Abn logo
Mar 1 2021 @ 12:44PM

అమెరికాలో కళాతపస్వికి స్వరాభిషేకం!

ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించి తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన దిగ్దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇటీవల 91వ జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు విశ్వనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా గాయని శారద ఆకునూరి (అమెరికా), వంశీ ఇంటర్నేషనల్ (భారత్) సంయుక్త ఆధ్వర్యంలో విశ్వనాథ్ 91వ జన్మదినమహోత్సవ వేడుకలను అత్యంత అద్భుతంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు ఆన్‌లైన్ ద్వారా విశ్వనాథ్‌ గురించి మాట్లాడారు. శారద ఆకునూరి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో హీరోయిన్ మీనాక్షి శేషాద్రి మాట్లాడుతూ.. `ఆపద్బాంధవుడు` చిత్రంలో కథానాయికగా నటించిన తనకు నంది అవార్డు వచ్చిందని, అప్పటి షూటింగ్ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. 

ఇక, `ఉండమ్మా బొట్టు పెడతా` చిత్ర కథానాయకి జమున.. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభను, చిత్రీకరణ విధానాన్ని ప్రశంసించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. `సూత్రధారులు` చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ.. `కళా ఖండాలను రూపొందించే విశ్వనాథ్‌గారి చిత్రాలలో నటించాలనే కోరిక నాకు ఉండేది. ఆ కోరిక `సూత్రధారులు` ద్వారా తీరింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరపురాని ఒక ఆదర్శవంతమైన దర్శకుడు విశ్వనాథ్` అని ప్రస్తుతించారు. ఇక, `సిరి సిరి మువ్వ`, `శుభోదయం`, `ఓ సీతకథ`, `సీతామాలక్ష్మి` వంటి  చిత్రాలలో కథానాయకుడిగా నటించిన చంద్రమోహన్ మాట్లాడుతూ.. తనకెన్నో చిత్రాలలో హీరో పాత్రలు ఇచ్చి తన పురోభివృద్ధికి తోడ్పడిన సోదర సమానులు విశ్వనాథ్ గారని కొనియాడారు. ఇక, `ఓ సీతకథ`లో నాయిక పాత్ర ఇచ్చి తనను విశ్వనాథ్ ప్రోత్సహించారని రోజారమణి అన్నారు. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద రాజా మాట్లాడుతూ.. ``శంకరాభరణం`, `సాగరసంగమం`, `సిరిసిరి మువ్వ`, `స్వాతి ముత్యం`, `ఆపద్బాంధవుడు`, `స్వయంకృషి` లాంటి చిత్రాల రూపొందించి మా `పూర్ణోదయా`కు  ప్రపంచ ఖ్యాతి తెచ్చిన దర్శకులు విశ్వనాథ్ గారు` అని అన్నారు. ఇక, అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయనీ గాయకులు విశ్వనాథ్ చిత్రాలలోని పాటలు పాడారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ గాయనీ గాయకులకు అభినందలు అందజేశారు.


Advertisement
Advertisement
Advertisement