ఇక నుంచి సచివాలయాల్లో ‘దర్శనాలు’

ABN , First Publish Date - 2020-06-02T09:36:23+05:30 IST

ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయల ద్వారా కూడా రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో దర్శనాలు, వసతి, సేవా, ఇతర సౌకర్యాల కోసం ముందస్తు బుకింగులకు అవకాశం కల్పించారు.

ఇక నుంచి సచివాలయాల్లో ‘దర్శనాలు’

కలికిరి, జూన్‌ 1: ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయల ద్వారా కూడా రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో దర్శనాలు, వసతి, సేవా, ఇతర సౌకర్యాల కోసం ముందస్తు బుకింగులకు అవకాశం కల్పించారు. కేవలం నామమాత్రపు రుసుముతోనే ఈ దర్శన సౌకర్యాల కోసం స్థానికంగానే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతానికి మొదటి దశలో శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాలకు సంబంఽధించిన స్వామి వారి సేవా టికెట్లను ముందస్తుగా పొందడానికి అవకాశం కలిగిస్తున్నారు. జూన్‌ 8 తరువాత దాదాపు అన్ని ఆలయాలు దర్శనాలకు సిద్ధం కానున్న విషయం తెలిసిందే. కాగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దాదాపు 540 వివిధ రకాల పౌర సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. కేవలం రూ. 15 రుసుముతో ఈ సేవలను సిద్దం చేశారు.


ఓటర్‌ ఐడీ, ఆదాయం, కులఽ ధ్రువీకరణ, పట్టాదారు పాసుపుస్తకం, ఎఫ్‌ఎంబీ నకళ్ళు, ఆధార్‌ కేవైసీ, విద్యుత్‌ మీటరు దరఖాస్తులు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణలు, మరణ ధ్రువీకరణలు, భూముల ఈసీలు, కొత్త రేషన్‌ కార్డు, రేషన్‌ కార్డులో పేర్ల సవరణలు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ, పుట్టిన తేదీ, మరణ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థుల బస్‌ పాసులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ స్లాట్‌ బుకింగ్‌ తదితర సేవలన్నీ సిద్ధం చేశారు. సోమవారం నుంచే దాదాపు 540 సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక మీదట మీ సేవా కేంద్రాలకు వెళ్ళాల్సి అవసరం లేదని అక్కడ లభించే అన్ని రకాల సేవలు స్వల్ప ఛార్జీలతో గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయా ఎంపీడీవోలు కూడా ప్రకటిస్తున్నారు.


ఈ-సేవా కేంద్రాలకు మంగళం?

 జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13 ఈ-సేవా కేంద్రాలను ఈ సందర్భంగా రద్దు చేయనున్నారు. 2002లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ  కేంద్రాలను ఏర్పాటు చేసింది.2011లో వీటన్నింటినీ మీసేవా కేంద్రాలుగా మార్చి మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చారు. అందులో అర్బన్‌ కేంద్రాలంటూ జిల్లాలో 13 కేంద్రాలను ఈ-సేవా కేంద్రాలుగానే కొనసాగిస్తున్నారు. అయితే ఇవి ప్రభుత్వ నిర్వహణలో కాంట్రాక్టు ఉద్యోగులతో కొనసాగుతున్నాయి. అర్బన్‌ ఈ-సేవా కేంద్రాలుగా చలామణిలో వున్న వీటిలో పనిచేస్తున్న 156 మందిని అర్హతల ఆధారంగా ప్రస్తుత గ్రామ, వార్డు సచివాలయాల్లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో అర్బన్‌ ఈ-సేవా కేంద్రాలు మూతబడనున్నాయి.


సచివాలయ సేవలపై కోర్టులో పీట ముడి

కాగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 540 రకాల సేవలను అందుబాటులోకి తేవడంపై హైకోర్టులో వున్న కేసు ప్రతిబంధకం కానుందని మరో వాదన వినవస్తోంది. జిల్లాలోని మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 436, పట్టణ ప్రాంతాల్లో  146 మీసేవా కేంద్రాలున్నాయి. నిరుద్యోగ యువకులు ఏర్పాటు చేసుకున్న మీసేవా కేంద్రాల్లో ఇప్పటి వరకూ పై సేవలన్నీ లభిస్తున్నాయి. అయితే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకోగానే మీ సేవా కేంద్రాల్లో లభించే సేవలన్నింటినీ సచివాలయాలకు బదలాయిస్తూ అక్కడే అందుబాటులో వుండే విధంగా గత సంవత్సరం డిసెంబరు 16న జీవోను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో మీసేవా కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు జరిపారు. రాష్ట్రంలో 40 వేల కుటుంబాలు రోడ్డున పడుతాయని విన్నవించారు.


అయినా ప్రభుత్వం ససేమిరా అనడంతో మీసేవా నిర్వాహకుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన జీవో నెం. 22 పై హై కోర్టు స్టే విధించింది. దీంతో సచివాలయాల్లో 540 రకాల సేవల ప్రారంభ వ్యవహారం ముందుకు సాగలేదు. అయితే కోర్టు స్టే కొనసాగుతుండగానే తిరిగి హఠాత్తుగా సచివాలయాల్లో సేవలు తెరమీదకు రావడంతో మీసేవా కేంద్రాల సంఘం స్టే విషయం ప్రభుత్వానికి గుర్తుకు తెస్తూ గత శుక్రవారం నోటీసులిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సచివాలయ సేవల అందుబాటుపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2020-06-02T09:36:23+05:30 IST