త్వరలో మరో రెండు విస్టాడోమ్‌ కోచ్‌లు

ABN , First Publish Date - 2022-05-21T06:53:58+05:30 IST

అరకులోయ-కిరండోల్‌ రైలు కోసం మరో రెండు విస్టాడోమ్‌ కోచ్‌లు త్వరలో విశాఖపట్నం రానున్నాయి.

త్వరలో మరో రెండు విస్టాడోమ్‌ కోచ్‌లు

కిరండోల్‌ వరకు కొనసాగించేందుకు రైల్వే అధికారుల యోచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అరకులోయ-కిరండోల్‌ రైలు కోసం మరో రెండు విస్టాడోమ్‌ కోచ్‌లు త్వరలో విశాఖపట్నం రానున్నాయి. అవి ఇక్కడకు చేరగానే ప్రస్తుతం అరకు వరకే వెళుతున్న విస్టాడోమ్‌ కోచ్‌లు ఆపై కిరండోల్‌ వరకు కొనసాగుతాయి. దీనివల్ల అరకు తరువాత వచ్చే జగదల్‌పూర్‌ వంటి స్టేషన్ల ప్రయాణికులకు కూడా అద్దాల కోచ్‌ల ప్రయాణం అందుబాటులోకి రానుంది. 


ఇటీవల అంగీకారం

విశాఖపట్నంలో ప్రస్తుతం నాలుగు విస్టాడోమ్‌ కోచ్‌లు ఉన్నాయి. అందులో ఒకటి పాత ఐసీఎఫ్‌ కోచ్‌ కాగా మిగిలిన మూడు కొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు. కొత్త కోచ్‌లు వచ్చాక అందులో రెండింటిని రోజూ కిరండోల్‌ రైలుకు తగిలించి అరకులోయ వరకే నడుపుతున్నారు. అవి అరకు వెళ్లాక... విడదీసి, తిరిగి సాయంత్రం అటు నుంచి వచ్చే రైలుకు అరకులోనే అటాచ్‌ చేస్తున్నారు. అదనంగా ఉన్న మూడో ఎల్‌హెచ్‌బీ విస్టాడోమ్‌ను పర్యాటకుల డిమాండ్‌ ఉన్న రోజుల్లో మాత్రమే నడుపుతున్నారు. ఈ కోచ్‌లో ప్రయాణానికి టిక్కెట్‌ చార్జీలు ఎక్కువ. పర్యాటక సీజన్‌లో తప్పితే సాధారణ సమయాల్లో అంత డిమాండ్‌ ఉండదు. అందుకని డిమాండ్‌ ఉన్నప్పుడు మాత్రమే మూడో విస్టాడోమ్‌ కోచ్‌ నడుపుతున్నారు. పాత ఐసీఎఫ్‌ విస్టాడోమ్‌ కోచ్‌ ఖాళీగా ఉండడంతో దానిని రాయగడ మీదుగా కొరాపుట్‌ వరకు నడుపుతున్నారు. ఇటు అరకులోయ, అటు కొరాపుట్‌కు విస్టాడోమ్‌ కోచ్‌ నడుస్తుండడంతో జగదల్‌పూర్‌ ప్రాంతీయులు తమ ప్రాంతానికీ ఆ కోచ్‌లు నడపాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడి ఎంపీల ద్వారా ఒత్తిడి పెడుతున్నారు. ఈ మేరకు వాల్తేరు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పథి విస్టాడోమ్‌ కోచ్‌ల డిమాండ్‌ను వివరిస్తూ కొద్దిరోజుల క్రితం రైల్వే బోర్డుకు లేఖ రాశారు. త్వరలో మరో రెండు ఎల్‌హెచ్‌బీ విస్టాడోమ్‌ కోచ్‌లు ఇస్తామని బోర్డు నుంచి సమాధానం వచ్చింది. అవి వస్తే...విస్టాడోమ్‌లను అరకులోయ దగ్గరే ఆపేయకుండా నేరుగా జగదల్‌పూర్‌ మీదుగా ఆఖరి స్టేషన్‌ కిరండోల్‌ వరకు రెగ్యులర్‌గా నడుపుతామని రైల్వే వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపాయి. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎంపీలు విస్టాడోమ్‌ కోచ్‌లు అదనంగా నడపాలని గతంలోనే లేఖలు రాశారని, ఆ మేరకు డిమాండ్‌ ఉన్న రోజుల్లో మూడో కోచ్‌ నడుపుతున్నామని చెప్పారు. 

Updated Date - 2022-05-21T06:53:58+05:30 IST