అప్పుడే మార్పు వస్తుంది!

ABN , First Publish Date - 2020-06-28T05:30:00+05:30 IST

విశ్వక్‌సేన్‌... వెండితెర ‘ఫలక్‌నుమా దాస్‌’! ‘హిట్‌’ అందుకున్న కొత్త కథానాయకుడు!! ఇటీవల చైనా సరిహద్దుల్లో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు ఇంటికి వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో సైనికుల త్యాగాలు సహా చైనీస్‌ యాప్స్‌ డిలిట్‌ చేయాలనే ఉద్యమం గురించి...

అప్పుడే మార్పు వస్తుంది!

విశ్వక్‌సేన్‌... వెండితెర ‘ఫలక్‌నుమా దాస్‌’! ‘హిట్‌’ అందుకున్న కొత్త కథానాయకుడు!! ఇటీవల చైనా సరిహద్దుల్లో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు ఇంటికి వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో సైనికుల త్యాగాలు సహా చైనీస్‌ యాప్స్‌ డిలిట్‌ చేయాలనే ఉద్యమం గురించి, లాక్‌డౌన్‌లో జీవనశైలితో పాటు చిత్రపరిశ్రమలో బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం గురించీ ‘నవ్య’తో విశ్వక్‌సేన్‌ సంభాషించారు.


‘‘కుటుంబ సభ్యులు, కన్నబిడ్డలకు దూరంగా సకల సౌకర్యాలు, సంతోషాలు వదిలేసి దేశంలో ప్రజల కోసం కష్టపడుతున్నది ఎవరైనా ఉన్నారంటే? సైనికులే. మనమంతా సౌకర్యవంతమైన జీవితాలను ఎంచుకున్నాం. సైనికులు అలా కాదు... దేశంకోసం వెలకట్టలేని త్యాగాలు చేస్తున్నారు. వాళ్లు  నిజమైన హీరోలు. మనందరి కన్నా ఎక్కువ గౌరవం పొందే అర్హత సైనికులకే ఉంది. కల్నల్‌ సంతోష్‌బాబు వీరమరణం నన్నెంతో బాధించింది. సూర్యాపేటకి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను కలిస్తే... ‘సంతోష్‌బాబు త్యాగం వృథా కాలేదు. మనకు మద్దతుగా ప్రజలున్నారు’ అని వాళ్లకూ తెలుస్తుందని అనుకున్నా. అంతకు మించి ఏమీ లేదు.




వీరమాతకు కృతజ్ఞతలు

పిల్లలను సైన్యంలోకి పంపించడానికి ఎంతమంది తల్లులు సిద్ధంగా ఉన్నారు? ధైర్యంగా తన కుమారుణ్ణి సైన్యంలోకి పంపిన సంతోష్‌బాబు తల్లి, వీరమాత మంజులగారికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లాను. ఆమె కుమారుడి త్యాగం చిన్నది కాదు. మంజుల, సంతోష్‌ సతీమణి అభిజ్ఞగారితో మాట్లాడను. వాళ్లకు హ్యాట్సాఫ్‌. భారతదేశంలో రాజకీయం ఎట్లుంటదంటే... వద్దనుకున్నా మనకన్నీ తెలుస్తాయి. సినీ, రాజకీయ చర్చలు ప్రజల మధ్య ఎక్కువే. కానీ, సైనికుల త్యాగాలపై చర్చ తక్కువే. ఓ మనిషి జీవితాన్ని త్యాగం చేస్తూ, దేశం కోసం సరిహద్దుల్లో ఉండడమే నిజమైన దేశభక్తి కదా!


చైనా యాప్స్‌, ప్రొడక్ట్స్‌ నిషేధిస్తే?

చైనా సరిహద్దులో ఘర్షణపూరిత, ఉద్రిక్త వాతావరణం తర్వాత చైనా యాప్స్‌ డిలీట్‌ చేయాలని, ప్రొడక్ట్స్‌ బ్యాన్‌ చేయాలనే మాట వినపడుతోంది. ప్రపంచ జనాభా 750 కోట్లలో భారతీయులు 135 కోట్లమంది ఉన్నారు. టిక్‌టాక్‌ వంటి చైనీస్‌ యాప్స్‌ డిలీట్‌ చేయమంటే... ప్రపంచ జనాభాలో 15 కన్నా ఎక్కువ శాతం మందికి చెబుతున్నాం. ఎంతమందిని కంట్రోల్‌ చేయగలం? ఎంతవరకూ సాధ్యపడుతుంది? అనేది తెలియదు. ఒకవేళ సాధ్యపడితే మంచిదే. చైనీస్‌ యాప్స్‌కి బదులు ఇండియన్‌ యాప్స్‌ వస్తే బావుంటుంది. త్వరలో అదే జరుగుతుందని ఆశిస్తున్నా. ఇప్పుడు ప్రధాని మోదీ చెబితే అందరూ వింటున్నారు. ఆయన ‘ఇండియన్‌ ప్రొడక్ట్స్‌ వాడమని చెప్పారు. కానీ, చైనీస్‌వి బ్యాన్‌ చేయమ’ని చెప్పలేదు. ఆయన బ్యాన్‌ చేయమని చెబితే వింటారనుకుంటున్నా. నేను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగిస్తున్నా. అవి చైనీస్‌ యాప్స్‌ కాదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఓ దేశం వల్ల కష్టపడుతోంది. వాస్తవమే కదా!


పైకొస్తున్న టైమ్‌లో... కరోనా బ్రేక్‌!

ఇప్పుడు అంబానీ అయినా... ఎవరైనా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా, లాక్‌డౌన్‌ వల్ల సడన్‌గా ఇంట్లో పడ్డామంతా. నాకు కంప్లయింట్స్‌ ఏమీ లేవు. గత ఏడాదిగా సినిమాలు, షూటింగులతో నేను బిజీ. నిద్రపోవడానికి టైమ్‌ సరిపోయేది కాదు. అమ్మతో రెండు మూడు రోజులకు ఒకసారి మాట్లాడేవాడిని. లాక్‌డౌన్‌లో ప్రశాంతంగా తిని, తొంగున్నా. కొత్త కొత్త వంటలు ఇటాలియన్‌ నేర్చుకున్నా. ఇంటోవాళ్లతో టైమ్‌ స్పెండ్‌ చేశా. అయితే... హీరోగా పైకొస్తున్న టైమ్‌లో చిన్న బ్రేక్‌ పడిందనుకున్నా. తర్వాత ఆలోచిస్తే... అసలు ఛాన్సులు రానివాళ్లు ఎంత బాధపడాలి? అనిపించింది.


స్టార్‌ దర్శకులు కొత్తవాళ్లతో తీసే రోజు వస్తే...

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం చర్చ మళ్లీ మొదలైంది. కానీ, తెలుగులో నాకు నెపొటిజమ్‌, ఫేవరెటిజమ్‌ లాంటి ఇబ్బందులు ఏవీ లేవు. ఇప్పటివరకూ అంతా బావుంది. అయితే, స్టార్‌ దర్శకులు కొత్తవాళ్లతో సినిమా తీసే రోజు వస్తే బావుంటుంది. ఇక్కడ మార్కెట్‌ లెక్కలు వేసుకుని సినిమాలు తీస్తారు. అగ్ర హీరోలతో సంవత్సరానికి ఓ సినిమా చేసే దర్శకులు, మధ్యలో కొత్తవాళ్లతో సినిమాలు చేస్తే మార్పు వస్తుంది.


చాలా దూరం ప్రయాణించాలి!

‘ఈ నగరానికి ఏమైంది?’, ‘ఫలక్‌నుమా దాస్‌’, ‘హిట్‌’ విజయాలతో హ్యాపీ. అలాగనీ, నేనేదో సాధించానని ఫీలవ్వడం లేదు. నేను వెళ్లాలనుకున్నది వంద కిలోమీటర్లు! ఇప్పటివరకూ వెళ్లింది పది కిలోమీటర్లే. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. పరిస్థితులు చక్కబడిన తర్వాత అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘పాగల్‌’ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తా. అందులో మంచి లవ్‌ స్టోరీ ఉంది. దాని తర్వాత ‘హిట్‌ 2’ చేస్తా. మరో నాలుగు మంచి కథలు ఓకే చేశా. షూటింగులు మొదలైన ఏడాదిలో ఆ నాలుగు సినిమాలు చేస్తా.’’

-సత్య పులగం

Updated Date - 2020-06-28T05:30:00+05:30 IST