దివ్య కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి..!

ABN , First Publish Date - 2020-06-07T14:12:55+05:30 IST

విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దివ్య కేసులో..

దివ్య కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి..!

చిత్రహింసలు పెట్టి చంపారు!

మత్తు మాత్రలిచ్చి అట్లకాడతో వాతలు

గుండు గీయించి, కనుబొమ్మలు కత్తిరించి...

4 రోజులపాటు తిండి కూడా పెట్టకుండా..

ముగ్గురు కలిసి మూకుమ్మడిగా హింస

దివ్య మృతదేహంపై 33 చోట్ల గాయాలు


విశాఖపట్నం/మహరాణిపేట(ఆంధ్రజ్యోతి): విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దివ్య కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను వేరొక చోటకు వెళ్లిపోతానని దివ్య తనకు ఆశ్రయమిచ్చిన మహిళకు చెప్పడమే ఆమె పాలిట శాపంగా మారింది. దివ్య రెండు రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దివ్య మృతదేహంపై 33 గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టంలో వెల్లడవడాన్ని బట్టి చూస్తే నిందితులు ఆమెను ఎంత క్రూరంగా హింసించిందీ అర్థమవుతుంది. దీనికి సంబంధించి పోలీసులు, మరికొందరు ప్రైవేటు వ్యక్తుల కథనం ఇలా ఉంది.


తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన దివ్య (22) తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, అమ్మమ్మ నాలుగేళ్ల కిందట హత్యకు గురయ్యారు. దీంతో దివ్య ఆమె పిన్ని క్రాంతివేణి వద్ద ఉండేది. కొన్నాళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని దివ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత అతడితో విడిపోయి ఏడాది కిందట విశాఖకు రాగా, అక్కయ్యపాలెం చెక్కుడురాయి ప్రాంతానికి చెందిన గుట్టల వసంత అలియాస్‌ జ్యోతి పరిచయమైంది. దివ్య నిస్సహాయతను గుర్తించిన వసంత, ఆమె సోదరి మంజు కలిసి దివ్యతో వ్యభిచారం చేయించేవారు. కొంతకాలంగా దివ్యకు వచ్చే డబ్బులు పంపకంలో తేడాలు రావడంతో తాను బయటకు వెళ్లిపోతానని వసంతకు చెప్పింది. దీంతో ఆమెను కొద్ది రోజుల క్రితం తన ఇంట్లోని ఒక గదిలో బంధించింది.


తన సోదరి మంజుతోపాటు మామయ్య వరసయ్యే మరొక వ్యక్తితో కలిసి దివ్యకు గుండు గీయించింది. ఆమె కనురెప్పలు కత్తిరించారు. అట్లకాడతో వాతలు పెట్టి, తిండి కూడా పెట్టక పోడంతో దివ్య గురువారం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దివ్య మృతి చెందడంతో అదే ప్రాంతానికి చెందిన అంతిమ యాత్ర వాహనం నడిపే వ్యక్తిని వసంత సంప్రదించింది. అతడికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈదారుణం వెలుగుచూసింది. కాగా, రావులపాలెం నుంచి దివ్య పిన్ని క్రాంతివేణి శనివారం రావడంతో దివ్య మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. దివ్య శరీరంపై 33 చోట్ల గాయాలున్నట్లు తేలగా, వీటిలో చాలావరకు అట్లకాడతో పెట్టినవే కాగా, చపాతీ కర్రతో కొట్టడం మరికొన్ని బలమైన గాయాలైనట్లు పోలీసులు భావిస్తున్నారు. వసంత, మంజులను అదుపులోకి తీసుకున్నారు. దివ్య పిన్ని పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

--------------------------

దివ్య జీవితంలో అన్నీ విషాదాలే!


22 ఏళ్ల యువతి ఫిట్స్‌తో చనిపోవడమేంటి అని కాటికాపరికి అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించడంతో..

Updated Date - 2020-06-07T14:12:55+05:30 IST