నీదా.. విశ్వసనీయత?

ABN , First Publish Date - 2022-09-21T09:07:54+05:30 IST

అప్పట్లో స్వాతంత్య్రం కోసం బ్రిటి్‌షవారితో పోరాడాం. ఇప్పుడు మళ్లీ ఉన్మాది జగన్‌తో స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వస్తోంది’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

నీదా.. విశ్వసనీయత?

వివేకా హత్య కేసును బదిలీ చేయాలని నీ చెల్లెలే సుప్రీంను కోరింది

బాబాయిని హత్య చేసి నాపై ప్రచారం చేశావ్‌.. జగన్‌పై బాబు ఫైర్‌

నాడు బ్రిటి్‌షవాళ్లతో నేడు జగన్‌తో పోరు సీబీఐ అధికారులకూ బెదిరింపులు

పోలీసులున్నారని రెచ్చిపోతున్నావ్‌

వాళ్లే రేపు నిన్ను అరెస్టు చేస్తారు

సీఎం జగన్‌కు చంద్రబాబు వార్నింగ్‌

చిత్తూరు జిల్లా జైలులో టీడీపీ నాయకులకు పరామర్శ

జీవితంలో తొలిసారి జైలుకు వచ్చా

మా వాళ్లను చూస్తే బాధేసింది

జగన్‌రెడ్డికి మనసు లేదు

టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం


చిత్తూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘అప్పట్లో స్వాతంత్య్రం కోసం బ్రిటి్‌షవారితో పోరాడాం. ఇప్పుడు మళ్లీ ఉన్మాది జగన్‌తో స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వస్తోంది’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పులివెందులలో బాబాయిని హత్య చేసి, నారాసుర రక్తచరిత్ర అని ప్రచారం చేశారని.. అలా చేయడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. చిత్తూరులో జిల్లా జైలులో ఉన్న కుప్పానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సహా 8మంది నేతలను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట ప్రసంగిస్తూ జగన్‌పై నిప్పులు కురిపించారు. ‘నీ మీద, నీ ప్రభుత్వం మీద నమ్మకం లేక నీ చెల్లెలు, వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్డును ఆశ్రయించింది. కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరిందంటే నీ మీద ఉన్న విశ్వసనీయత ఏంటో తెలుస్తోంది. సీబీఐ అధికారులనూ బెదిరిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు నీవెంట ఉన్నారని రెచ్చిపోతున్నావు.


రాబోయే రోజుల్లో ఈ పోలీసులే నిన్ను అరెస్టు చేస్తారు చూస్కో’ అని హెచ్చరించారు. ఈ ముఖ్యమంత్రి ఏ సమయంలో పుట్టాడో గానీ.. అమరావతి, పోలవరం.. ఇలా అన్ని అంశాల్లోనూ అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువకాలం సీఎంగా పనిచేశానని.. ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నానని. 22 ఏళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీకి అధినేతగా ఉన్న తాను.. టీడీపీ నాయకులను పరామర్శించేందుకు తొలిసారి ఓ జైలు కు వచ్చానని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. జైలులో ఉన్న తమవాళ్లను చూస్తే చాలా బాధేసిందన్నారు. ‘జీవితంలో ఏ కేసు లేని, నిజాయితీపరుడైన 69ఏళ్ల గౌనివారి శ్రీనివాసులు మీద హత్యాయత్నం కేసు పెట్టారు. మిగిలినవారి మీదా అక్రమ కేసులు నమోదు చేశారు. కేసులు, జైలులో పెట్టిన కారణంగా సుబ్రమణ్యం అనే యువకుడి పెళ్లి ఆగిపోయింది. మరో నాయకుడు మునెబ్బ భార్య 25న ప్రసవించనుంది. ఈ జగన్‌రెడ్డికి మనసు లేదు. పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు’ అని విరుచుకుపడ్డారు.


ఏం చేశావని కుప్పానికి వస్తున్నావ్‌..

‘ఏం పీకావని ఎల్లుండి కుప్పానికి వస్తున్నావ్‌ జగన్‌రెడ్డీ! పులివెందులకు నేను సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు ఇచ్చాను. 90శాతానికిపైగా పూర్తయినా హంద్రీ-నీవాను పూర్తిచేసి కుప్పానికి నీళ్లు ఇవ్వలేకపోయావు. ఈ మూడున్నరేళ్లలో కుప్పాన్ని ఏం అభివృద్ధి చేశావని వస్తున్నావ్‌. మా నాయకులపై అక్రమ కేసులు పెట్టించావ్‌.. ఇప్పుడు ఆ పైశాచిక ఆనందం పొందేందుకు వస్తున్నావా’ అని చంద్రబాబు నిలదీశారు. చరిత్రహీనుల్ని చరిత్రే అడ్డుకుంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తావని ప్రగల్భాలు పలకడం కాదు.. ఈసారి పులివెందుల్లోనే గెలవలేవని అన్నారు. ‘1985లో అప్పటి సీఎం ఎన్టీఆర్‌ను అప్రజాస్వామికంగా పదవి నుంచి తొలగిస్తే, 30 రోజుల పాటు ప్రజాస్వామికంగా పోరాడి మళ్లీ సీఎంను చేసిన ఘనత టీడీపీది. ఈ గడ్డది. నీ అక్రమ కేసులు మమ్మల్ని ఏం చేయలేవు.


ఎలాంటి ఇబ్బందులూ పెట్టకుండా రాజధాని నిర్మాణం కోసం ఏకంగా 33,500 ఎకరాల భూములిచ్చిన గొప్పవారు రైతులు. అలాంటి రైతుల కాళ్లకు దండం పెట్టే అర్హత కూడా జగన్‌కు లేదు. సంపద సృష్టికి టీడీపీ దోహదం చేస్తుంటే.. అదే సంపద నాశనానికి జగన్‌ కృషి చేస్తున్నాడు’ అని మండిపడ్డారు. అనంతరం చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఓ కార్యకర్త మీద పోలీసులు అక్రమంగా గంజాయి కేసు నమోదు చేస్తుంటే, అడ్డుకుని పోరాడుతున్న సమయంలో హేమలతపై పోలీసులు జీపెక్కించిన విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు ఆమె చికిత్స పొందారు. ఆమెను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. 

Updated Date - 2022-09-21T09:07:54+05:30 IST