Abn logo
Mar 3 2021 @ 00:36AM

దార్శనికులైన వీసీలు తక్షణావసరం!

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు కొన్ని సాంకేతిక కారణాల వలన వైస్ చాన్సులర్ల నియామకం జరగలేదనే విషయం అందరికి తెలిసిందే. ఈ కారణంగా విశ్వవిద్యాలయాల్లోని పరిపాలన, అకడమిక్, పరిశోధన రంగాలకు పరిమితులు ఏర్పడుతున్నాయి. ఇంచార్జ్ వైస్ చాన్సులర్లుగా సివిల్ సర్వీసులకు చెందిన ప్రభుత్వాధికారులను నియమించడం వల్ల యూనివర్సిటీ రోజువారీ అధ్యాపన, పరిశోధన గమనాలు కుంటుపడ్డాయి. 


యూనివర్సిటీ వీసి నియామాకం అత్యంత ప్రతిష్టాత్మకం.సెర్చ్ కమిటీని నియమించి, యూజిసి నిబంధనలతో కూడిన పానెల్ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. పానెల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సిఫారసు చేసిన వ్యక్తులను రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్ హోదాలో వైస్ చాన్స్‌లర్‌ను నియమిస్తాడు. ఈ నియామాకం మూడేళ్ల వరకు ఉంటుంది. మూడేళ్ల పాటు విశ్వవిద్యాలయానికి సంబంధించి అన్ని నిర్ణయాల్లో వైస్ చాన్సులర్‍ది ప్రముఖ పాత్ర. ఇంతటి ప్రాధాన్యత గల పోస్టులకు ఆశావాహుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. 


బోధన, పరిశోధన, విస్తరణ లక్ష్యాలుగా సమాజాభివృద్ధికి ఒక విజన్ ఉన్న వ్యక్తి చేతుల్లో విశ్వవిద్యాలయాలు ఉంటే బాగుంటుంది. యూనివర్సిటీల్లోని ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకొని విద్యార్థులకు, అధ్యాపకులకు నిత్యం అందుబాటులో ఉండాలి. అప్పుడు మాత్రమే యూనివర్సిటీలోని వివిధ శాఖలకు అధిపతులను, డీన్లను, కళాశాలల ప్రిన్సిపల్స్‌ని నియమించి వారి నుంచి ఉత్తమ ఫలితాలను రాబట్టవచ్చు. ఈ అధికారం, నిర్వహణ సామర్థ్యాలు వీసికి ఉంటాయి. ముఖ్యంగా వీసి అటు ప్రభుత్వానికి అందుబాటులో ఉంటూనే, ఇటు యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని కాపాడాలి. వివిధ విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విధివిధానాలను సమీకరించుకుంటూ వాటి మధ్య సమన్వయకర్తగా కృషి చేయాలి. యూనివర్సిటీకి సంబంధించిన బడ్జెట్, ఖర్చులు, రాబడులు మొదలైన ఆర్థికాంశాలపై అవగాహన ఉండాలి. ప్రభుత్వం నుంచి తగినంత సహాయం అందనప్పడు యూనివర్సిటీ స్వయంగా డబ్బులు సమకూర్చుకునే విధానాలకు రూపకల్పన చేయాలి. గ్రామీణ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలి. శాస్త్ర సాంకేతికాభివృద్ధి పెంపొందించడంతో పాటు ప్రజా సమూహాలకు అవసరమైన అభివృద్ధిని అందించాలి. బోధన, పరిశోధనల్లో ఉత్తమ ప్రమాణాలు పెంపొందించాలి. 


ప్రభుత్వ విశ్వవిద్యాలయాలంటేనే ఉద్యమాలు, పోరాటాలు అనే ముద్ర పడింది. ఇక్కడి అధ్యాపకులు క్లాసులు చెప్పరని, వారి దగ్గర విజ్ఞానం లేదనే ప్రచారాలు చేస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా అవాస్తవం. ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి వాటిల్లో ఉత్తమమైన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక పోటీ పరీక్షల్లో ఇక్కడి విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. ఉత్తమమైన పరిశోధన చేసిన అధ్యాపకులు ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన వ్యాసాలు వస్తున్నాయి. క్రీడా రంగాల్లో ఈ యూనివర్సిటీల విద్యార్థులే ఎక్కువ. కానీ, ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వర్గాలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వాల నుంచి వచ్చే సదుపాయాలకు ఆటంకం కలిగిస్తున్నారు.


ఉన్నత విద్యారంగానికి రోజురోజుకు నిధులు తగ్గిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2020–2021 సంవత్సరానికి సంబంధించి కేవలం 1,723 కోట్లు మాత్రమే కేటాయించింది. దానితో విశ్వవిద్యాలయాల నిర్వహణ భారమైపోతుంది. పాలనాభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవడం లేదు. రాజకీయాల జోక్యం ఎక్కువైపోయింది. ఉన్న నిధుల వినియోగంపై పర్యవేక్షణ లోపించింది. యూనివర్సిటీ భూములు కబ్జాకి గురవుతున్నాయి. అకడమిక్ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నది. యూనివర్సిటీ వీసిల నియామాకాల్లో పైరవీకారులకు కాకుండా, నీతి నిజాయితీలతోపాటు బోధన, పరిశోధన రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని నియమించాలి. తెలంగాణ సమాజాభివృద్ధికి తోడ్పడాలి. 

ఇమ్మిడి మహేందర్

రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం

Advertisement
Advertisement
Advertisement