ఫిబ్రవరి 13ని ‘వివేకానంద డే’గా ప్రకటించండి: హైదరాబాద్ యువత

ABN , First Publish Date - 2021-02-24T00:58:47+05:30 IST

స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరిలో జరిపిన హైదరాబాద్ పర్యటనను గుర్తించి ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని ...

ఫిబ్రవరి 13ని ‘వివేకానంద డే’గా ప్రకటించండి: హైదరాబాద్ యువత

హైదరాబాద్: స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరిలో జరిపిన హైదరాబాద్ పర్యటనను గుర్తించి ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని హైదరాబాద్ యువత కోరుకుంటోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో స్వామి వివేకానంద ప్రసంగించిన ఫిబ్రవరి 13వ తేదీని వివేకానంద డేగా గుర్తించి ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని యువత సూచిస్తోంది. స్వామి వివేకానంద ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రతియేటా ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు వారోత్సవాలు నిర్వహించాలని హైదరాబాద్ యువతీయువకులు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓ ఆన్‌లైన్ పిటిషన్ తీసుకొచ్చారు. మద్దతు కూడగడుతున్నారు. భారీగా మద్దతు కూడగట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని యత్నిస్తున్నారు. స్వామి వివేకానంద ‘హైదరాబాద్ సందర్శన’ ప్రాముఖ్యతను గుర్తించడానికి ఈ పిటిషన్‌ను ముందుకు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ లింక్‌లో పేరు, ఇ-మొయిల్ తెలిపి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఫిబ్రవరి 27వరకు ఈ ఆన్‌లైన్‌ పిటిషన్ అందుబాటులో ఉంటుందని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వాలంటీర్లు తెలిపారు.


భాగ్యనగరంలో వివేకానంద


స్వామి వివేకానంద పుట్టిన రోజైన జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవంగా, కన్యాకుమారిలో ధ్యాన నిమగ్నుడైన డిసెంబర్ 25ని సంకల్ప్ దివస్‌గా, ఆయన చికాగోలో ఉపన్యాసం ఇచ్చిన సెప్టెంబర్ 11ని సంప్రీతి దివస్‌గా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆయన జీవితంలో తొలి ఉపన్యాస వేదికగా నిలిచిన హైదరాబాద్ నగర పర్యటనకు మాత్రం అంతగా ప్రాముఖ్యత దక్కలేదు. దీంతో 1893 ఫిబ్రవరి 13నాటి చరిత్రాత్మక మహబూబ్ కాలేజ్ ఉపన్యాసానికి తగిన గుర్తింపు దక్కాలని హైదరాబాద్ యువత కోరుకుంటోంది. 


ఇందులో భాగంగానే భాగ్యనగరంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వాలంటీర్లు, విద్యార్ధులు ఈ ఆన్‌లైన్ పిటిషన్ ఉద్యమాన్ని చేపట్టారు‌.


ఈ లింక్ పై క్లిక్ చేయండి:  http://bit.ly/vivekanandasandarshanam



Updated Date - 2021-02-24T00:58:47+05:30 IST