విశాఖ ఉక్కు స్థానిక సంపద

ABN , First Publish Date - 2021-04-19T05:09:32+05:30 IST

అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం స్థానికుల సంపద అని, ప్లాంట్‌ ఏర్పాటుకు 22 వేల ఎకరాలు ఇచ్చిన స్థానికులకే ఈ కర్మాగారం చెందుతుందని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) జాతీయ అధ్యక్షుడు రాకేశ్‌ తికాయత్‌ ఉద్ఘాటించారు.

విశాఖ ఉక్కు స్థానిక సంపద
విశాఖ బీచ్‌ రోడ్డులో జరిగిన శంఖారావం సభలో శంఖాలు పూరించిన కార్మిక, రైతు సంఘాల నాయకులు

ప్రైవేటీకరించడం అత్యంత దుర్మార్గం

విజయంసాధించే వరకు పోరాడండి

ఎవరొచ్చినా ఎదిరించండి.. వెనక్కి తగ్గొద్దు

బడా పారిశ్రామిక వేత్తల సేవలో ప్రధాని 

మోదీది రైతు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం

నిప్పులుచెరిగిన బీకేయూ అధ్యక్షుడు తికాయత్‌ 

ఐక్యం పోరుతో ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలని పిలుపు


విశాఖపట్నం/కూర్మన్నపాలెం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం స్థానికుల సంపద అని, ప్లాంట్‌ ఏర్పాటుకు 22 వేల ఎకరాలు ఇచ్చిన స్థానికులకే ఈ కర్మాగారం చెందుతుందని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) జాతీయ అధ్యక్షుడు రాకేశ్‌ తికాయత్‌ ఉద్ఘాటించారు. విశాఖపట్నం కూర్మన్నపాలెం కూడలిలో 66 రోజులుగా ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఆదివారం తికాయత్‌ సహా ఆలిండియా కిసాన్‌ సంఘ్‌ అధ్యక్షుడు అశోక్‌ థావలె, నాయకులు బల్‌ కరణ్‌సింగ్‌, మేజర్‌ సింగ్‌ పూనేవాలా, ఏఐఏడబ్ల్యూ జాతీయ కార్యదర్శి బి.వెంకట్‌, ఏపీ రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు సందర్శించారు. ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తికాయత్‌ పలు విషయాలపై వారికి దిశానిర్దేశం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనే అత్యంత దారుణమని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. 


సంపూర్ణ మద్దతు

‘విశాఖ ఉక్కు’ ఆందోళనలకు కిసాన్‌ సంఘాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయని రాకేశ్‌ తికాయత్‌ వెల్లడించారు. దేశంలో కోట్ల మంది ప్రయోజనాలను తోసిరాజని.. కేవలం కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల సేవలో ప్రధాని నరేంద్రమోదీ తరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘‘మీ పోరాటాలు వృథా కావు. విజయం సాధించే వరకూ పోరాడండి. ఎవరు వచ్చినా ఎదిరించండి. వెనక్కి తగ్గకండి. మీ గొంతులో ప్రాణమున్నంత వరకూ పోరాడుతూనే ఉండండి’’ అని తికాయత్‌ నొక్కి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి విధ్వంసాలను సృష్టిస్తోందని, అందరూ మేల్కొని ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ చేతుల్లో మోదీ, అమిత్‌ షాలు కీలుబొమ్మలు అయ్యారని, ప్రజల సంపదను వాళ్లకు దోచి పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ ప్రజలు పోరాడతున్నా మోదీ పట్టనట్టు వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. 


ఆత్మ నిర్భర్‌ అంటూనే అమ్మకమా?: థావలె 

ఆలిండియా కిసాన్‌ సంఘ్‌(ఏకేఎస్‌) అధ్యక్షుడు అశోక్‌ థావలె మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను తామంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. మోదీ ఒకవైపు ఆత్మ నిర్భర్‌ అంటూనే మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని మండిపడ్డారు. మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని కేవలం 32 వేల కోట్ల రూపాయలకు అమ్మేయడానికి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమన్నారు. 32 మంది బలిదానంతో ఏర్పడిన ఉక్కు కర్మాగారం రక్షణకు ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న పోరాటం దేశంలో మిగిలిన పోరాటాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. గడచిన ఏడేళ్లలో 23 ప్రభుత్వ రంగసంస్థల్ని ప్రైవేటు పరంచేశారని, కరోనాతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కుదేలైతే.. మరోవైపు 140 కార్పొరేట్‌ కంపెనీల ఆదాయం 579 బిలియన్‌ డాలర్లు పెరిగిందని చెప్పారు.

భావోద్వేగాలతో ఆడతారా?: వడ్డే

రైతు సంఘం నాయకుడు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, తెలుగు ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తామనడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం భూమి విలువ రెండున్నర లక్షల కోట్ల రూపాయలుగా లెక్కించాలని, కర్మాగారం యంత్రాల విలువ జోడిస్తే మూడు లక్షల కోట్లపైగానే ఉంటుందని.. అలాంటి సంపదను విక్రయించడం దారుణమని అన్నారు. కాగా, తమకు సంఘీభావం తెలపడానికి వచ్చిన జాతీయ నేతలకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు జె.అయోధ్యరామ్‌, సీహెచ్‌ నర్సింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, వరసాల శ్రీనివాసరావు, గంధం వెంకట్రావు, బి.మురళీరాజు, బొడ్డు పైడిరాజు, వి. రామ్మోహన్‌ కుమార్‌లు కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-04-19T05:09:32+05:30 IST