‘హెచ్‌పీసీఎల్’ ప్రమాదం చిన్నదేమి కాదు.. తేడా వచ్చి ఉంటే..

ABN , First Publish Date - 2020-05-22T14:44:46+05:30 IST

విశాఖపట్నంలో భారీ పరిశ్రమల యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో..

‘హెచ్‌పీసీఎల్’ ప్రమాదం చిన్నదేమి కాదు.. తేడా వచ్చి ఉంటే..

భారీ పరిశ్రమల్లో అదే నిర్లక్ష్యం!

హెచ్‌పీసీఎల్‌ ఘటనే నిదర్శనం

టాస్క్‌ఫోర్స్‌ బృందాల తనిఖీలు డొల్ల


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో భారీ పరిశ్రమల యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో చెప్పడానికి హెచ్‌పీసీఎల్‌ ఘటనే నిదర్శనం. నగరంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి విషవాయువు వెలువడి 12 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగి కేవలం రెండు వారాలే అయింది. ఆ వేడి ఇంకా చల్లారనే లేదు. బాధితులు రోదనలు ఆగలేదు. ఇంతలోనే గురువారం హెచ్‌పీసీఎల్‌ నుంచి పొగలు. ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే... రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో వున్న భారీ పరిశ్రమల్లో ప్రమాదానికి ఆస్కారం వున్న వ్యవస్థలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలంటూ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని నియమించింది. వారంతా పది రోజులుగా అదే పనిలో ఉన్నారు. అయినా హెచ్‌పీసీఎల్‌ నుంచి ప్రజల్ని భయకంపితుల్ని చేసే పొగలు వచ్చాయి. అంటే అటు హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం గానీ, ఇటు టాస్క్‌ఫోర్స్‌ బృందం గానీ సరిగ్గా స్పందించలేదని విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది.  


ప్రమాదాలకు పెద్దన్న...హెచ్‌పీసీఎల్‌

హెచ్‌పీసీఎల్‌ అంటే... విశాఖపట్నంలో ప్రమాదాలకు పెద్దన్న లాంటి సంస్థ. నిత్యం ఇక్కడ అగ్గి రాజుతూనే ఉంటుంది. లోపల ఏవేవో జరుగుతుంటాయి. ఏవీ బయటకు రావు. దాదాపుగా 50 రోజుల తరువాత తెరుస్తున్న పరిశ్రమ... అందులోను పెట్రో కెమికల్‌ యూనిట్‌. తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఎల్‌జీ పాలిమర్స్‌లోను ఇలాగే జరిగింది. అదే నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల హెచ్‌పీసీఎల్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపు రంగు పొగలు వచ్చాయి. ప్రజల్ని భయకంపితుల్ని చేశాయి.


దీనిపై కూడా తక్షణ విచారణ జరగాలి

ప్రమాదకర పరిశ్రమలను తనిఖీ చేసేందుకు ప్రభుత్వం నియమించిన బృందం.. ఎప్పుడు ఈ కంపెనీని సందర్శించింది? ఏమి తనిఖీ చేసింది? ఏమని సర్టిఫై చేసింది? ఏమి లోపాలు గుర్తించింది?, ఇప్పుడు ప్రమాదం జరగడానికి కారణం ఏమిటో తక్షణం వెల్లడించాలి. దీనిపై మళ్లీ మరో పది కమిటీలు వేయకుండా ప్రభుత్వం నాన్చుడు ధోరణి విడనాడాలి. తనిఖీలో అధికారుల నిర్లక్ష్యం వుంటే వారికీ శిక్ష పడేలా చూడాలి. అసలు ఈ ఘటన వెనుక ఏమి ఉన్నదీ ప్రజలకు చెప్పాలి. హెచ్‌పీసీఎల్‌లో ప్రమాదం అంటే తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. తేడా వస్తే విశాఖపట్నం భస్మీపటలం అయిపోతుంది.


నేడు పీసీబీ జాయింట్‌ చీఫ్‌ రాక

హెచ్‌పీసీఎల్‌ నుంచి గురువారం వెలువడిన దట్టమైన పొగలపై విచారణ చేయడానికి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ రాజేంద్ర రెడ్డి శుక్రవారం ఇక్కడికి వస్తున్నారు. 

Updated Date - 2020-05-22T14:44:46+05:30 IST