వివో వెనక్కి?

ABN , First Publish Date - 2020-08-05T09:12:24+05:30 IST

అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న వేళ ఐపీఎల్‌కు ఝలక్‌ తగిలింది. దేశమంతా ‘బాయ్‌కాట్‌ చైనా ప్రొడక్ట్

వివో వెనక్కి?

అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న వేళ ఐపీఎల్‌కు ఝలక్‌ తగిలింది. దేశమంతా ‘బాయ్‌కాట్‌ చైనా ప్రొడక్ట్‌’ నినాదంతో ఊగిపోతున్న వేళ, బీసీసీఐ మాత్రం ఆ కంపెనీలతోనే కొనసాగడం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే లీగ్‌ పేరును చైనీస్‌ ప్రీమియర్‌ లీగ్‌గా మార్చుకోండంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు కూడా వినిపించాయి. దీంతో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌గా వివో సంస్థ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పుడు బోర్డుకు మరో స్పాన్సర్‌ను వెతు క్కోవడం తలనొప్పిగా మారనుంది.


ఐపీఎల్‌ నుంచి వైదొలగనున్న చైనా కంపెనీ 


న్యూఢిల్లీ: స్పాన్సరర్ల విషయంలో వెనక్కితగ్గబోమని ఐపీఎల్‌ పాలక మండలి స్పష్టంగా చెప్పినా.. వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. చైనా కంపెనీలకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలకు ఐపీఎల్‌ లోగో స్పాన్సరర్‌ వివో తలొగ్గింది. ఈ నేపథ్యంలో కనీసం ఈ ఏడాది వరకైనా లీగ్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐకి సోమవారమే తెలిపినట్టు మీడియా కథనం. బోర్డుతో స్నేహపూర్వక చర్చలు కొనసాగుతున్నాయని, అయితే ఈ ఏడాది కాలాన్ని మారిటోరియం పీరియడ్‌ (డబ్బులు చెల్లించనవసరం లేకుండా)గా పరిగణించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ తర్వాత పరిస్థితి మారితే 2021 నుంచి 2023 వరకు వివోతో బోర్డు కొత్త ఒప్పందాన్ని చేసుకుంటుంది. ‘బోర్డు ఆఫీస్‌ బేరర్లు, వీవో ప్రతినిధుల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ సీజన్‌కైతే వివో స్పాన్సర్‌గా ఉండే అవకాశం లేదు. ఏం జరిగినా అంతా స్నేహపూర్వకంగానే జరుగుతుంది. అలాగే వివోనే వైదొలుగుతుంది కాబట్టి వారి బ్యాంక్‌ గ్యారంటీ మొత్తాన్ని సొమ్ము చేసుకోవాలని బోర్డు భావించడం లేదు’ అని బీసీసీఐకి చెందిన సీనియర్‌ అధికారి పేర్కొన్నాడు. గతంలో కొన్ని కంపెనీలు స్పాన్సర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సందర్భాల్లో బ్యాంకు గ్యారంటీని బోర్డు తీసుకుంది.


ఏడాదికి రూ.440 కోట్లు

2017లో ఐదేళ్లపాటు ఐపీఎల్‌ టైటిల్‌ స్సాన్సర్‌గా ఉండేందుకు బీసీసీఐతో వివో కంపెనీ రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ప్రతీ సీజన్‌కు దాదాపుగా రూ.440 కోట్ల మొత్తాన్ని వివో చెల్లిస్తోంది. అయితే వివో నిర్ణయంపై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నా.. కోట్లాది భారత క్రికెట్‌ అభిమానుల సెంటిమెంట్‌కు తగినట్టు వారు నడుచుకునేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. అధికారిక నిర్ణయం 24 గంటల్లో రానున్నట్టు ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.


మరిప్పుడెలా..?

వివో వెనక్కి తగ్గితే ఐపీఎల్‌ ఆరంభమయ్యేలోగా మరో స్పాన్సర్‌ను వెతకడం ఇప్పుడు బీసీసీఐకి సవాల్‌గా మారనుంది. ‘ఈ ఏడాదికి వివో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఖాయమే. ఇక ఆర్థికపరమైన విషయాలు బోర్డు-వివో మధ్య సాగే చర్చలపై ఆధారపడి ఉంటాయి. ఇది ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం కాబట్టి ఇందులో లీగల్‌గా వెళ్లాలని ఎవరూ అనుకోరు. మరోవైపు ఇప్పుడు మార్కెట్‌ ఉన్న స్థితిలో 50శాతం తక్కువ ధరకు మరో కంపెనీ దొరికినా విశేషమే. ఏమీలేని వేళ ఏదో ఒకటి దొరికితే సంతోషమే కదా’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి అన్నాడు. ఇదిలావుండగా యూఏఈలో నిర్వహించే ఈ టోర్నీలో తాము కోల్పోనున్న గేట్‌ మనీకి పరిహారం చెల్లించాలని ఆయా ఫ్రాంచైజీలు బీసీసీఐని డిమాండ్‌ చేసే ఆలోచనలో ఉన్నాయి.


భయపడాల్సిందేమీ లేదు: బీసీసీఐ

ప్రస్తుతం అంతా ఆశాజనకంగానే ఉన్నదనీ, భయపడాల్సిన అవసరం లేదని బీసీసీఐ చెబుతోంది. స్వల్పకాలం పాటు స్పాన్సర్‌గా ఉండేందుకు భారత కంపెనీలతో చర్చలు సాగిస్తున్నట్టు పేర్కొంది. ‘తక్కువ సమయంలో రూ.440 కోట్ల ఒప్పందంతో కంపెనీ దొరకడం కష్టం. అయినా ఒకట్రెండు కంపెనీలతో చర్చలు సాగిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి  ఒకరు తెలిపారు.


ఐదు రోజులకోసారి క్రికెటర్లకు కరోనా టెస్టు

ఐపీఎల్‌ నిర్వహణలో ఆటగాళ్ల ఆరోగ్య భద్రత కోసం బీసీసీఐ కఠిన జాగ్రత్తలు తీసుకోనుంది. ఈ సందర్భంగా లీగ్‌ ఆరంభానికి ముందే క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి కూడా కనీసం ఐదుసార్లు కరోనా నెగెటివ్‌ ఫలితం రావాల్సి ఉంటుంది. అలాగైతేనే యూఏఈలో శిక్షణకు అనుమతిస్తారు. దీంతోపాటు లీగ్‌ జరుగుతున్న సమయంలోనూ ప్రతీ ఐదు రోజులకోసారి ఆటగాళ్లకు కరోనా టెస్టులు తప్పనిసరి. యూఏఈలో ఆయా జట్లు క్వారంటైన్‌కు వెళ్లడానికి వారంరోజుల ముందే భారత్‌లోనే రెండుసార్లు ఆటగాళ్లకు కొవిడ్‌-19 ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు. ఒకవేళ పాజిటివ్‌గా తేలితే అతడిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ తర్వాత 24 గంటల వ్యవధిలో రెండుసార్లు టెస్టులు చేస్తారు. ఇందులో నెగెటివ్‌గా తేలితేనే యూఏఈకి అనుమతిస్తారు. అక్కడికి చేరిన తొలి వారంలో హోటళ్లలో ఆటగాళ్లు, టీమ్‌ అధికారులు ఒకరికొకరు కలుసుకోవడం నిషిద్ధం. వారంతా 1, 3, 6 రోజుల్లో జరిపే టెస్టుల్లో నెగెటివ్‌ వస్తేనే అది సాధ్యమవుతుందని బోర్డు అధికారి పేర్కొన్నాడు. విదేశీ ఆటగాళ్లు కూడా తమ దేశంలో రెండుసార్లు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-08-05T09:12:24+05:30 IST