ఎన్నికల్లో బైడెన్ గెలిస్తే.. భారత సంతతి డాక్టర్‌కు కీలక పోస్టు!

ABN , First Publish Date - 2020-10-31T23:14:14+05:30 IST

నవంబర్ 3న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొ

ఎన్నికల్లో బైడెన్ గెలిస్తే.. భారత సంతతి డాక్టర్‌కు కీలక పోస్టు!

వాషింగ్టన్: నవంబర్ 3న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు  డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ హోరాహోరీ సమరంలో ట్రంప్‌పై జో బైడెన్ విజయం సాధిస్తే.. భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్ ఉపాధ్యక్ష పదవిని చేపడుతారు. ఇదే సమయంలో భారతీయ మూలాలు ఉన్న మరో వ్యక్తికి కూడా జో బైడెన్ ప్రభుత్వంలో అత్యున్నత స్థానం దక్కనుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మండ్య జిల్లాలకు చెందిన డాక్టర్ వివేక్ హెచ్ మూర్తి.. జో బైడెన్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ముఖ్య వ్యూహకర్తగా పని చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ ఓడితే డాక్టర్ వివేక్ హెచ్ మూర్తికి జో బైడెన్ ప్రభుత్వంలో కీలక పోస్టు దక్కనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 


డాక్టర్ వివేక్ హెచ్ మూర్తి.. కర్ణాటక రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హెచ్‌టీ నారాయణ్ శెట్టి మనవడు. వివేక్ హెచ్ మూర్తి తండ్రి డాక్టర్ హెచ్ఎన్ లక్ష్మి నరసింహమూర్తి మైసూర్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. కాగా.. డాక్టర్ వివేక్ హెచ్ మూర్తి లండన్ జన్మించి, అమెరికాలో పెరిగారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈయన బీఏ పూర్తి చేశారు. యాలే స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చదివారు. యాలే స్కూల్ ఆఫ్ మెడిసన్ నుంచి ఎండీ పట్టా పొందారు. కొంత మందితో కలిసి ఈయన డాక్టర్స్ ఫర్ అమెరికా అనే గ్రూప్‌ను ప్రారంభించారు. 2008,2012 ఎన్నికల్లో డాక్టర్ వివేక్ హెచ్ మూర్తి.. ఒబామాకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డాక్టర్ వివేక్ హెచ్ మూర్తిని అమెరికా సర్జన్ జనరల్‌గా నియమించారు. కాగా.. ప్రస్తుతం సర్వే ఫలితాలన్నీ జో బైడెన్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బైడెన్ గెలిస్తే.. డెమొక్రటిక్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్న డాక్టర్ వివేక్ హెచ్ మూర్తికి మరోసారి కీలక పోస్ట్ దక్కనుందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. 


Updated Date - 2020-10-31T23:14:14+05:30 IST