KBC-13 సీజన్‌లో రూ.7 కోట్లు గెలుచుకున్న హిమానీ! 15 ఏళ్ల వయసులోనే కంటిచూపు దూరమైనా..

ABN , First Publish Date - 2021-08-28T00:40:58+05:30 IST

పట్టుదల, ధైర్యస్థైర్యాలు, ఉంటే చాలు.. జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా అధికమించవచ్చు..విజేతగా నిలవచ్చు.. అని నిరూపించారు హిమానీ బుందేలా!

KBC-13 సీజన్‌లో రూ.7 కోట్లు గెలుచుకున్న హిమానీ! 15 ఏళ్ల వయసులోనే కంటిచూపు దూరమైనా..

ఇంటర్నెట్ డెస్క్: పట్టుదల, ధైర్యస్థైర్యాలు, ఉంటే చాలు.. జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా అధికమించవచ్చు..విజేతగా నిలవచ్చు.. అని నిరూపించారు హిమానీ బుందేలా! రోడ్డు ప్రమాదంలో కళ్లు దెబ్బతిని చూపు చాలావరకూ కోల్పోయినా కూడా ఆమె ధైర్యస్థైర్యాలతో తన ప్రయాణాన్ని కొనసాగించారు. చివరకు కౌన్ బనేగా కరోడ్‌పతీ తాజా సీజన్‌లో విజయం సాధించి కోటీశ్వరురాలైపోయారు. జీవితంలో ఊహించని సవాళ్లు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా నిలదొక్కుకుని..గెలిచి.. తన లాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు హిమానీ. కేబీసీ-13లో హిమానీ రూ.7 కోట్లు రూపాయలు గెలుచుకున్న ఎపిసోడ్ ఆగస్టు 30న ప్రసారం కానుంది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవన ప్రయాణంలో కొన్ని ముఖ్యఘట్టాలు..


15 ఏళ్ల వయసులో అనుకోని ప్రమాదం.. దూరమైన కంటి చూపు..

అంతవరకూ సజావుగా సాగుతున్న హిమానీ జీవితం 15వ ఏట అనుకోని మలుపు తిరిగింది. ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె కంటి చూపును దాదాపుగా కోల్పోయింది. చూసే శక్తి చాలా వరకూ తగ్గిపోయింది. సహాయం కోసం ఇతరులపై ఆధారపడాల్సిన స్థితి అది. ఇది ఆమెకే కాకుండా కుటుంబానికంతటికీ పెద్ద దెబ్బ. యవ్వనంలోకి అడుగుపెడుతున్న దశలోనే ఇంతటి క్లిష్టపరిస్థితి ఎదుర్కోవడంతో ఆమె జీవితం దాదాపు తల్లకిందులైపోయింది. దీంతో.. తొలుత నిరాశకు లోనైన హిమానీ ఆ తరువాత.. ముందుడుగు వేసేందుకు నిర్ణయించుకున్నారు. వాస్తవానికి అలవాటు పడుతూ మొక్కవోని ధైర్యంతో ఆమె తన చదువును కొనసాగించారు. అలా ఆమె హ్యూమానిటీస్‌లో డిగ్రీ పొందారు. ఆ తరువాత.. బీ.ఎడ్‌‌ కూడా చేసి చివరికి ఆగ్రాలోని కేంద్రీయ విద్యాలయంలో టీచర్‌గా ఉద్యోగం సంపాదించారు. అయితే.. ఆమె కష్ట సమయంలోనూ తన కలను మర్చిపోలేదు! 


21 ఏళ్ల తరువాత నిజమైన చిన్ననాటి కల..

హిమానీకి చిన్నప్పటి నుంచీ టీవీ అంటే బోలెడంత ఇష్టం. అప్పట్లో వచ్చే సీరియల్స్‌ను చూస్తూ.. తానూ ఏదో రోజు టీవీలో కనిపించాలని ఆమె కలలు కనేది. ఇక హిమానీకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు కేబీసీ తొలి సీజన్ ప్రసారమైంది. అటు అమితాబ్ బచ్చన్..ఆయనకు ఎదురుగా హాట్ సీట్లో కంటెస్టెంట్లు..బిగ్ బీ వరుసగా ప్రశ్నలు అగడం..కంటెస్టెంట్లు సమాధానాలు చెప్పడం.కోటి రూపాయలు గెలుచుకున్న వారి కళ్లలో ఆకాశాన్నంటే సంతోషం.. ఇలాంటి దృశ్యాలను చూసిన ఆమె తాను కూడా ఎప్పటికైనా ఈ షోలో పాల్గొని విజేతగా నిలవాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచీ కేబీసీయే ఆమె లోకమైపోయింది. ఇంట్లో తోబుట్టువులతో కూడా నిత్యం అదే కేబీసీ ఆట ఆడేది హిమానీ. ఇక కంటి చూపునకు దూరమైనా కూడా ఆమె కేబీసీ వైపే అడుగులు వేసింది. 


ఓ రోజు ఊహించని సర్‌ప్రైజ్..స్కామ్ కాల్ అనుకుంటే..

కేబీసీ-13కు ముందు ఏకంగా నాలుగు సార్లు కౌన్ బనేగా కరోడ్ పతీలో స్థానం కోసం ఆమె ప్రయత్నించి విఫలమైంది. కానీ..ఆమె నిరాశ చెందలేదు! ఈ సీజన్‌లోనూ హిమానీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగింది. ఈసారి మాత్రం అదృష్టం ఆమె తలుపు తట్టింది...కేబీసీ నుంచి ఫోన్ రానేవచ్చింది. కానీ..ఆమె మాత్రం తొలుత ఈ విషయాన్ని అస్సలు నమ్మలేదు. తనను మోసం చేసి డబ్బు గుంజేందుకు ఎవరైనా ఫోన్ చేస్తున్నారేమో అని అనుకుని అవతలి వారి మాట పూర్తి కాకుండానే ఫోన్ పెట్టేసింది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెబితే వారు కూడా హిమానీ చేసిన పనిని సమర్థించారు. ఇలా మరో మూడు సార్లు జరిగాక..హిమానీ ఎట్టకేలకు తాను ఎంపికైనట్టు విశ్వసించింది. ఆ తరువాత.. కేబీసీలో హిమానీ తన ప్రతిభను నిరూపించుకుని ఈ సీజన్‌లో తొలి విజేతగా నిలిచింది. శారీరక లోపాలతో బాధపడుతున్న వారి గురించి సమాజంలో అవగాహన పెంచడమే తన లక్ష్యమంటారు హిమానీ!



Updated Date - 2021-08-28T00:40:58+05:30 IST