సీబీఐపైనే ఒత్తిడి కత్తి?

ABN , First Publish Date - 2021-12-02T08:04:57+05:30 IST

అతని పేరు కల్లూరు గంగాధర రెడ్డి. సొంత ఊరు కడప జిల్లా పులివెందుల. అనంతపురం జిల్లా యాడికిలో ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుని... అక్కడే స్థిరపడ్డారు. వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డికి గంగాధర రెడ్డి అనుచరుడుగా ఉండేవాడని...

సీబీఐపైనే ఒత్తిడి కత్తి?

  • వివేకా హత్య కేసులో అనూహ్య మలుపు
  • తప్పుడు సాక్ష్యం చెప్పాలని సీబీఐ 
  • ఒత్తిడి చేస్తోందంటూ ఎస్పీకి ఫిర్యాదు
  • గతంలో స్వచ్ఛందంగా వివరాలు చెప్పిన
  • గంగాధర రెడ్డి మళ్లీ తెరపైకి
  • శివశంకర్‌ రెడ్డికి ఆయన అనుచరుడు
  • వివేకా కుమార్తె సునీతపైనా ఆరోపణలు
  • అప్పటికప్పుడు రక్షణ ఇచ్చిన అనంత ఎస్పీ
  • కేసును తప్పుదారి పట్టించే వ్యూహమా?


ఉన్నట్టుండి ఒక వ్యక్తి తెరపైకి వచ్చారు. అతనిది స్వచ్ఛమైన చరిత్రేమీ కాదు! జంట హత్యల కేసులో నిందితుడు! అలాంటి వ్యక్తి... జిల్లా ఎస్పీని కలిసి సీబీఐ పైనా, రాష్ట్ర పోలీసులపైనా ఎడాపెడా ఫిర్యాదులు చేశారు. ఆ ఎస్పీ క్షణం ఆలస్యం చేయకుండా... ఆ వ్యక్తి చెప్పినవన్నీ నిజమే అన్నంతగా స్పందించారు. ఒక సీఐని రక్షణగా ఇచ్చి పంపించారు! ...ఔను! ఇది నిజంగా నిజం! కేంద్ర దర్యాప్తు సంస్థపైనా, సొంత అధికారులపైనా ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంత పెద్ద మనసుతో స్పందించడం ఓ  విచిత్రం! అన్నింటికీ మించి... ఇదంతా జరిగింది ముఖ్యమంత్రి బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో కావడం ఓ పెద్ద విశేషం! ఈ కేసులో ఒకరు అప్రూవర్‌గా మారి... మరొక కీలక నిందితుడిని అరెస్టు చేసిన సమయంలోనే  హఠాత్తుగా ఒకరు తెరపైకి వచ్చి, సీబీఐపై ఆరోపణలు చేయడం గమనార్హం! దీని వెనుక సీబీఐ దూకుడును తగ్గించి... కేసును తాము అనుకున్న విధంగా ‘మలుపు’ తిప్పే వ్యూహం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో ముక్కుసూటిగా వెళుతున్న ఒక సీబీఐ అధికారిని ‘బెదిరించేందుకే’ ఈ తతంగం నడుస్తోందనే సందేహాలున్నాయి.


(కడప/అమరావతి - ఆంధ్రజ్యోతి)

అతని పేరు కల్లూరు గంగాధర రెడ్డి. సొంత ఊరు కడప జిల్లా పులివెందుల. అనంతపురం జిల్లా యాడికిలో ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుని... అక్కడే స్థిరపడ్డారు. వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డికి గంగాధర రెడ్డి అనుచరుడుగా ఉండేవాడని... ఈయనపై పులివెందుల పోలీసు స్టేషన్‌లో డబుల్‌ మర్డర్‌ కేసు నమోదైందని తెలుస్తోంది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్‌’... ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ అధికారులు ఈ కేసులో అనేకమందిని ప్రశ్నించారు. సంఘటనకు సంబంధించిన సమాచారంపై ఆరా తీశారు. ఇదే క్రమంలో... అప్పట్లో ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షిస్తున్న సీబీఐ అధికారి ముందు గంగాధర రెడ్డి స్వచ్ఛందంగా హాజరయ్యారు. సీబీఐ అధికారి  ఆయన చెప్పిన వివరాలను నమోదు చేసుకుని పంపించారు. ఆ తర్వాత రెండు నెలల కిందట గంగాధర రెడ్డి గతంలో ఇచ్చిన సమాచారానికి సంబంధించిన మరిన్ని వివరాలు అడిగారు. వివరాలను నమోదు చేసుకోవడానికి కడపకు రావాలని కోరినా... గంగాధర రెడ్డి స్పందించలేదు. తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడైన దస్తగిరి అప్రూవర్‌గా మారిపోయారు. ఆయన ఇచ్చిన సమాచారంతో పెద్దల పేర్లూ బయటికి వచ్చాయి.


ఇదే  క్రమంలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి సన్నిహిత అనుచరుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను కస్టడీలోకి తీసుకుని నాలుగు రోజులపాటు ప్రశ్నించింది. ఇదే క్రమంలో... అనూహ్యంగా కల్లూరు గంగాధర రెడ్డి తెరపైకి వచ్చారు.  సోమవారం అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట ప్రత్యక్షమయ్యారు. ‘‘వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకోవాలంటూ సీబీఐ అధికారులతోపాటు వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత, సీఐ శ్రీరాం ఒత్తిడి తెస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి’’ అని కోరారు. ఇప్పుడు మడకశిర సీఐగా ఉన్న శ్రీరాం వివేకా హత్య జరిగినప్పుడు కడప నగరంలో పని చేస్తున్నారు. ‘సిట్‌’లో ఆయన కూడా సభ్యుడు. సీబీఐతోపాటు రాష్ట్ర పోలీసు అధికారిపైనా గంగాధర రెడ్డి తీవ్రమైన  ఆరోపణలు చేయడం, ఎస్పీ అప్పటికప్పుడు దానిపై స్పందించడం వెంటవెంటనే జరిగిపోయింది. ‘ఫిర్యాదు అందడమే ఆలస్యం’ అన్నట్లుగా... డీఎస్పీ స్థాయి అధికారితో దీనిపై విచారణ జరుపుతామని ఎస్పీ ప్రకటించారు. అంతేకాదు... గంగాధర రెడ్డిని పోలీసు జీపులో ఆయన ఇంటికి చేర్చారు. ఆయన ఇంటివద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను కాపలాగా కూడా పెట్టారు.


ముందూ వెనుకా చూడరా...

ఒక సంచలన కేసులో సీబీఐపైన, రాష్ట్ర పోలీసు అధికారిపైనా, స్వయంగా బాధితురాలైన వివేకా కుమార్తెపైనా తీవ్ర ఆరోపణలు చేసిన వ్యక్తి నేపథ్యం ఏమిటో తెలుసుకోకుండానే  ఎస్పీ అంతలా స్పందించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కీలకమైన నిందితుడే అప్రూవర్‌గా మారిపోయి... ముఖ్యమైన సమాచారం ఇచ్చిన తర్వాత సీబీఐ అధికారులు గంగాధర్‌ రెడ్డిని ఎందుకు బెదిరిస్తారు? అప్పుడెప్పుడో సిట్‌లో పని చేసిన సీఐ శ్రీరాం ఇప్పుడు ఈ కేసులో ఎందుకు జోక్యం చేసుకుంటారు? ఇప్పటిదాకా తన సందేహాలను, తనకు తెలిసిన సమాచారాన్ని నేరుగా కోర్టుకు లేదా సీబీఐ అధికారులకు తెలియచేస్తున్న వివేకా కుమార్తె సునీతకు... గంగాధర రెడ్డిని బెదిరించాల్సిన అవసరం ఏముంటుంది? సీబీఐ బృందంలో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. వారికి తప్పుడు సాక్ష్యం చెప్పించాల్సిన అవసరం ఏముంటుంది? అందులోనూ ఓ ఎంపీ, ఆయన తండ్రి ప్రమేయం ఉందని దొంగ సాక్ష్యం చెప్పాలని ఎందుకు ఒత్తిడి తెస్తారు? అనే ప్రశ్నలు కీలకంగా మారాయి.


ఇదోరకం బ్లాక్‌ మెయిల్‌?

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి మారిపోయారు. కొత్త అధికారి రాంకుమార్‌ సింగ్‌కు ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరుంది. ఎవరికీ లొంగకుండా కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే పలువురి అరెస్టులు జరిగాయి. వివేకా వద్ద గతంలో డ్రైవర్‌గా పని చేసిన దస్తగిరి అప్రూవర్‌గా మారారు. ఆయన ఇచ్చిన సమాచారం ఇప్పుడు కీలకంగా మారింది. సీబీఐ అధికారులు... వివేకా హత్య రహస్యాన్ని వెలికి తీసి పూర్తిస్థాయిలో చార్జిషీట్‌ దాఖలుచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో... తప్పుడు ఆరోపణలు చేస్తూ సీబీఐపై ఒత్తిడి పెంచడం, అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా గంగాధరరెడ్డిని తెరపైకి తెచ్చారనే అభిప్రాయం కలుగుతోంది.  దీని వెనుక కొందరు పెద్దల హస్తముందనే ప్రచారం జరుగుతోంది. 


సీబీఐ సీరియస్‌...

గంగాధర్‌ రెడ్డి ఫిర్యాదు... దానిపై అనంతపురం ఎస్పీ స్పందించిన తీరును సీబీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  కేసు దర్యాప్తులో భాగంగా వాట్సాప్‌ కాల్‌ చేస్తే దాన్ని మరో కోణంలోకి మళ్లించి మొత్తం దర్యాప్తుపైనే అనుమానాలు రేకెత్తించేలా జరుగుతున్న ప్రయత్నాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Updated Date - 2021-12-02T08:04:57+05:30 IST