ఉన్నతాధికారుల నుంచి విశాఖ జిల్లా యంత్రాంగానికి ఫోన్లు.. ఎవరికోసమంటే..

ABN , First Publish Date - 2020-08-03T13:39:18+05:30 IST

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో..

ఉన్నతాధికారుల నుంచి విశాఖ జిల్లా యంత్రాంగానికి ఫోన్లు.. ఎవరికోసమంటే..

మంచి స్కూల్లో సీట్లుంచండి!

జిల్లా యంత్రాంగానికి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల ఫోన్లు

విశాఖ నుంచి త్వరలో ‘పరిపాలన’ మొదలవుతుందని భావన

నగరంలో పేరున్న పాఠశాలల గురించి వాకబు

విద్యా శాఖ అధికారులు అప్రమత్తం

100 నుంచి 150 వరకు సీట్లు అవసరమని అంచనా 


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు పలువురు ముందుగానే అప్రమత్తమయ్యారు. మూడు రాజధానులపై గవర్నర్‌ సంతకం తరువాత ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పాలన ఖాయమనే ప్రచారం జరగడంతో పలువురు ఉన్నతాధికారులు తమ పిల్లలకు విశాఖ మంచి పాఠశాలల్లో సీట్ల కోసం జిల్లా యంత్రాం గాన్ని వాకబు చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా రాజధాని ప్రాంతం అమరావతి నుంచి పలువురు ఉన్నతాధికారులు, పలు విభాగాల అధికా రులు.... జిల్లా యంత్రాంగానికి  ఫోన్‌లు చేస్తున్నారు.


కొంతమంది అధికారులు కుటుంబంతో సహా నగరానికి వచ్చి ప్రముఖ పాఠశాలలను సందర్శించారు. అత్యున్నత స్థాయి ప్రమాణాలు వున్న పాఠశాలలో పిల్లలను చేర్పించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరం ఇంకా మొదలు కాకపోయినప్పటికీ ప్రముఖ పాఠశాలల్లో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తిచేశారు. అయినప్పటికీ తమ పిల్లలకు సీట్లు కావాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నట్టు తెలిి సంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యా శాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ అప్రమత్తం చేసినట్టు సమాచారం. మొత్తం మీద ఆయా అధికారులు ఎంపిక చేసుకుంటున్న వివిధ  పాఠశాలల్లో 100 నుంచి 150 సీట్ల వరకు అవసరమని అంచనాకు వచ్చారు. ఈ మేరకు అంతర్జాతీయ స్కూళ్లగా పేరొందిన పాఠశాలలతోపాటు మరికొన్ని ప్రముఖ పాఠశాలల యాజమాన్యాలకు విద్యా శాఖ అధికారులు ఇప్పటికే సమాచారాన్ని అందించారు. 


Updated Date - 2020-08-03T13:39:18+05:30 IST