ఇక పట్టణాలపై దృష్టి

ABN , First Publish Date - 2021-02-23T06:51:10+05:30 IST

పల్లెపోరు ప్రశాంతంగా ముగిసిందనుకునే లోపే మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లు మొదలైపోయాయి.ఎన్నికలకు అవసరమైన సిబ్బందిని నియమించడం, పోలింగ్‌కు అవసరమైన సామగ్రిని సిద్ధం చేయడం వంటి పనుల్లో అధికారులు బిజీగా మారారు.

ఇక పట్టణాలపై దృష్టి

మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లలో 

  అధికారయంత్రాంగం బిజీ బిజీ

 207 డివిజన్లలో 1548మంది పోటీ


చిత్తూరు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): పల్లెపోరు   ప్రశాంతంగా ముగిసిందనుకునే లోపే మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లు మొదలైపోయాయి.ఎన్నికలకు అవసరమైన సిబ్బందిని నియమించడం, పోలింగ్‌కు అవసరమైన సామగ్రిని సిద్ధం చేయడం వంటి పనుల్లో అధికారులు బిజీగా మారారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో పాటు మున్సిపల్‌ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులతో వీసీ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలలాగే మున్సిపల్‌ ఎన్నికలనూ ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ సెంథిల్‌ కుమార్‌, తిరుపతి కమిషనర్‌ గిరీషా తదితరులకు సూచించారు. పంచాయతీ ఎన్నికలకు పరిశీలకుడిగా వ్యవహరించిన నవీన్‌కుమార్‌ మున్సిపల్‌ ఎన్నికలకూ కొనసాగనున్నారు.ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసినట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. గత ఏడాది బెదిరింపులతో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని కొందరు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినా.. నిర్ణయం మారలేదు. మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇక మార్చి 10వ తేదీన పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గతేడాది మార్చి 15 వరకు ఆగిన మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే.. ఎన్నికలు జరుగుతున్న రెండు నగర, ఐదు పురపాలికల్లో 1684 నామినేషన్లు దాఖలవగా.. వాటిలో 1584 నామినేషన్లను ఆమోదించారు. పుంగనూరులో 31కి గానూ 22 వార్డులు, పలమనేరులో 26కుగానూ 10, తిరుపతిలో 50డివిజన్లకు గానూ 6, మదనపల్లెలో 35కు గానూ 3 చొప్పున వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు, నగరి, పుత్తూరు ప్రాంతాల్లో ఏకగ్రీవాలు లేవు. ఇక మిగిలిన 207 డివిజన్లలో మాత్రమే పోటీ నెలకొంది. ఇక్కడ 1548 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

 పార్టీ గుర్తులతో ఎన్నికలు

రాజకీయ నేతల దృష్టి కూడా గ్రామాల నుంచి పట్టణాల మీదకు మళ్లింది. వీలైనన్ని డివిజన్లను ఏకగ్రీవం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.మున్సిపాలిటీల్లో ఛైర్మెన్‌, మేయర్‌ పదవుల్ని ఆశించేవారు మంత్రి పెద్దిరెడ్డి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్‌ ఎక్కువగా నమోదైంది. పట్టణాల్లో ఆ స్థాయిలో నమోదు కావడం కష్టమే.అయితే పట్టణాల్లోనూ అదే పోలింగ్‌ శాతం నమోదయ్యేలా చూడాలని ఎస్‌ఈసీ సోమవారం జిల్లా అధికారులకు సూచించారు.

Updated Date - 2021-02-23T06:51:10+05:30 IST