రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు

ABN , First Publish Date - 2022-04-18T23:28:40+05:30 IST

తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వదీన్ దయాళన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు

గువాహటి: తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వదీన్ దయాళన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కారులో గువాహటి నుంచి షిల్లాంగ్ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అతడు మృతి చెందినట్టు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ) తెలిపింది. నేటి నుంచి 83వవ సీనియర్ నేషనల్, అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌ ప్రారంభం కానుండగా, పాల్గొనేందుకు సహచరులైన సంతోష్ కుమార్, అవినాష్ ప్రసన్నాజీ శ్రీనివాసన్, కిషోర్ కుమార్‌లతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వీరు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  


షంగ్‌బంగ్లా ప్రాంతంలో రోడ్డుపై ఎదురుగా వచ్చిన 12 చక్రాలున్న భారీ ట్రైలర్ డివైడర్‌ను, ఆ వెంటనే కారును ఢీకొట్టి పక్కనే ఉన్న గొయ్యిలో పడిపోయింది. ఈ ఘటనలో ట్యాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన విశ్వను నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.


వర్ధమాన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడైన విశ్వ దీన్ దయాళన్ ఎన్నో టైటిళ్లు గెలుచుకున్నాడు. అంతర్జాతీయంగానూ పలు పతకాలు సాధించాడు. ఏప్రిల్ 27 నుంచి ఆస్ట్రియాలోని లింజ్‌లో జరగనున్న డబ్ల్యూటీటీ యూత్ కాంటెండెర్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోవడం క్రీడారంగంలో పెను విషాదం నింపింది. చెన్నైలోని అన్నానగర్‌లో ఉన్న కృష్ణస్వామి టీటీ క్లబ్‌లో రామ్‌నాథ్ ప్రసాద్, జై ప్రభురామ్ వద్ద శిక్షణ పొందాడు.


విశ్వ మృతికి మేఘాలయ టేబుల్ టెన్నిస్ అసోసియన్ ఉపాధ్యక్షుడు బ్రూస్ పి మారక్, ప్రధాన కార్యదర్శి చిరంజీబ్ చౌదరి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా విశ్వ మృతిపై స్పందించారు. విశ్వ మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధాకరమని అన్నారు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు కూడా సంతాపం తెలిపారు. 

Updated Date - 2022-04-18T23:28:40+05:30 IST