విశాఖలో.. ఆరు రోజుల వ్యవధిలోనే మూడు కిడ్నాప్‌లు!

ABN , First Publish Date - 2020-07-13T16:39:58+05:30 IST

విశాఖ నగరంలో వరుస కిడ్నాప్‌లు అలజడి రేపుతున్నాయి. ఆరు రోజుల వ్యవధిలోనే..

విశాఖలో.. ఆరు రోజుల వ్యవధిలోనే మూడు కిడ్నాప్‌లు!

నగరంలో వరుస అపహరణలతో కలకలం

రెండు కేసులను ఛేదించిన పోలీసులు

మరొకటి తప్పుడు ఫిర్యాదుగా నిర్ధారణ?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలో వరుస కిడ్నాప్‌లు అలజడి రేపుతున్నాయి. ఆరు రోజుల వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తులు అపహరణకు గురవ్వగా, వీటిల్లో రెండు కేసులను పోలీసులు ఛేదించగలిగారు. మరో కేసు దర్యాప్తు కూడా కొలిక్కి వచ్చినప్పటికీ వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.


నగరానికి చెందిన జమ్మి సురేశ్‌ను కొంతమంది వ్యక్తులు డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ఈ నెల ఐదున తుపాకీతో బెదిరించి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి పరవాడ సమీపంలోని ఒక గెస్ట్‌హౌస్‌లో బంధించారు. సురేశ్‌ను క్షేమంగా విడిచిపెట్టాలంటే రూ.ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరకు రూ.30 లక్షలకు బేరం కుదరడంతో డబ్బులు కోసం మరుసటి రోజు సీతంపేటలోని ఒక బ్యాంకు వద్దకు తీసుకువచ్చారు. అక్కడికి బంగారం తాకట్టుపెట్టి డబ్బులు ఇచ్చేందుకు బాధితుడి భార్య, కుమారుడు వచ్చారు. వారితో కిడ్నాపర్లకు వాగ్వాదం జరిగి డయల్‌ 100కి సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్లు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. పోలీసులు తమకు అందిన సమాచారం ప్రకారం వాహనాల తనిఖీలు నిర్వహించి సురేశ్‌ను కిడ్నాప్‌ చేసిన గుంటూరుకు చెందిన పల్లపు ప్రసాద్‌, చినముషిడివాడకు చెందిన పరపతి రామిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. వారికి సహకరించిన హైదరాబాద్‌కు చెందిన మరో ముగ్గురిని పట్టుకోవాల్సి ఉంది. 


ఈ ఘటన మరిచిపోకముందే ఎనిమిదో తేదీన కైలాసపురానికి చెందిన ఫైనాన్సియర్‌ లాలం అప్పలరాజుని కొంతమంది వ్యక్తులు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఆటోలో ఎక్కించుకుని సాగర్‌నగర్‌ తీసుకెళ్లారు. అక్కడ తీవ్రంగా గాయపరిచి  బంగారం, డబ్బు తీసుకుని పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించినప్పటికీ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే అప్పలరాజుని ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, ఆర్థిక సమస్యల కారణంగానే కిడ్నాప్‌ డ్రామా ఆడాడని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.


ఈ నేపథ్యంలో అక్కిరెడ్డిపాలెం కూడలి వద్ద ఈ నెల 11న గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి కాకినాడకు చెందిన మాసా అగస్టీన్‌ మీసెర్చ్‌ అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసి అనకాపల్లి వైపు తీసుకెళ్లిపోతున్నట్టు డయల్‌ 100కి ఫోన్‌ వచ్చింది. అప్పటికే నగరంలో రెండు కిడ్నాప్‌లు జరిగి ఉండడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కూర్మన్నపాలెం వద్ద కారుని ఆపి  11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా... ఉద్యోగాలిప్పిస్తామని అగస్టీన్‌ రూ.60 లక్షలు వసూలు చేశాడని, వాటిని తిరిగి తీసుకునే క్రమంలో మాట్లాడేందుకే తీసుకెళుతున్నట్టు తేలింది. అయినప్పటికీ కిడ్నాప్‌ కేసు నమోదు చేసి 11 మందిని అరెస్టు చేశారు.

Updated Date - 2020-07-13T16:39:58+05:30 IST