హీరో విశాల్ దర్శకత్వంలో ‘తుప్పరివాలన్‌-2’.. మాస్ట్రో మ్యూజిక్

హీరో విశాల్‌ గతంలో ప్రకటించిన ‘తుప్పరివాలన్‌-2’ చిత్రాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా అధికారికంగా ప్రకటించారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఈ చిత్రం షూటింగ్‌ లండన్‌లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కథ లండన్‌ నుంచే ప్రారంభమవుతుంది. అందుకే లండన్‌లో షూటింగ్‌ ప్రారంభించేలా ప్లాన్‌ చేస్తున్నారు. మరోవైపు, ఈ చిత్రానికి సంగీత మేథావి ఇళయరాజా సంగీతం సమకూర్చనున్నారు. నీరవ్‌ షా ఛాయాగ్రహణం అందించనున్నారు. నిజానికి 2017లో వచ్చిన ‘తుప్పరివాలన్‌’ మొదటి భాగానికి మిష్కిన్‌ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రెండో భాగాన్ని కూడా వీరిద్దరే ప్రారంభించేలా ప్లాన్‌ చేశారు. 


కానీ, వారి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి మిష్కిన్‌ వైదొలిగారు. దీంతో ‘తుప్పరివాలన్‌-2’ చిత్రానికి తానే దర్శకత్వం వహించనున్నట్టు విశాల్‌ గతంలో ప్రకటించారు. ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఇపుడు వచ్చే యేడాది నుంచి ఈ సినిమా ప్రారంభించనున్నట్టు విశాల్‌ ప్రకటించారు. అలాగే, కొత్త పోస్టరును కూడా తాజాగా రిలీజ్‌ చేశారు. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ సొంతంగా నిర్మించడమే కాకుండా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించనున్నారు. కాగా, ఇటీవలే ‘ఎనిమి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్‌ ఇపుడు వచ్చే యేడాది ఫిబ్రవరిలో ‘వీరమే వాగై సూడుమ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నారు.

Advertisement