విశాఖ నగరానికి నైట్రేట్‌ ముప్పు?

ABN , First Publish Date - 2020-08-06T19:27:39+05:30 IST

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని పోర్టులో టపాసులు నిల్వచేసే కేంద్రంలో..

విశాఖ నగరానికి  నైట్రేట్‌ ముప్పు?

విశాఖ పోర్టు ద్వారా భారీగా అమోనియం నైట్రేట్‌ దిగుమతి

సమీపంలోని గోదాముల్లో నిల్వ

ఇక్కడి నుంచి పలు రాష్ట్రాలకు సరఫరా

ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా.... పెను ప్రమాదమే!

ఇతర రసాయనాలతో కలిస్తే బీరుట్‌ తరహా పేలుడు

నిబంధనల అమలుపై అధికారులు దృష్టిపెట్టాలంటున్న ప్రజలు


(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి): లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని పోర్టులో టపాసులు నిల్వచేసే కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించి వంద మంది మరణించగా, నాలుగు వేల మంది వరకు గాయపడ్డారు. అమోనియం నైట్రేట్‌ నిల్వలే ఈ పేలుడుకు కారణమని, భారీ నిల్వలు ఉండడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అయితే విశాఖపట్నం పోర్టులోనూ ఇదే తరహా ప్రమాదమే పొంచి ఉంది. రష్యా, గల్ఫ్‌ దేశాల నుంచి విశాఖపట్నం పోర్టు ద్వారా ప్రైవేటు వ్యాపారులు అమోనియం నైట్రేట్‌ను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నారు. నౌకల నుంచి అన్‌లోడ్‌ చేసుకుని, సమీపంలోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. తరువాత ఒడిశా, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలకు పంపుతున్నారు. ఏటా సుమారు రెండు లక్షల టన్నుల అమోనియం నైట్రేట్‌ దిగుమతి అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.


ప్రమాదకరం ఎందుకంటే..

అమోనియం నైట్రేట్‌కు పేలుడు స్వభావం వుంది. దీనిని ఎరువుల తయారీతోపాటు గనులు, గ్రానైట్‌, రాయి క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగిస్తారు. ఈ అవసరాల కోసమే దిగుమతి చేసుకుంటున్నారు. అయితే కొన్ని సంఘ విద్రోహశక్తులు అక్రమ మార్గంలో అమోనియం నైట్రేట్‌ను చేజిక్కించుకొని, అత్యంత శక్తిమంతమైన ఇంప్రువైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌(ఐఈడీ) తయారీకి ఉపయోగిస్తున్నారు. కేవలం అర కిలో అమోనియం నైట్రేట్‌తో 100 మీటర్ల పరిధిలో విధ్వంసం సృష్టించవచ్చు. అందువల్ల దీనిని దిగుమతి, నిల్వ, రవాణా చేయడానికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా భారీ ప్రమాదం తప్పదు. విశాఖపట్నంలోని పరిశ్రమల్లో  ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు సంభవిస్తూ, భారీ ప్రాణనష్టం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అమోనియం నైట్రేట్‌పైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.


దృష్టి పెట్టాల్సిన అంశాలు..

- పరిమితుల మేరకు దిగుమతి అవుతున్నదా? లేక ఎక్కువ మొత్తం వస్తున్నదా? 

- నిల్వ చేసే గోదాముల్లో నిబంధనలు పాటిస్తున్నారా? 

- భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా? 

- నిర్దేశిత ప్రాంతాలకే చేరుతున్నదా? మధ్యలోనే దారి మళ్లుతున్నదా? 

- రవాణా సమయంలో నిఘా ఉందా? 

- సీలు వేసిన సంచుల ద్వారా మాత్రమే అమోనియం నైట్రేట్‌ను రవాణా చేయాలి. ఇసుక మాదిరిగా ఓపెన్‌గా రవాణా చేయకూడదు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి.


తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పరిశ్రమల్లో భద్రత చర్యలు సమీక్షించి, నివేదిక సమర్పించాలని జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో దీనిపైనా విచారణ చేయాల్సి ఉంది. 


ఏదైనా కలిస్తేనే పేలుతుంది: సాంబశివరావు, ఎండీ, శ్రావణ్‌ షిప్పింగ్‌

అమోనియం నైట్రేట్‌ ఒక్కటే ఉంటే పేలదు. దీనికి ఇతర రసాయనాలు కలిస్తేనే పేలుతుంది. నిబంధనల ప్రకారమే దీనిని నిల్వ చేస్తున్నాం. వ్యాపారులకు సరఫరా చేసేటప్పుడు పూర్తి సమాచారాన్ని సంబంధిత పోలీసులకు అందిస్తున్నాం. వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ కూడా ఉంటుంది. బ్యాగులతోనే దిగుమతి చేసుకుని, బ్యాగులతోనే రవాణా చేస్తున్నాం.


Updated Date - 2020-08-06T19:27:39+05:30 IST