థియేటర్‌కి వచ్చుట మీ ప్రాణానికి హానికరం

ABN , First Publish Date - 2020-05-02T00:01:01+05:30 IST

మూలిగే మూవీ రంగం మీద తాటి పండు పడ్డట్టు - కరోనా వచ్చి పడింది. ఎన్ని థియేటర్లుంటే అన్ని లాభాలు అన్నట్టు - తొలివారంలోనే వేల ప్రింట్లతో కాసుల వేట ప్రారంభించేవారు సినీ ప్రదర్శకులు.

థియేటర్‌కి వచ్చుట మీ ప్రాణానికి హానికరం

మూలిగే మూవీ రంగం మీద తాటి పండు పడ్డట్టు - కరోనా వచ్చి పడింది. ఎన్ని థియేటర్లుంటే అన్ని లాభాలు అన్నట్టు - తొలివారంలోనే వేల ప్రింట్లతో కాసుల వేట ప్రారంభించేవారు సినీ ప్రదర్శకులు. పాపం కరోనా దెబ్బకి కానరాని ప్రేక్షకులు, ఆగిపోయిన షూటింగులు, రిలీజ్‌ కాని మూవీలు... హతవిధీ! ఏం చేయాలి? ఏంటి దీనికి పరిష్కారం? సినీ మేధావులు సూచిస్తున్నా పరిష్కారం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి మరి!


Movie industry is badly affected by the Virus. No Collections, No Shootings, No Releases! What to do? What could be the solution? How to get restored? Watch this video to know solution is being suggested by movie scholars.


ధిధి ధిమి తకధిమి థియేటర్‌కి వచ్చుట మీ ప్రాణానికి హానికరం!


( రూఫ్‌ గార్డెన్‌లో నలుగురు థియేటర్‌ ఓనర్‌ కమ్‌ ప్రొడ్యూసర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. వయొలెట్‌, బ్లూ హీరో, పసుపు కోటు, తెల్ల కోటు. కరోనా సందర్భంగా థియేటర్లు మూతపడి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటారు. )


పెద్ద నిర్మాత : ( చిరాగ్గా ) ఏంటయ్యా ఇదీ? చేతిలో అన్ని థియేటర్లున్నాయని ఆర్భాటంగా చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు ఏం చేసుకోవాలి అవన్నీ?

తెల్ల కోటు : ఏముంది సార్‌? అన్నీ మూసుక్కూర్చోవడమే! మనం చేసేదేం లేదు...


పెద్ద నిర్మాత : ( చిరాగ్గా ) వైరస్సూ .. లాక్‌ డౌన్సూ .. సోషల్‌ డిస్టేన్సూ.. అసలు ఎన్ని రోజులివీ?

తెల్ల కోటు : ఎన్ని రోజులు కాదు.. ఎన్ని నెలలు? అని అడగండి.

హీరో : నెలలో... ఏళ్లో!.. ఒకవేళ ఎల్లుండికో ఏడాదికో మనం థియేటర్లు తెరుచుకున్నా... జనం రావద్దూ? మనం మాస్కులు పంచిపెట్టినా వస్తారన్న గ్యారంటీ లేదు.


పెద్ద నిర్మాత : మాస్కులు... ఆ... మళ్లీ అదో ఖర్చు మనకి ...

తెల్ల కోటు : సార్‌. అసలు అంతవరకూ వచ్చినా గొప్పే కదండీ? విషయం మీకు అర్థం కావట్లేదు. అసలిక్కడ మాస్కుల్లేకుండా మనం ఓ మీటింగెట్టుకున్నామనీ, ఇంత క్లోజ్‌గా కూర్చుని మాట్లాడుకుంటున్నామనీ బయట తెలిస్తే - మన నలుగుర్నీ కూడా లోపలేస్తారు. అదీ సిట్యుయేషను...


పెద్ద నిర్మాత : ( ఎక్స్‌ప్రెషన్‌ )

తెల్ల కోటు : నావి రెండు సినిమాలు అర్ధంతరంగా ఆగిపోయాయ్‌. షూటింగ్‌ మళ్లీ ఎప్పుడు స్టార్టవుతుందో.. ఏంటో!

హీరో : బావుంది. నా ఇంటినుంచి వచ్చే సినిమాలు నాలుగు … ఏకంగా రిలీజ్‌కే రెడీగా ఉన్నాయ్‌. అన్ని థియేటర్లు చేతిలో పెట్టుకుని - అయోమయంగా ఎదురు చూడాల్సి వస్తోంది. నేనెవడికి చెప్పుకోను?


పెద్ద నిర్మాత : కొట్టక కొట్టక కొరియన్‌ కథ కాపీ కొట్టి - తీయక తీయక నరదృష్టి అని - హారర్‌ మూవీ తీశా. హైప్‌ కూడా క్రియేట్‌ చేశాం. ఇక మన థియేటర్లలో హాయిగా రిలీజ్‌ చేసుకోవచ్చు అనుకునేసరికి … ఇదీ సీను!

పసుపు కోటు : ఏంటో... దేశంలో థియేటర్లన్నీ మొత్తం మన నలుగురి చేతుల్లోనే ఉండిపోయాయన్నట్టు... ఈ పాడు జనం ఓ.. తెగ గోల పెట్టేసేవారు. ఇప్పుడు చూడండి. ఏం చేసుకుంటాం ఆ థియేటర్లన్నీ? తుడిపించడానికే తొంభై వేలవుతోంది.


పెద్ద నిర్మాత : నరదృష్టి అంటే అదేనయ్యా. నా కొరియన్‌ సినిమా కాన్సెప్ట్‌ అదే!

తెల్ల కోటు : ( ఎక్స్‌ప్రెషన్‌ )

పసుపు కోటు : ఆ మధ్య థియేటర్లకి డిమాండ్‌ తగ్గిపోతోందని- ముందు చూపుతో మాల్సూ మల్టిప్లెక్సులూ మొదలెట్టాం. ఇప్పుడు ఇంకా ముందుకు పోయాక... అన్నీ మూసుకుపోయాయ్‌.

తెల్ల కోటు : ఇప్పట్లో ఇంక థియేటర్లు తెరుచుకోవడం కష్టమే సార్‌.


పెద్ద నిర్మాత : థియేటర్ల విషయంలో నష్టాలు ఎలాగా తప్పట్లేదు. షూటింగ్‌ ఆగిపోయిన సినిమాలు ఇప్పట్లో మొదలయ్యేదీ లేదు. కనీసం రెడీగా ఉన్న సినిమాలైనా- అదేదో ఆన్‌లైన్లో అయినా రిలీజ్‌ చేసుకుంటే బెటరేమో!

తెల్ల కోటు : అక్కడొచ్చేది అంతంతమాత్రం. మన పెద్ద సినిమాలకి ఆ ఆదాయం సరిపోదు సార్‌.


పెద్ద నిర్మాత : పోనీ అక్కడ టిక్కెట్‌ రేట్లు పెంచితే?

పసుపు కోటు : అక్కడ మనం పెంచేదేం ఉండదండి. వందా వెయ్యీ కడితే ఏడాదిపాటు ఎన్ని సినిమాలైనా చూపించేస్తాడక్కడ.


పెద్ద నిర్మాత : అయ్యో! మన థియేటర్లలో.. జస్ట్‌ పాప్‌కార్న్‌ కాఫీల మీదే కోట్లు సంపాదించేవాళ్లం కదయ్యా? ఎంత కష్టం వచ్చిందిప్పుడు! అమ్ముకోడానికి ఇంకో మార్గమే లేదా?

హీరో : అంతగా కావాలంటే... ఇళ్లలో కూర్చుని తీరిగ్గా సినిమాలు చూసేవాడికి మనమే దగ్గరుండి కాఫీలు పెట్టివ్వచ్చు. ఆ బిజినెస్‌ మోడల్‌ ఏదయినా ట్రై చెయ్యండి.

పెద్ద నిర్మాత : ( ఎక్స్‌ప్రెషన్‌ )


పెద్ద నిర్మాత : మరి ఏంటయ్యా దీనికంతకీ పరిష్కారం?

తెల్ల కోటు : పరిష్కారం ఒకటేనండీ. ధైర్యం. ధైర్యం క్రియేట్‌ చెయ్యాలి.

వయొలెట్‌ : ధైర్యమా?


తెల్ల కోటు : అవునండీ. జనంలో ధైర్యం క్రియేట్‌ చేయాలి. అప్పుడు మన బిజినెస్‌ వర్కవుట్‌ అవుతుంది.

పసుపు కోటు ( యంగ్‌) : అంటే ఎలాగ?

తెల్ల కోటు : ఎవేర్‌నెస్‌ అండీ. ఫరెగ్జాంపుల్‌ చూడండి. రోజూ యాక్సిడెంట్లు జరుగుతాయ్‌. జనం పోతారు. ఆ విషయం జనానికి తెలుసు. కానీ ప్రయాణాలు చేయడం ఆపుతారా? ఆపరు.



పెద్ద నిర్మాత : ( బ్లింక్‌ )

తెల్ల కోటు : అంతెందుకు? మన థియేటర్స్‌లోనే - తాగినా, పొగతాగినా మీ ప్రాణానికి ప్రమాదం - అని క్లియర్‌గా చూపిస్తాం. కానీ ఎవడైనా తాగడం ఆపుతాడా? ఆపడు. సరిగ్గా అదే టెక్నిక్‌ని మనం థియేటర్లకోసం ఉపయోగించుకుంటాం. నిజం చెప్పి జనాన్ని థియేటర్లకి లాక్కొస్తాం.


పెద్ద నిర్మాత : అర్థమయిందయ్యా! "థియేటర్‌కి రావడం మీ ప్రాణానికి హానికరం" అని ప్రతి సినిమాలోనూ పెద్దగా వేస్తాం. జనం అది చూసి సంబరపడతారు. థియేటర్‌కి వచ్చినోళ్లలో ఒకడో ఇద్దరో పోతారు తప్ప, మనం మాత్రం పోం లే - అని ధైర్యం తెచ్చుకుని థియేటర్లకి వచ్చేస్తారు. అదేగా నీ ఐడియా?

తెల్ల కోటు : ( ఎక్స్‌ప్రెషన్‌ )



వీడియో ఇక్కడ చూడండి :



Updated Date - 2020-05-02T00:01:01+05:30 IST