విశాఖలోనూ వైరాలజీ ల్యాబ్‌!

ABN , First Publish Date - 2020-04-03T09:16:18+05:30 IST

విశాఖలోనూ వైరాలజీ ల్యాబ్‌!

విశాఖలోనూ వైరాలజీ ల్యాబ్‌!

కేజీహెచ్‌లో త్వరలోనే ఏర్పాటు

కాకినాడ జీజీహెచ్‌లో 501 పరీక్షలు 

ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ బాబ్జీతో ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి  


కాకినాడ, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): కరోనా అనుమానిత కేసులు నానాటికీ పెరుగు తుండటంతో త్వరలోనే ప్రభుత్వం విశాఖ కేజీహెచ్‌లో వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుందని కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాల(ఆర్‌ఎంసీ) ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కోరుకొండ బాబ్జీ అన్నారు. కరోనా సోకిన వారికి, అనుమానితులకు జీజీహెచ్‌ లోని వైరాలజీ ల్యాబ్‌లో అందుతున్న సేవలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో  మాట్లాడారు.


వైరాలజీ ల్యాబ్‌లో కొవిడ్‌-19 పరీక్షలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 

ఇక్కడ మార్చి 18నుంచి పరీక్షలు చేస్తున్నాం. నేను డీఎంఈగా పనిచేసిన సమయంలో 2019లో కేంద్ర ఆరోగ్యశాఖ ద్వారా సీఎం జగన్‌, మంత్రి ఆళ్ల నాని, ముఖ్య కార్యదర్శి సహకారంతో కాకినాడ జీజీహెచ్‌లో వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటుకు కృషి చేశాను. అప్పట్లో దీనికి కేంద్రం రూ.1.7కోట్లు నిధులిచ్చింది. దీనివల్ల తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కు చెందిన అనుమానితులకు పరీక్షలు చేయగలుగుతున్నాం. 


ఇప్పటి వరకు పాజిటివ్‌ వచ్చిన కేసులెన్ని? 

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 243మందికి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 258మందికి పరీక్షలు చేశాం. తూర్పున 9 మందికి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 8మందికి కరోనా నిర్ధారణ అయింది. 


రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పెరగడంపై ఏమంటారు? 

ఆందోళన చెందాల్సిన పనిలేదు. కాకినాడ జీజీహెచ్‌కు లండన్‌ నుంచి వచ్చిన రాజమహేంద్రవరం యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. అతను ఇప్పుడు కోలుకుంటున్నాడు. పాజిటివ్‌ వస్తే ఏదో అయిపోతుందనుకోవడం అవివేకం. మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అలాగని రోడ్లపై ఇష్టానుసారం తిరిగి రోగం అంటించుకోకుండా ఉంటే మంచిది. 


ఇప్పుడున్న ల్యాబ్‌లో వసతులు, పరికరాలు, సిబ్బంది సరిపోతున్నారా? 

ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి సీఎం మంజూరు చేసిన రూ.10లక్షలతో పారామెడికల్‌, సాంకేతిక, క్షేత్రస్థాయి సిబ్బందిని తాత్కాలికంగా భర్తీ చేసుకున్నాం. 


ఇక్కడి ల్యాబ్‌లో కరోనా బాధితులను గుర్తించే నిపుణులున్నారా? 

ఉన్నారు. ఆర్‌ఎంసీ నుంచి మైక్రోబయాలజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మూర్తి వైరస్‌ ఉధృతి, సోకిన తర్వాత, సోకకముందు వ్యక్తుల్లో ఉండే లక్షణాలపై పుణెలో శిక్షణ పొందారు. ఆయనకు అసిస్టెంట్‌గా మరో వైద్యుడు కిరణ్‌ (పల్మనాలజీ నిపుణుడు) ఉన్నారు. 


అనుమానిత కేసులు పెరిగితే ల్యాబ్‌ సామర్థ్యం సరిపోతుందా? 

ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లాం. మంత్రి ఆళ్ల నాని మరో వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. త్వరలో విశాఖ కేజీహెచ్‌లో ల్యాబ్‌ ఏర్పాటవుతుంది. అప్పుడు ఇక్కడ ఒత్తిడి తగ్గుతుంది. 


ఇతర దీర్ఘకాలిక రోగుల పరిస్థితి ఏంటి? 

ఇబ్బంది లేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ పనిచేస్తున్నాయి. కాకినాడ జీజీహెచ్‌లో ప్రస్తుతం 500మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. వీరికి రెగ్యులర్‌గా వైద్యం అందుతోంది. రోజూ 300-400 మంది అవుట్‌ పేషెంట్లు వస్తున్నారు.

Updated Date - 2020-04-03T09:16:18+05:30 IST