కీలక దశకు చేరుకున్న వివేకా హత్య కేసు

ABN , First Publish Date - 2021-08-03T23:15:03+05:30 IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండున్నరేళ్లు కావస్తోంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించి ఏడాది అయిపోయింది

కీలక దశకు చేరుకున్న వివేకా హత్య కేసు

కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండున్నరేళ్లు కావస్తోంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించి ఏడాది అయిపోయింది. అయితే కేసు విచారణ తీరు, జాప్యం చూసి సీబీఐపై కూడా ఈ కేసులో అనేక ఆరోపణలు వచ్చాయి. ఏడాదికాలం తర్వాత ఐజీ క్యాడర్ అధికారిణి  సుధాసింగ్ నేతృత్వం వహించిన తర్వాత ఈసారి కేసును.... 50 రోజుల పాటు విచారించి కేసును ఓ కీలక దశకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్రం ఆమెను బదిలీ చేసి ఆమె స్థానంలో రామ్‌కుమార్ అనే ఎస్పీ స్థాయి అధికారికి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే స్పీడును పెంచి కేసు కీలక దశకు తెచ్చినట్లు సమాచారం. 


ప్రధాన నిందితుడు, పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు గోవాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారికంగా ధృవీకరించింది. నిన్న సాయంత్రం గోవాలో అరెస్టు చేసిన అధికారులు ఇవాళ గోవా స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్‌ రిమాండ్‌లోకి తీసుకున్నారు. గోవా నుంచి కడపకు తీసుకువచ్చి బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 


వివేకా వాచ్‌మెన్ రంగన్న వాగ్మూలం తర్వాత ఈ కేసులో వివేకా సన్నిహితులైన సునీల్ కుమార్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరిల పేర్లు బయటకు వచ్చాయి. తర్వాత సునీల్ కుమార్ యాదవ్ సీబీఐపై హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ బృందం తమను తమ కుటుంబాన్ని వేధిస్తోందని, తమపై ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని, న్యాయవాది సమక్షంలోనే తమను విచారించే విధంగా సీబీఐని ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఆరోజు నుంచి సునీల్ కుటుంబం పరారీలో ఉంది. 



Updated Date - 2021-08-03T23:15:03+05:30 IST