కవ‘రింగ్’‌..!

ABN , First Publish Date - 2020-10-18T15:48:44+05:30 IST

దాదాపు 189 కిలోమీటర్ల ప్రతిష్ఠాత్మక రోడ్డు.. ప్రాజెక్టు వ్యయం రూ.17,961 కోట్లతో భవిష్యత్తులో విజయవాడ-అమరావతి అనుసంధానానికి..

కవ‘రింగ్’‌..!
కాజ-గుండుగొలను మధ్య నిర్మించిన రింగ్ రోడ్డు

విజయవాడ రింగ్‌ రోడ్డు పేరుచెప్పి అమరావతి రింగ్‌ రోడ్డుకు మంగళం

అమరావతి రింగ్‌ రోడ్డు నుంచి 111 కిలోమీటర్ల ఉపసంహరణ 

రాజధానిలోని ప్రాంతాలను తప్పించే  వ్యూహం 

భవిష్యత్తు అవసరాలకు అమరావతి రింగ్‌ అవసరమే..


విజయవాడ, ఆంధ్రజ్యోతి: దాదాపు 189 కిలోమీటర్ల ప్రతిష్ఠాత్మక రోడ్డు.. ప్రాజెక్టు వ్యయం రూ.17,961 కోట్లతో భవిష్యత్తులో విజయవాడ-అమరావతి అనుసంధానానికి కీలకమైన అమరావతి రింగ్‌ రోడ్డుకు ప్రభుత్వం మంగళం పాడుతోందా? అంటే తాజా నిర్ణయాలు అవుననే అనిపిస్తున్నాయి. విజయవాడ రింగ్‌ రోడ్డు పేరు చెబుతూ అమరావతి రింగ్‌ రోడ్డులో 111 కిలోమీటర్ల మేర ఉపసంహరించుకోవడం, రాజధాని ప్రాంతాలకు అనుసంధానత లేకుండా చేయడం వెనుక ప్రభుత్వం అమరావతిపై చూపుతున్న సవతి ప్రేమను తెలియజేస్తోంది. 


అమరావతి రింగ్‌ రోడ్డును కుదించిన రాష్ట్ర ప్రభుత్వం దానిని విజయవాడ రింగ్‌ రోడ్డుకు ముడిపెట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ రింగ్‌ రోడ్డు ప్రతిపాదనలు పదేళ్ల కిందటివి. కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగంగా విజయవాడ బైపాస్‌ ఒకవైపు, చిన అవుటపల్లి నుంచి పెనమలూరు మీదుగా చోడవరం దాటి గుంటూరు జిల్లా పరిధిలోకి ప్రతిపాదించిన బైపాస్‌ మరోవైపు కలిపి విజయవాడ రింగ్‌ అవుతుంది. విజయవాడ తూర్పు భాగంలోని బైపాస్‌ కార్యరూపం దాల్చలేదు. పశ్చిమం వైపు మాత్రం కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టుతో ఆ అవకాశం కలిగింది. ఈ ప్రాజెక్టు కూడా దాదాపు పదేళ్ల తరువాత ఇప్పటికి టెండర్లను పూర్తిచేసుకుని శంకుస్థాపనకు వచ్చింది. పనులు పూర్తికావడానికి రెండేళ్లు పడుతుంది. కాలాతీతం వల్ల ఈ ప్రాజెక్టు పరిధి వరకు విజయవాడ విస్తరించింది. కాబట్టి విజయవాడ బైపాస్‌ అనేది నగరం బయట కాకుండా ఆనుకుని వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో విజయవాడకు అవుటర్‌ అవసరమే. కానీ, భవిష్యత్తులో విజయవాడ ఇంకా విస్తరిస్తుంది. అప్పుడు మరో అవుటర్‌ అవసరం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కిందటి టీడీపీ ప్రభుత్వం సీఆర్‌డీఏ పరిధిలో అమరావతి రింగ్‌ రోడ్డును ప్రతిపాదించింది. 


రాజధాని ప్రాంతాలను తప్పించే వ్యూహమా

విజయవాడ రింగ్‌ పేరుతో అమరావతి రింగ్‌ రోడ్డును ప్రస్తుత ప్రభుత్వం విస్మరించటం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాల సందర్భంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి గతంలో ప్రతిపాదించిన 189 కిలోమీటర్లకు బదులుగా 78 కిలోమీటర్ల తూర్పువైపు రోడ్డు నిర్మించేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఎన్‌హెచ్‌65 - ఎన్‌హెచ్‌16ను కలుపుతూ కృష్ణానదిపై బ్రిడ్జిని నిర్మించటం ద్వారా ఈ రోడ్డు నిర్మించాలి. దీనివల్ల మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడుతుందని చెప్పారు. విజయవాడ రింగ్‌ రోడ్డు విషయంలో ప్రభుత్వ అభిప్రాయం సరైనదే కావచ్చు.  విజయవాడ రింగ్‌ కంటే ఆ పైన అభివృద్ధి చేయాల్సిన అమరావతి రింగ్‌ రోడ్డు కూడా మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీని తెస్తుంది. అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ రింగ్‌ రోడ్డు అంశాన్నే ముందుకు తీసుకురావటం చూస్తే అమరావతిలోని పలు ప్రాంతాలకు అనుసంధానత లేకుండా చేయటానికేనని తెలుస్తోంది. గత ప్రతిపాదనలోని దాదాపు 111 కిలోమీటర్లను తగ్గించుకోవటంలో ఆంతర్యం కూడా ఇదేనని తెలుస్తోంది. 


విజయవాడ-అమరావతికి వెన్నుదన్ను

సీఆర్‌డీఏ పరిధిలో అమరావతి రింగ్‌ రోడ్డును రెండు నగరాల భవిష్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని కిందటి టీడీపీ ప్రభుత్వం డీపీఆర్‌ తయారు చేయించింది. జిల్లాలోని చోడవరం, దాములూరు, దొనె ఆత్కూరు, గంగూరు, ఇబ్రహీంపట్నం, జూపూడి, కవులూరు, కొండపల్లి, కొత్తూరు, కొటికలపూడి, నవీపోతవరం, నిడమానూరు, నున్న, పాతపాడు, పెనమలూరు, పోరంకి, సావారిగూడెం, తాడేపల్లి, త్రిలోచనాపురం, వెదురుపావులూరు, వెలగలేరు, జమీ మాచవరం, కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ ప్రాంతాలను, గుంటూరు జిల్లా పరిధిలోని అనంతవరం, చినకాకాని, చిన వడ్లపూడి, యండ్రాయి, హరిశ్చంద్రపురం, కంతేరు, కర్లపూడి, కాజ, మోతడక, నూతక్కి, పెదపరిమి, పెదవడ్లపూడి, రామచంద్రాపురం, తాడికొండ, తుమ్మపూడి వడ్డమాను, వైకుంఠపురం ప్రాంతాలను అమరావతి రింగ్‌ రోడ్డు పరిధిలోకి చేర్చారు. అమరావతి రింగ్‌ రోడ్డు వల్ల భవిష్యత్తులో విజయవాడ విస్తరించినా.. అమరావతి విస్తరించినా.. ఈ అవుటర్‌ అనేది పాతికేళ్ల అవసరాలను తీరుస్తుంది. 


రెండు ప్రాంతాల ప్రధాన రోడ్ల అనుసంధానం ఇలా

రెండు జిల్లాల్లో ప్రధానమైన రోడ్లు అనుసంధానమయ్యేలా అమరావతి రింగ్‌ రోడ్డుకు కిందటి టీడీపీ ప్రభుత్వం డిజైన్‌కు రూపకల్పన చేయించింది. అమరావతి రింగ్‌ రోడ్డుకు తుళ్లూరు-తాడికొండ రోడ్డు, కంతేరు-నిడమర్రు రోడ్డు, చినకాకాని  జడ్‌డీపీ రోడ్డు (ప్రతిపాదన), మంగళగిరి-తెనాలి రోడ్డు, నూతక్కి-కంతెపాలెం రోడ్లు అనుసంధానమవుతాయి. 

Updated Date - 2020-10-18T15:48:44+05:30 IST