ఇరుకైన గోడలు కూలిపోయే రోజు కోసం

ABN , First Publish Date - 2022-05-07T06:23:21+05:30 IST

ఇవాళ విశ్వకవి రవీంద్రుడు పుట్టినరోజు. ఆయన ప్రకృతిని గొప్ప పాఠశాలగా భావించాడు. పరిశీలన, ప్రకృతితో మమేకం కావడం ద్వారా జ్ఞానవంతుడయ్యాడు. ప్రకృతి ఆస్వాదన నుంచే సాహిత్యాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. ఎగిరే పక్షుల్ని, వీచే గాలుల్ని, వికసించిన పూలను, స్వచ్ఛంగా..

ఇరుకైన గోడలు కూలిపోయే రోజు కోసం

ఇవాళ విశ్వకవి రవీంద్రుడు పుట్టినరోజు. ఆయన ప్రకృతిని గొప్ప పాఠశాలగా భావించాడు. పరిశీలన, ప్రకృతితో మమేకం కావడం ద్వారా జ్ఞానవంతుడయ్యాడు. ప్రకృతి ఆస్వాదన నుంచే సాహిత్యాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. ఎగిరే పక్షుల్ని, వీచే గాలుల్ని, వికసించిన పూలను, స్వచ్ఛంగా పారే నీటిని కంటితో చూస్తూ, గుండెల్లోకి తీసుకున్నాడు. ఇంటివద్దనే విద్యాభ్యాసం పొందే తాహతు ఉండటం వల్ల ఠాగూర్ గొప్ప స్వేచ్ఛను పొందాడు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. సంస్కృత కావ్యాలు చదివాడు. ఆంగ్ల సాహిత్యాన్ని పరిశీలించాడు.


బాల్యంలోనే ‘సంధ్యాగీత’ ప్రకటించాడు. ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో..’ అన్న ప్రసిద్ధ గేయం ఆయన హృదయం నుండి ఊరకే రాలేదు. ఒక స్వేచ్ఛా స్వర్గంలోకి, దేశాన్ని మేలుకునేట్లు చేయమని ప్రార్థించాడు. ఈ వాక్యాలు ఇప్పటికీ నెరవేరలేదు. ఇరుకైన గోడలు అలానే ఉన్నాయి. రవీంద్రుడు దార్శనికుడు. విశ్వమానవ వాదాన్ని కోరుకున్నాడు. కవిత్వంలో పదాడంబరం ఉండదు. తేలికైన మాటలలో, ఒక గొప్ప భావన మన లోపలకి వెళ్ళిపోతుంది. ‘గీతాంజలి’ దేశ హద్దుల్ని దాటి, ప్రపంచం అంతా వినిపించింది. ఠాగూర్ వెలువరించిన ‘స్టేబర్డ్స్’ చాలా విలువైన గ్రంథం. ఈ దేశంలో కుల, మత, వర్గాలకు అతీతంగా మానవుడు తయారుకావాలని అభిలషించాడు. మతం మనిషిని విభజించరాదని తెలియజేశాడు. ‘జలియన్ వాలాబాగ్’ దురాగతానికి బాధపడి నైట్‌హుడ్ బిరుదును త్యజించాడు. తన ఎనభై ఏళ్ళ జీవిత ప్రస్థానంలో అనేక నవలలు, నాటికలు, కవితా సంపుటాలు, గేయాలు రచించి సంపూర్ణ సాహిత్యకారుడిగా ఆవిష్కరించుకున్నాడు. ఠాగూర్ సాహిత్యం ప్రపంచ భాషల్లోకి విస్తరించింది. ఈ దేశానికి సాహిత్యంలో నోబెల్ అందించిన ‘గీతాంజలి’ని ఎందరో అనువాదాలు చేశారు. ఆయన భావాలను పాడటమో, చదవటమో కంటే ఆచరణలో పెట్టాలి. మనం, మన చుట్టూ బాగుపడాలి. అప్పుడు ఏ దేవుడూ అవసరం లేదు. మనల్ని మనమే మేలుకొలుపుకొనే రోజు రవీంద్రుని ఆశయం నెరవేరినట్టు.

 సుంకర గోపాల్‌ (తాడేపల్లిగూడెం)

Read more