భక్తులకు లక్ష్మీనృసింహుడి దర్శనాలు

ABN , First Publish Date - 2021-06-21T06:01:08+05:30 IST

గుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తులకు ఆదివారం నుంచి స్వామివారి దర్శన సౌకర్యం కల్పించారు.

భక్తులకు లక్ష్మీనృసింహుడి దర్శనాలు
పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు

భక్తులకు లక్ష్మీనృసింహుడి దర్శనాలు 

లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగడంతో ఇష్టదైవాల దర్శనాలకు భక్తులు  

39రోజుల పాటు నిలిచిన దేవదేవుడి దర్శనాలు

యాదాద్రి టౌన్‌, జూన్‌ 20: గుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తులకు ఆదివారం నుంచి స్వామివారి దర్శన సౌకర్యం కల్పించారు. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు యాదాద్రి దేవస్థాన అధికారులు ఆలయంలోనికి భక్తుల అనుమతిని నిలిపివేస్తూ స్వామి ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌కే పరిమితం చేశారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తజనులు కొండకింద వైకుంఠద్వారం చెంత మొక్కులు చెల్లించుకుని వెనుదిరిగారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయంతో  దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించనున్నట్టు ప్రకటించారు.

తొలిరోజు స్వామి సన్నిధిలో భక్తుల పూజలు

లాక్‌డౌన్‌ తర్వాత తొలి రోజు యాదాద్రి క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తజనులు ఇష్టదైవాన్ని దర్శించుకుని ఆర్జిత సేవోత్సవాలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. దర్శనానంతరం బాలాలయం వెనుక వైపు మొక్కు టెంకాయలు సమర్పించారు. యాదాద్రీశుడి సన్నిధిలో నిజాభిషేక పూజల్లో ఐదుగరు, నిత్యార్చనల్లో 9 మంది, సువర్ణ పుష్పార్చన పూజల్లో 85 మంది, సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో 18మంది దంపతులు సేవోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వాహన పూజల్లో 21మంది పాల్గొనగా. 10 ద్విచక్ర వాహనాలు, 9 కార్లు, 2 లారీలు వాహన పూజలు నిర్వహించుకోగా.. రూ.7,500 ఆదాయం.. సుమారు 250 మందికి పైగా భక్తులు ప్రత్యేక దర్శన టిక్కెట్లను కొనుగోలు చేయగా రూ.38,850 ఆదాయం..స్వామివారి ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,79,520 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరినట్టు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.

నిత్య ఆదాయం రూ.4.61లక్షలు

భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా ఆదివారం  4లక్షల 61 వేల 342 రూపాయల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. 39 రోజుల లాక్‌డౌన్‌ నిబంధనల అనంతరం స్వామి సన్నిధిలో భక్తులకు ప్రవేశంతో పాటు ఆర్జిత సేవోత్సవాల నిర్వహించుకున్నారు. స్వామికి ప్రధానబుకింగ్‌ ద్వారారూ.26,194, ప్రత్యేక దర్శనాల ద్వారా 21,650, వ్రత పూజల ద్వారా రూ.9,000, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,79,305, శాశ్విత పూ జల ద్వారా రూ.1,116, వాహన పూజల ద్వారా రూ.7,500 అన్నదాన విరాళం ద్వారా రూ.8232, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.49,760, టెం కాయల విక్ర యం ద్వారా రూ.18,000 సమకూరగా మిగతావి వివిధ విబాగాల ద్వారా ఆలయ ఖజానాలో జమయ్యినట్టు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2021-06-21T06:01:08+05:30 IST