విమానాశ్రయం విస్తరణ.. కొత్త టెర్మినల్‌ నిర్మాణం

ABN , First Publish Date - 2020-09-19T16:46:07+05:30 IST

విశాఖపట్నం విమానాశ్రయంలో రూ.60 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు కొలిక్కి వస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది మే నాటికి పూర్తి కావలసిన పనులు కరోనా కారణంగా ఆలస్యమయ్యాయి. డిసెంబరు నాటికి అన్నింటినీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

విమానాశ్రయం విస్తరణ.. కొత్త టెర్మినల్‌ నిర్మాణం

అందుబాటులోకి పది వేల చ.మీ. స్థలం

అంతర్జాతీయ ప్రయాణికులకు కేటాయించేందుకు నిర్ణయం

ఎన్‌ 5 టాక్సీ ట్రాక్‌కు గ్రీన్‌సిగ్నల్‌


(విశాఖపట్నం/ఎన్‌ఏడీ జంక్షన్‌-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విమానాశ్రయంలో రూ.60 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు కొలిక్కి వస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది మే నాటికి పూర్తి కావలసిన పనులు కరోనా కారణంగా ఆలస్యమయ్యాయి. డిసెంబరు నాటికి అన్నింటినీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


ఆకట్టుకునే కెనోపీ

ప్రయాణికులు కారు దిగి విమానాశ్రయంలోకి వెళ్లే సమయంలో వర్షం పడితే తడిచిపోతున్నారు. ఈ సమస్య లేకుండా చేయాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం కోరడంతో అందమైన కెనోపీ నిర్మించారు. ఇప్పుడు ప్రయాణికులు ఏ ఇబ్బంది లేకుండా వెళ్లగలుగుతున్నారు.


కొత్త టెర్మినల్‌ నిర్మాణం

ప్రయాణికుల సంఖ్య నెలకు 2.5 లక్షల వరకు పెరగడంతో టెర్మినల్‌ భవనం విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిధులు విడుదల కావడంతో కొత్త టెర్మినల్‌ నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు 70 శాతం పనులు జరిగాయి. డిసెంబర్‌ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 20 వేల చ.మీ. విస్తీర్ణంలో టెర్మినల్‌ భవనం ఉంది. కొత్తగా మరో పది వేల చ.మీ. అందుబాటులోకి వస్తుంది. మొత్తం 30వేల చ.మీ. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీరుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తగా నిర్మించే టెర్మినల్‌ పూర్తిగా అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వారి కోసం వినియోగిస్తున్న భవనాన్ని ఆ తరువాత దేశీయ విమాన ప్రయాణికులకు ఉపయోగిస్తారు.


ఒకేసారి 12 విమానాల రాకపోకలు

కొత్త టెర్మినల్‌ భవనంలో ఆరు పార్కింగ్‌ బేలు నిర్మించారు. ఇంకో ఆరు నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే గంటకు 12 విమానాలు ఒకేసారి ల్యాండింగ్‌ అయి, టేకాఫ్‌ తీసుకోవచ్చు. అంటే...గంటకు మూడు వేల మంది ప్రయాణికులు రాకపోకలు చేయొచ్చు. పాత టెర్మినల్‌ భవనంలో నాలుగు పార్కింగ్‌ బేలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని చార్టర్డ్‌ విమానాలు, వీఐపీలు, నాన్‌ షెడ్యూల్‌ విమానాల కోసం వినియోగిస్తున్నారు. 


ఎన్‌ 5 టాక్సీ ట్రాక్‌కు గ్రీన్‌సిగ్నల్‌

రన్‌వేకి సమాంతరంగా నిర్మించిన ఎన్‌5 టాక్సీ ట్రాక్‌ నిర్మాణం పూర్తయింది. చెన్నైకి చెందిన ప్రాంతీయ భద్రత విభాగం అధికారులు వచ్చి, దానిని పరిశీలించి సర్టిఫై చేసి వెళ్లారు. త్వరలోనే దానిపై విమానాలను ట్రయల్‌ రన్‌ నడిపి, ఆపై అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.


డిసెంబరుకు అన్నీ పూర్తి: రాజకిశోర్‌, విమానాశ్రయం డైరెక్టర్‌

విమానాశ్రయం విస్తరణ పనులు కరోనా వల్ల ఆలస్యమయ్యాయి. డిసెంబరు నాటికి అన్నీ పూర్తవుతాయి. విమానాశ్రయం అని రోడ్డుపై వెళ్లేవారికి స్పష్టంగా తెలిసేలా జాతీయ రహదారిపై పెద్ద గోడ నిర్మించి, దానిపై విద్యుద్దీపాలతో విమానాశ్రయం బోర్డు పెట్టబోతున్నాము. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Updated Date - 2020-09-19T16:46:07+05:30 IST