Abn logo
Sep 23 2021 @ 00:29AM

కొప్పర్రు ఘటనకు అసలు కారణమిదే..!

పెదనందిపాడు ఎస్‌ఐపై వేటు

వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు

ఎస్‌ఐ నిర్లక్ష్యం వల్లే కొప్పర్రు ఘటన

రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ


గుంటూరు, సెప్టెంబరు 22: వినాయకుడి నిమజ్జనం సందర్భంగా పెదనందిపాడు మండలం, కొప్పర్రులో చోటుచేసుకున్న దాడులు, ప్రతిదాడుల ఘటనకు బాధ్యుడను చేస్తూ పెదనందిపాడు ఎస్‌ఐ నాగేంద్రపై వేటు పడింది. ఆయనను వీఆర్‌కు పంపుతూ రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాలు జారీ చేశారు. కాకుమాను ఎస్‌ఐను ఇన్‌చార్జిగా నియమించారు. కొప్పర్రులో చోటుచేసుకున్న ఘటనపై బుధవారం ఆయన స్పందించారు. కేవలం ఎస్‌ఐ నాగేంద్ర నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు. గడచిన కొద్ది సంవత్సరాలుగా కొప్పర్రులో వినాయక నిమజ్జనం రోజున మాజీ జడ్పీటీసీ బత్తిన శారద, వేణుగోపాలకృష్ణ ఇంటిపై వరుస దాడులు జరుగుతున్న విషయం తమ దృష్టిలో ఉందని రూరల్‌ ఎస్పీ తెలిపారు. అంతేగాక మాజీ జడ్పీటీసీ భర్త వేణుగోపాలకృష్ణ ముందుగానే ఆ రోజున తమకు తగిన భద్రత కల్పించి గొడవలు జరగకుండా చూడాలని పెదనందిపాడు పోలీసులను కోరిన మాట వాస్తవమేనన్నారు.


కొప్పర్రు సమస్యాత్మక గ్రామం అని తమ దృష్టిలో ఉందన్నారు. అందుకనుగుణంగా బాపట్ల డీఎస్పీ, పొన్నూరు రూరల్‌ సీఐకి ముందు జాగ్రత్త చర్యలపై ఆదేశాలిచ్చానన్నారు. దీంతో పొన్నూరు రూరల్‌ సీఐ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పెదనందిపాడు ఎస్‌ఐని ఆదేశించారని తెలిపారు. అయితే వినాయక విగ్రహం ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఎస్‌ఐ నాగేంద్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. పక్క గ్రామంలో ఏదో ఘటన జరిగిందని సమాచారం రాగా తాను అక్కడకు వెళ్లటంతో ఈ ఘటన జరిగిందని ఎస్‌ఐ చెప్పాడన్నారు. అయితే దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. టీడీపీకి చెందిన మాజీ జడ్పీటీసీ భర్త వేణుగోపాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 19 మంది వైసీపీ వర్గీయులపై కేసు నమోదు చేశామన్నారు. అదేవిధంగా వైసీపీకి చెందిన మేదరమెట్ల వెంకటప్పయ్యచౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన 49 మందిపై కేసు నమోదు చేశామన్నారు. గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై అదనపు ఎస్పీ, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ, బాపట్ల డీఎస్పీతో ప్రత్యేక దర్యాప్తు చేయిస్తున్నట్టు తెలిపారు.


మాజీ జడ్పీటీసీ దంపతులకు రక్షణ కల్పించేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వ్యక్తులు దాడులకు దిగటంతో ఆత్మరక్షణ కోసం వారు తిరగబడితే అది కూడా నేరమేనా అని ప్రశ్నించగా దీనిపై విచారణ జరిపి గొడవకు దారి తీసిన కారణాలు ఏమిటి, ఎవరెవరు దాడిలో పాల్గొన్నారు అనే వివరాలను  దర్యాప్తు చేసిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ముందే తెలిసినా..?

కొప్పర్రులో నిమజ్జనం సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ గ్రామంలో అల్లర్లు జరగకుండా చూడటంలో పోలీసు శాఖ విఫలమైంది. కనీసం అదనపు బలగాలను కూడా తరలించలేదు. అయితే ఆ సమయంలో 10 మంది పోలీసులు గ్రామంలో ఉన్నట్టు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. గ్రామస్థులు మాత్రం నలుగురే ఉన్నారని అంటున్నారు. ఆ సమయంలో ఎస్‌ఐ లాఠీఛార్జి చేసి ఉంటే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉండేదని రూరల్‌ ఎస్పీ స్పష్టం చేశారు. అయితే అధికార పార్టీ వారిపై లాఠీ ఝుళిపిస్తే తన సీటుకే ఎసరు వస్తుందని ఎస్‌ఐ వెనకాడి ఉంటారని పోలీసు వర్గాలతోపాటు రాజకీయ పక్షాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.