Abn logo
May 25 2020 @ 04:36AM

శేషేంద్రకు విశ్వనాథ యోగ్యతా పత్రం

‘షోడశి’పుస్తకంలో ‘‘శ్రీసుందరకాండకు పేరెట్లు వచ్చినది’’ అనే అధ్యాయంలో ఆసక్తికరమైన చర్చ లేవదీశారు శేషేంద్ర శర్మ. ‘‘హనుమంతుడు సుందరుడగుట, సుందర హనుమన్మంత్రమని యొకటి యుండుట, హనుమంతుడు నివసించిన స్థానములలో ఒకదానికి సుందరనగరమనే పేరు ఉండుట...’’ ఇలా అనేక కారణాలని అంటారు శేషేంద్ర. ‘‘వాల్మీకి వేదముననుసరించి శ్రీ రామాయణము వ్రాసెననుట న్యాయమే అనిపించును. ఇది యొక పెద్ద గొడవ. ఇది నిరూపించుటకు నాకు శ్రీ శర్మగారికున్నంత యోపికలో సగమైన నుండవలయును. నాకు లేనిదే అది’’ అంటూ విశ్వనాథ ‘షోడశి’ పుస్తకానికి ముందుమాటలో శేషేంద్రశర్మకు ఒక అద్భుతమైన ప్రమాణ పత్రాన్ని ఇచ్చారు.


గుంటూరు శేషేంద్ర శర్మ రచనల్లో ‘షోడశి - రామాయణ రహస్యాలు’ గ్రంథానికి ఒక విశిష్టత ఉంది. అనేకానేక ఉత్తమ లక్షణాలతోపాటు కవిసమ్రాట్‌ విశ్వనాథ వారిచ్చిన యోగ్యతాపత్రం చెప్పుకోదగ్గ దీని మరో విశిష్ఠత. ‘షోడశి’కి వ్రాసిన ముందుమాటలో శేషేంద్ర లోచూపును ప్రస్తావిస్తూ శేషేంద్ర తనకు ఆహా పుట్టించాడంటారు విశ్వనాథ: ‘‘ఆశ్చర్యములలో నాశ్చర్య మేమనగా భారతము రామాయణమునకు ప్రతిబింబమని (శేషేంద్రశర్మగారు) చేసిన ప్రతిపాదన. సంపూర్ణముగా ప్రతిబింబము కాకపోయినను శ్రీశర్మగారు చూపిం చిన స్థలములలోని ప్రతిబింబత్వము నాకాహా పుట్టించినవి. శ్లోకములు శ్లోకములు చరణములు చరణములు వానియంతట వానినే భగవంతు డైన వ్యాసుడు వాడుకొనెను.... వాల్మీకిని యథేచ్ఛగా వాడుకొన్న వారిలో మెదటి వాడు వ్యాసుడు.’’ 


శేషేంద్రను లోతైన మనిషి అంటూ కవి సమ్రాట్‌ ఈ విధంగా పేర్కొన్నారు: ‘‘శ్రీశర్మ గారికి నాకు నేడెనిమిదేండ్ల నుండి చెలిమి గలదు. వారింత లోతైన మనిషియని నేనను కొనలేదు. అప్పుడప్పుడు నైషధము నుండి కొన్ని శ్లోకములు దేవీ పరముగా వారన్వయిం చినప్పుడు నేను వారికవి యాదృచ్ఛికముగా తోచిన విషయములనుకొన్నాను గాని శ్రీవిద్యా విషయము నింత లోతుగా తెలిసిన వారనుకొన లేదు. వారీ గ్రంథమును వ్రాసినందుకు తెలుగువారే కాదు. భారతీయులందరును కృతజ్ఞులుగా నుండ వలసిన విషయము.’’ 


తనకు నచ్చకపోతే నిర్మొహమాటంగా మొహంమీదే దులిపేయగల సాహసం విశ్వనాథగారికుందని వేరే చెప్పనవసరం లేదు. ఆయన ఎవరినైనా మెచ్చుకోవడం సులువుగా జరగదు. ఆయన శేషేంద్రను అభినందించడానికి ఉపయోగించిన వాక్యాలు, భాష చూడాల్సిందే: ‘‘శ్రీశర్మగారు త్రిజటా స్వప్నమును గాయంత్రీ మంత్రము లోని పాదముల సంఖ్యయు నక్షర ముల సంఖ్యయు తీసికొని అది గాయత్రీ మంత్రమునకు నొక విధ మైన వ్యాఖ్యయని నిరూపించుట మిక్కిలి యూహాస్ఫోరకముగాను న్నది; వారి శ్రద్ధను నిరూపించు చున్నది. ఇది పారాయణము చేయ నెంచెడి వారికి శ్రీశర్మగారు చేసిన యుపకారమింతయని చెప్ప రాదు. ఒక గ్రంథకర్త ఒక మహా విషయమును వ్రాయును. సహజ ముగా నతడెంత గొప్పపని చేసెనని పరులు ప్రశంసింప వలెనని యతని కుండుట వాడెంత గ్రంథ కర్తయైునను జీవిలక్షణము. ప్రశంసించెడి వారు గూడనెట్లు ప్రశంసింతురు. పెదవితో ప్రశంసింతురు. నిజముగ బ్రశంసించెడి వాడెవడనగా త్రిజటా స్వప్నములోని యీ రహస్యమును తెలిసికొని దానిని ప్రధానముగా తన పారాయణములో పెట్టుకొనెడి వాడు.’’ 


ఈ పుస్తకంలో ‘శ్రీసుందరకాండకు పేరెట్లు వచ్చినది’ అనే అధ్యాయంలో ఆసక్తికరమైన చర్చ లేవదీశారు శేషేంద్రశర్మ. ‘‘హనుమంతుడు సుందరు డగుట, సుందర హనుమన్మంత్రమని యొకటి యుండుట, హనుమంతుడు నివసించిన స్థానములలో ఒకదానికి సుందరనగరమనే పేరు ఉండుట...’’ ఇలా అనేక కారణాలని అంటారు శేషేంద్ర. సుందర హనుమన్మంత్రము గురించి శేషేంద్ర చాలా విస్తారంగా వివరించారు: ‘‘సుందరాయనమః అని శ్రీరామాష్టోత్తర నామములలో ఉన్నది. కాని హనుమ గురించి సుందర నామము లేదు. బ్రహ్మాండ పురాణములో సుందరకాండకు ‘చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్‌ సుందరే కాండే ఉత్తమే’ అని పారాయణ పద్ధతి వివరించారు. షోడశ కళా ప్రపూర్ణ అయిన శక్తియే చంద్రబింబం అంటే. ఈ కాండలో సీతారాములకు ఏ భేదమూ లేకపోవడం వల్ల రాముని పరాశక్తిగా భావించాలని పారాయణ విధాన వివరణ తాత్పర్యం.


రాముడు సుందరుడు, సుందరి కలవాడు. సుందరకాండ సౌందర్యకాండ, బ్రహ్మాండ పురా ణమున సౌందర్యకాండ అనే మాట వాడినారు. ఈ సౌందర్యము శంకరులు సౌందర్యలహరి అని చెప్పినదే. కనుక సుందర హనుమంతుడనగా దేవీభక్తుడైన హనుమ అని అర్థమేగానీ హనుమ సుందరముగా ఉన్నాడని గాదు. హనుమ నిరంతర దేవీ ధ్యానమే, జపమే, యోగమే, సుందర కాండగా దర్శనమిచ్చుచున్నది. ‘తదున్నసం పాండురదంత మవ్రణం శుచిస్మితం పద్మ పలాశ లోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం, ప్రసన్నతారాధిప తుల్య దర్శనం’ అని ఓ తల్లీ నిన్ను నేనెప్పుడు చూతునో గదా అని హనుమ పరి తపిస్తూ చెప్పిన శ్లోకం ఇది. తెలుగుసీమలో సుందరయ్య సుందరరామయ్య అని బాలా త్రిపురసుందరీ సంప్రదాయ సిద్ధ నామధేయములు ప్రజలు పెట్టుకొను వ్యవహారమున్నది. ఇతర సీమలలో కూడా సుందరేశన్‌, సుందర్‌సింగ్‌ సుందర్‌బాయ్‌ అట్టి చోట్ల త్రిపురసుందరీపరమైన అర్థమే గానీ హనుమత్పరమైన అర్థము లేదు’’ అని శేషేంద్ర వివరించారు. 


ఈ అధ్యాయం పైన విశ్వ నాథ తన ముందుమాటలో వివరంగా వ్యాఖ్యానించారు. తనదైన భాషలో ఆ యన, ‘‘రామాయణము  నందు తక్కిన కాండ లకు తత్తత్కాండాతర్గత కథాసూచకములైన నామ ములుండగా దీనికి సుంద రకాండమన్న పేరు విడిగా నేల పెట్టవలసి వచ్చినదన్న ప్రశ్ననిచ్ఛలు వినిపించునదే. ఈ సందియము పలుమందికి కలదు’’ అన్నారు. విశ్వనాథ ఈ ముందు మాటను అక్టోబర్‌ 1, 1967నాడు వ్రాసారు. అప్పటికి ముఫ్ఫయ్‌ సంవత్సరాల కిందటి ముచ్చటను వివరించారు. రైలు కోసం నిడదవోలు ప్లాటుఫారం మీద కూర్చున్న సమయంలో కీర్తిశేషులు పూజ్యు లైన శ్రీకాశీ కృష్ణాచార్యుల వారిని ఈ కాండమునకు శ్రీసుందరకాండమనే పేరు ఏవిధంగా వచ్చిందని ఆయన అడిగారట. ‘‘సుందర హనుమ న్మంత్రమని యొకటున్నది.


ఆ మంత్రమును మహర్షి యా కాండమున నిక్షేపించెను. అందుచేత దానికి సుందర కాండమని పేరు వచ్చినది’’ అని శ్రీకాశీ కృష్ణా చార్యులు విశ్వనాథకు చెప్పారట (ఇదే విషయాన్ని శేషేంద్రకూడా తన అధ్యాయంలో ప్రతిపాదించి ప్రమాణీకరించారు). ఇంకా వివరాలు అడిగే సమయం లేకపోయిందని తరువాతనైనా ఆయనను కలుసుకోలేకపోయానని విశ్వనాథ పేర్కొన్నారు. హనుమంతుడు అనే పేరు వజ్రఘాతం వల్ల, మారుతి అనే పేరు తండ్రి వాయుదేవుని మారుతమనే పేరు వల్ల, ఆంజ నేయుడు అనే పేరు తల్లి పేరుతో వచ్చినాయి. కాని తల్లి ఆంజనేయుడికి పెట్టుకున్న అసలు పేరేమిటి? ‘‘సుందరుడు’’ అని ఇద్దరు రచయితలు (శేషేంద్ర, విశ్వనాథ) వెల్లడించారు. కానీ ఇది వాల్మీకి చెప్పలేదు: ‘‘ఆ మహర్షి తాను చాల పరమగూఢమైన రచన చేయును’’ అంటారు విశ్వనాథ. సుందరుని కథా సమగ్రమయిన సుందర కాండకు ఆ పేరు వచ్చిందని వివరించారు. ఆ విధంగానే మరికొన్ని అసలు పేర్లను పేర్కొన్నారు. ద్రౌపది అసలు పేరు ‘‘కృష్ణ’’ అనీ, శూర్పణఖ అసలు పేరు ‘‘బాల’’ అని ప్రస్తావించారు. 


‘‘ఒక బుద్ధిమంతుడు (ఇక్కడ గుంటూరు శేషేంద్రశర్మ) తన మేధాశక్తి చేత సోపపత్తికముగా మహా విషయమని చెప్పికోదగిన దానిని వ్రాసినచో ప్రశంసిం పవలయును. దానిని జూచి యానందింపవలయును. గాని వెక్కిరించుట మిక్కిలి తేలిక. వీరు (శేషేంద్ర) చెప్పిన యుపపత్తులు బాగుగా నున్నవి. సమంజసముగా నున్నవి. అన్నిటికంటె ప్రధానమైన యుపపత్తి సుందరకాండ మంతయు కుండలినీ యోగమని నిరూపించుటయే- ఈ నిరూపణ మాత్ర మాశ్చర్యజనకముగా ఉన్నది. శ్రీ శర్మగారు దీని నూరకయే నిరూపించలేదు. గాలిలో దీపము పెట్టి దేవుడా నీ మహిమ యనలేదు’’ అని శేషేంద్రకు కితాబిచ్చారు విశ్వ నాథ. ‘‘వాల్మీకి వేదముననుసరించి శ్రీ రామా యణము వ్రాసెననుట న్యాయమే అనిపిం చును. ఇది యొక పెద్ద గొడవ. ఇది నిరూ పించుటకు నాకు శ్రీశర్మగారికున్నంత యోపికలో సగమైన నుండవలయును. నాకు లేనిదే అది’’ అంటూ విశ్వనాథ శేషేంద్ర శర్మకు ఒక అద్భుతమైన ప్రమాణ పత్రాన్ని ఇచ్చారు. 


శ్రీమద్రాయణ కల్పవృక్ష రచయిత, జ్ఞానపీఠాధిపతి, పరిశోధకుడు, విమ ర్శకుడు, అన్ని సాహితీ ప్రక్రియ లలోనూ నైపుణ్యం సాధించిన మహాకవి, పండితుడు అయిన శ్రీవిశ్వనాథ పెదవితో పైపైన కాకుండా హృదయంతో సో దాహరణంగా సప్రమాణ కంగా చేసిన ప్రశంస ఇది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానా’నికి చలం ఇచ్చినట్టు శేషేంద్ర ‘షోడశి’కి విశ్వనాథ యోగ్యతాపత్రాన్ని ఇచ్చినారు. సకాలంలో అందక విశ్వనాథ ముందు మాటను ‘షోడశి’ మొదటి ముద్రణలో చేర్చలేదు. 33 సంవత్సరాల తరు వాత 2000లో వచ్చిన మూడో ప్రచురణలో విశ్వనాథ ప్రశంస చేర్చారు. 


వృత్తిరీత్యా విజ్ఞానశాస్త్రవేత్త, దేవీ ఉపాసకులు గురజాడ సూర్యనారా యణమూర్తి ‘షోడశి’ని ఆంగ్లంలోకి, ఉజ్జయిని కాళిదాసు అకాడమీ డిప్యుటీ డైరెక్టర్‌ జగదీశ్‌శర్మ హిందీలోకి అనువదించారు. 2006లో ప్రచురించిన పుడు విశ్వనాథ ముందుమాటకు హిందీ అనువాదం వేయలేదు. పుస్తకం పేరుతో కూడా ఇబ్బంది వచ్చింది. ‘షోడశి - రామాయణ్‌ కీ తాంత్రిక్‌ వ్యాఖ్యా’ అని పెట్టడం సరైన అనువాదం కాదని భావించి 2018లో ‘షోడశి రామా యణ్‌ కే రహస్య్‌’ అని పేరు మార్చి విశ్వనాథ ముందుమాటను కలిపి మళ్లీ హిందీ పుస్తకం ప్రచురించారు. 


సుందరకాండలో కుండలినీ యోగాన్ని దర్శించిన శేషేంద్రశర్మ లోతైన పరిశోధనను ‘ది హిందూ’ పత్రిక ‘షోడశి’ ఇంగ్లీషు అనువాదాన్ని సమీక్షిస్తూ ప్రశంసిం చింది. త్రిజట స్వప్నవృత్తాంతంలో గాయత్రీ మంత్ర వృత్తిని శేషేంద్రశర్మ చూచిన తీరును, వేద రహస్యాలను లోతుగా చదివితేనే అర్థమయ్యేట్టు సూచనప్రాయంగా వాల్మీకి పొందుపరిచిన విధా నాన్ని ప్రస్తావించి రామాయణంలో ‘షోడశి’ కొత్త కోణాలను ఆవిష్కరించిందన్నారు. భారతీయ విమర్శనా సాహిత్యాన్ని ప్రపంచ వాఙ్మయంలో నిలువెత్తు నిలబెట్టిన అత్యుత్తమ గ్రంథమని మాస పత్రిక ‘విపుల’ తన సమీక్షలో పేర్కొన్నది.  


శేషేంద్ర ‘షోడశి-రామాయణ రహస్యములు’ 1967లో, ‘స్వర్ణహంస-హర్ష నైషధ కావ్య పరిశీలన’ 1968లో ప్రచురితమ య్యాయి. ఈ రచనలు రెండూ నీలంరాజు వెంకటశేషయ్య సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వారపత్రిక ఆదివారం సాహితీ అనుబంధంలో 1963-67 మధ్య ధారావాహికగా వచ్చాయి. వీటితోపాటు ‘నా దేశం నా ప్రజ’, ‘ఆధునిక మహా భారతం’ వంటి రచనలతో తెలుగు సాహితీ వినీలాకాశంలో శేషేంద్రశర్మ సూర్యునివంటి అజరామర కీర్తి సంతరించుకున్నారు. 

మాడభూషి శ్రీధర్‌

Advertisement
Advertisement
Advertisement