Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీటిలో విటమిన్‌ ‘సి’ పుష్కలం

కరోనా వంటి వైరస్‌లను తట్టుకోవాలంటే శరీరంలో బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. దీన్ని ట్యాబెట్ల ద్వారా కృత్రిమంగా పొందే కంటే పోషకాహారంతో సహజసిద్ధంగా పెంపొందించుకోవడం ఆరోగ్యకరమైన మార్గం. ముఖ్యంగా విటమిన్‌ ‘సి’ వంటి కొన్ని అదనపు పోషక పదార్థాలు మీ ఆహారంలో చేర్చడంవల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ‘సి’ విటమిన్‌ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలేంటో చూద్దాం... 


ఉసిరి: ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధులు, చికిత్సలకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఉసిరికాయలో నారింజ కన్నా 20 రెట్లు అధికంగా ‘సి’ విటమిన్‌ ఉంటుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ, జీవక్రియకు సహకరిస్తుంది. రోజూ ఉసిరి రసం తాగినా, మరే రూపంలో తీసుకున్నా ఆరోగ్యకరమైన జీవనానికి తోడ్పడుతుంది. 


నారింజ: ఇది బహుముఖ సిట్రస్‌ పండు. వంద గ్రాముల బరువుండే నారింజలో 53.2 మిల్లీ గ్రాముల ‘సి’ విటమిన్‌ ఉంటుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు రోగనిరోధకశక్తిని పెంచడానికి, కణజాలం దెబ్బతినకుండా కాపాడడానికి సహాయపడతాయి. 


క్యాప్సికమ్‌: కూరల్లో వాడే క్యాప్సికమ్‌లో కూడా సిట్రస్‌ పండ్లతో సమానంగా విటమిన్‌ ‘సి’ లభిస్తుంది. బీటా కెరోటిన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో అత్యధిక మోతాదులో ‘సి’ విటమిన్‌ దొరుకుతుంది. తెల్లరక్త కణాల ఉత్పత్తిని నియంత్రించే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది. 


నిమ్మకాయ: విటమిన్‌ ‘సి’, ఇతర యాంటీఆక్సిడెంట్స్‌ లభించే వనరుల్లో నిమ్మకాయ ఒకటి. కణజాలాన్ని దెబ్బతీసే, దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో ఉపయోగపడుతుంది. పండు చిన్నదే అయినా ఇందులో గణనీయమైన మొత్తంలో ఫ్రుక్టోజ్‌, ఫైబర్‌, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్‌తో పాటు విటమిన్‌ ‘బి2, బీ6’ ఉన్నాయి. 


పైనాపిల్‌: జీర్ణ సమస్యలకు చికిత్స చేయడంలో పైనాపిల్‌ లేదా అనాసపండు శతాబ్దాలుగా ఉపయోగపడుతోంది. ఈ పండ్లలో విటమిన్‌ ‘సి’, మాంగనీస్‌ అధికం. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్‌, బ్రోమెలైన్‌ ఉంటాయి. రోజూ పైనాపిల్‌ తింటే వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం తగ్గుతుంది. ఇందులోని లక్షణాలు రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడతాయి.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...