ఆంధ్రజ్యోతి(21-09-2021)
ఒక్కోసారి తీయని గులాబ్‌జామూన్ గుట్టుక్కుమనిపించాలనిపిస్తుంది. ఇంకోసారి కరకరలాడే జంతికలు లాగించాలనిపిస్తుంది. మరోసారి గరం మసాలా దట్టించిన నాన్ వెజ్ స్నాక్స్ పని పట్టాలనిపిస్తుంది. ఇలా భిన్న రుచుల మీదకు మనసు మళ్లడానికి కారణం మనలో లోపించే పోషకాలే! ఆ పోషకాలను భర్తీ చేసే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇదిగో ఇలా తెలివిగా ఎంచుకోవాలి.
చీజ్: చీజ్ బర్గర్ లేదా పిజ్జా తినాలనిపిస్తే మనలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు లేదా క్యాల్షియం లోపం ఏర్పడిందని అర్థం. ఫ్యాటీ యాసిడ్లను అవిసె గింజలు, సబ్జా విత్తనాలు, వాల్‌నట్స్‌తో, క్యాల్షియంను నువ్వులతో భర్తీ చేయవచ్చు.
పాస్తా, వైట్ బ్రెడ్, పేస్ట్రీ: క్రోమియం లోపానికి సూచన ఇది. ఈ లోపాన్ని ద్రాక్ష, యాపిల్స్, చిలగడ దుంపలతో భర్తీ చేయవచ్చు.
ఉప్పటి పదార్థాలు: క్లోరైడ్ లోపంతో ఉప్పుతో కూడిన చిప్స్, నట్స్ తినాలనిపిస్తుంది. ఆలివ్స్, టమాటో, హిమాలయన్ సాల్ట్‌లతో ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు.
చాక్లెట్: మెగ్నీషియం లోపానికి సూచన ఇది. పొట్టు తీయని ధాన్యాలు, బీన్స్, నట్స్, సీడ్స్, పండ్లతో ఈ లోపాన్ని భర్తీ చేసుకుంటే చాక్లెట్ల మీద యావ తగ్గుతుంది.
స్వీట్లు: రక్తంలో చక్కెర స్థాయి తగ్గే పరిస్థితి హైపోగ్లైసీమియా లక్షణం ఇది. అలాగని స్వీట్లు లాగించేయకుండా పండ్లు ఎంచుకోవాలి. చిక్కుళ్లు, కాంప్లెక్స్ కార్బ్స్‌తో కూడిన పొట్టుతో కూడిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకుంటే స్వీట్ల మీదకు మనసు మళ్లదు.