Abn logo
Oct 21 2020 @ 11:12AM

వివేకా కేసులో ప్రముఖుల బండారం బయటపడనుందా?

కడప జిల్లాలో వివేకా హత్య కేసు కొత్త మలుపులు తిరగబోతోందా? ఆయన్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం దొరకబోతోందా? సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం..కొత్త బృందం రంగంలోకి దిగనుండటంతో కేసు డొంక కదలనుందా? ఇప్పటివరకు సాధారణ వ్యక్తులను ప్రశ్నిస్తూ సాగిన విచారణ.. ఇకపై కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లనుందా? రాజకీయ ప్రముఖులను ఆరా తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


ఏపీకి కొత్త బృందం...

మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో చోటుచేసుకున్న కీలక పరిణామంపై అందరి దృష్టి పడింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో ఎలాంటి సంచలనాలు వెలుగు చూస్తాయోనన్న చర్చ మొదలైంది. దర్యాప్తు బాధ్యత ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగం 3వ బ్రాంచికి అప్పగించారు. వివేకా కేసులో దర్యాప్తు అధికారిగా డీఎస్పీ దీపక్‌గౌర్‌ను నియమించారు. ఐపీసీ 302 హత్యానేరం సెక్షన్‌ కింద కేసు సీబీఐ రీ-రిజిస్ట్రేషన్‌ చేసింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం త్వరలో ఏపీకి కొత్త బృందం రానుంది. తొలుత వివేకా మృతిని సీఆర్పీసీ 174 సెక్షన్ కింద.. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేయగా.. సీబీఐ మార్పులు చేసింది. త్వరలోనే ఈ స్పెషల్ టీమ్‌ లోతుగా దర్యాప్తు ప్రారంభించనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖుల బండారం బయటపడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

న్యాయం జరగడం లేదని...

2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వివేకానంద హత్యపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పలువురిని విచారించినప్పటికీ కేసు కొలిక్కిరాలేదు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సిట్‌ ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు పలువురు అనుమానితులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించింది. సిట్‌తో న్యాయం జరగడం లేదని.. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఈ ఏడాది జులైలో రంగంలోకి దిగారు. 


కూపీ లాగిన సీబీఐ...

అయితే సీబీఐ అధికారులు రెండు దఫాల్లో విచారించారు. బృందాలుగా ఏర్పడి కడప  సెంట్రల్ జైలు కేంద్రంగా చేసుకుని పులివెందుల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సంచరిస్తూ అనుమానితులను ఆరా తీశారు. వివేకా కుటుంబ సభ్యులను, ఆయన వ్యక్తిగత సిబ్బంది, వాచ్‌మెన్, వంట మనుషులు, టైలర్లు, డ్రైవర్లను ఆరా తీశారు. వివేకా పీఏతో పాటు ఆయన సన్నిహితులను ప్రశ్నించారు. పులివెందులలో చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను వాకబు చేశారు. మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ. 48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు. మరికొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ. 20 లక్షల ఎఫ్‌డీలు ఉన్నట్లు తేల్చారు సీబీఐ అధికారులు. అతడి ఖాతాల్లో అంత డబ్బు ఎక్కడిది? అనే దానిపై సీబీఐ అధికారులు కూపీ లాగారు. మరోవైపు ప్రధాన అనుమానితులను విచారించకుండా కేవలం సాధారణ వ్యక్తులనే ప్రశ్నించారని వివేకా కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో కేంద్ర పెద్దలను కలవాలని ప్రయత్నం చేశారు. ఈలోపు సిబిఐ బృందం  సభ్యులందరికి  కరోనా సోకడంతో  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  దాంతో కొన్ని రోజుల క్రితమే  సిబిఐ విచారణ ఆగిపోయింది. సీన్ కట్ చేస్తే తాజాగా ఈ కేసుపై కొత్త ఎఫ్‌ఐఆర్  నమోదైంది. 


త్వరలోనే బయటపడుతుందని...

త్వరలోనే కొత్త  సిబిఐ బృందం రంగంలోకి దిగనుండటంతో.. జిల్లాలో కొందరికి వణుకు మొదలైనట్లు  తెలుస్తోంది. విచారణ ఏమలుపు తిరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారట. అప్పట్లో సిట్ బృందం  వైఎస్ కుటుంబంలో కీలక వ్యక్తులను విచారించింది. కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి , ఆయన తండ్రి  వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్  మనోహర్ రెడ్డి మరో ఇద్దరు సోదరులను ప్రశ్నించింది. కొత్త సిబిఐ బృందం అధికారులు వీరిని తప్పకుండా విచారిస్తారని విశ్వసనీయ సమాచారం. మొత్తంగా వివేక హత్య కేసులో సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు అన్న విషయం త్వరలోనే బయటపడుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి కొత్త సిబిఐ బృందం మర్డర్‌ మిస్టరీని ఛేదించడంలో ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement