మెచ్చుకుంటూ.. ఏపీ ప్రభుత్వాన్ని..

ఎనస్థీషియన్‌ సుధాకర్‌ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే గణేశ్‌

ప్రతిపక్ష కుట్ర అంటూ వీడియో విడుదల

నర్సీపట్నం ఆస్పత్రిలో విచారణ జరిపిన అధికారులు

మత్తు డాక్టర్లకు ఎన్‌-95 మాస్క్‌ అవసరం లేదన్న కమిటీ సభ్యుడు, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున

కరోనా కేసులు చూస్తున్న వైద్యులే వాడతారని వెల్లడి

డాక్టర్‌ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం


నర్సీపట్నం/విశాఖపట్టణం(ఆంధ్రజ్యోతి): తగిన రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు వున్న వారికి వైద్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి చెందిన ఎనస్థిషియన్‌ చేసిన ఆరోపణలు రాజకీయ వివాదంగా మారాయి. సోమవారం సాయంత్రం మునిసిపల్‌ కార్యాలయంలో అధికారుల సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన డాక్టర్‌ సుధాకర్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపైనా, వివిధ శాఖల ఉన్నతాధికారులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మంగళవారం పత్రికల్లో రావడం, వార్తా ఛానెళ్లలో ప్రసారం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులు మంగళవారం ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. మరోవైపు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్‌ చేసిన ఆరోపణలను ప్రతిపక్ష టీడీపీ కుట్ర అంటూ విమర్శించారు. డాక్టర్‌ సుధాకర్‌ మునిసిపల్‌ కార్యాలయానికి వచ్చే ముందు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లివచ్చినట్టు చెబుతూ, ఇందుకు సంబంధించిన వీడియాను తన ట్యాబ్‌లో ప్రదర్శించారు. అయితే డాక్టర్‌ సుధాకర్‌ చేసిన అభియోగాల గురించి ప్రస్తావించలేదు. గత వారం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నర్సీపట్నంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు పీహెచ్‌సీల వైద్యాధికారులు తమకు రక్షణ సామగ్రి అందజేస్తే తప్ప కరోనా వైరస్‌ అనుమానితులకు వైద్యం చేయలేమని స్పష్టం చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. అయితే డాక్టర్‌ సుధాకర్‌ తెలంగాణ పాలకులను మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం వివాదంగా మారింది. 


ఆస్పత్రిలో ఉన్నతాధికారుల విచారణ

ఎన్‌-95 మాస్కులు అడుగుతుంటే పట్టించుకోవడం లేదంటూ నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి ఎనస్థిషియన్‌ డాక్టర్‌ సుధాకర్‌ చేసిన వ్యాఖ్యలపై జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.అర్జున్‌, నర్సీపట్నం ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి మంగళవారం విచారణ జరిపారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణిదేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ మత్తు డాక్టర్లకు ఎన్‌-95 మాస్కులు అవసరం లేదని, వీటిని కరోనా వైరస్‌ కేసులు చూస్తున్న వైద్యులే వాడతారన్నారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపుతామన్నారు. 


అయ్యన్న ప్రోద్బలంతోనే డాక్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు: ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రోద్బలంతోనే ప్రభుత్వానికి  చెడ్డపేరు తెచ్చేలా ఎనస్థీషియన్‌ డాక్టర్‌ సుధాకర్‌ వివాదాస్పదంగా మాట్లాడారని ఎమ్యెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ విమర్శించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం మూడున్నర నుంచి సాయంత్రం ఐదు వరకు డాక్టర్‌ సుధాకర్‌ అయ్యన్నపాత్రుడు ఇంట్లో ఉన్నారని సీసీ పుటేజీలను చూపించారు. అక్కడ మంతనాలు జరిపాక అధికారులతో తాను సమీక్ష నిర్వహస్తుండగా లోపలకు వచ్చి వివాదాస్పదంగా వ్యవహరించారన్నారు. గతంలో డాక్టర్‌ సుధాకర్‌ ప్రాంతీయ ఆస్పత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో మత్తు ఇవ్వకుండా వెళ్లిపోవడం వల్ల శస్త్రచికిత్సలు నిలిచిపోయిన సందర్భాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గంటన్నరపాటు వైద్యునితో ఏం మాట్లాడారో అయ్యన్న చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-04-08T16:45:52+05:30 IST