ఎయిరిండియాలో విస్తారా విలీనం!

ABN , First Publish Date - 2022-05-17T06:06:46+05:30 IST

ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. విస్తారాలో తన భాగస్వామి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (ఎ్‌సఐఏ)తో గ్రూప్‌ సంప్రదింపులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఎయిరిండియాలో విస్తారా విలీనం!

న్యూఢిల్లీ: ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. విస్తారాలో తన భాగస్వామి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (ఎ్‌సఐఏ)తో గ్రూప్‌ సంప్రదింపులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. విలీనంపై నిర్ణయానికొచ్చేందుకు ఈ ఏడాది చివరి వరకు సమయం కావాలని ఎస్‌ఐఏ కోరినట్లు సమాచారం. విస్తారాలో టాటా గ్రూప్‌ ప్రమోటింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ 51 శాతం వాటా కలిగి ఉండగా.. మిగతా 49 శాతం వాటా ఎస్‌ఐఏ చేతుల్లో ఉంది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ఎయిరిండియాను టాటా గ్రూప్‌ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

ఎయిరిండియాలో విస్తారాతో పాటు గ్రూప్‌నకు చెందిన మరో ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ ఏషియాను సైతం విలీనం చేయాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. టాటా సన్స్‌, ఎస్‌ఐఏ ఈ ఏడాది ప్రారంభంలోనే విలీనంపై చర్చించాయి. అంతేకాదు, ఎయిరిండియా కొనుగోలుకు టాటాతో కలిసి బిడ్‌ వేసేందుకు అంగీకరించిన ఎస్‌ఐఏ.. కొవిడ్‌ సంక్షోభం కారణంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో వెనక్కి తగ్గింది. ఎయిరిండియా కొత్త సీఈఓ, ఎండీగా కాంప్‌బెల్‌ విల్సన్స్‌ గత వారం నియమితులయ్యారు. ఇంతక్రితం ఆయన ఎస్‌ఐఏ అనుబంధ ఎయిర్‌లైన్స్‌ స్కూట్‌ ఎయిర్‌కు సారథ్యం వహించారు. విల్సన్‌ నియామకంతో ఎయిరిండియా-విస్తారా ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి

Updated Date - 2022-05-17T06:06:46+05:30 IST