విశాఖ స్టీల్‌కు మరో షాక్‌!

ABN , First Publish Date - 2022-09-28T08:08:39+05:30 IST

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు పులి మీద పుట్రలా మరో కష్టం వచ్చిపడింది. గంగవరం పోర్టు నుంచి కోకింగ్‌ కోల్‌ను సరఫరా చేస్తున్న సంస్థ బొగ్గు సరఫరాను మంగళవారం ఉదయం నుంచి ఆపేసింది. బకాయిలు చెల్లించడం లేదంటూ ఆ సంస్థ హైకోర్టును

విశాఖ స్టీల్‌కు మరో షాక్‌!

బకాయిలు చెల్లించడం లేదని కోర్టుకెక్కిన సరఫరా సంస్థ

కోకింగ్‌ కోల్‌ సరఫరాపై స్టే ఇచ్చిన హైకోర్టు

గంగవరం పోర్టులో ఆగిన బొగ్గు

కేంద్రం ఎత్తుగడేనంటున్న కార్మిక సంఘాలు

సాయంత్రానికి బిల్లులు చెల్లించిన అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు పులి మీద పుట్రలా మరో కష్టం వచ్చిపడింది. గంగవరం పోర్టు నుంచి కోకింగ్‌ కోల్‌ను సరఫరా చేస్తున్న సంస్థ బొగ్గు సరఫరాను మంగళవారం ఉదయం నుంచి ఆపేసింది. బకాయిలు చెల్లించడం లేదంటూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం కోకింగ్‌ కోల్‌ సరఫరాపై స్టే విధించింది. స్టీల్‌ప్లాంటుకు ఇది చాలా ముఖ్యమైన మెటీరియల్‌. ఈ బొగ్గు లేకపోతే కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలు పనిచేయవు. అందుకే హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలోనూ అత్యవసరంగా భావించి ముందు వీటికే సరఫరా చేశారు. సమయానికి కోకింగ్‌ కోల్‌ అందించకపోతే వివిధ రకాల గ్యాస్‌లు లీకై ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి స్టీల్‌ప్లాంటు ఎప్పుడూ వారం, పది రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచుకుంటుంది. ప్రస్తుతం 80 వేల టన్నుల కోకింగ్‌ కోల్‌ స్టీల్‌ప్లాంటులో ఉంది. రోజుకు 9.5 వేల టన్నులు వినియోగిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఈ నిల్వలు ఎనిమిది రోజుల వరకు సరిపోతాయి. ఇవి కాకుండా గంగవరం పోర్టులో మరో 83 వేల టన్నులు నిల్వ ఉంది. రోజూ ఈ పోర్టు నుంచి కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా 12 వేల టన్నుల కోకింగ్‌ కోల్‌ సరఫరా అవుతుంది. హైకోర్టు నుంచి మంగళవారం ఉదయం స్టే ఆర్డర్‌ రావడంతో పోర్టు వర్గాలు కోల్‌ సరఫరాను నిలిపివేశాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్టీల్‌ప్లాంటుకు మెటీరియల్‌ సరఫరా చేసే వారికి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. చాలాకాలంగా బిల్లుల కోసం తిరుగుతున్న టాటా ఎన్‌వైకే అనే సంస్థ విసిగిపోయి హైకోర్టులో కేసు వేసింది. అధికారులు చెల్లింపుల్లో జాప్యం చేశారని హైకోర్టు కోకింగ్‌ కోల్‌ సరఫరాపై స్టే విధించింది. దీంతో ఉదయం 10.45 గంటల నుంచే కోల్‌ ఆగిపోయింది. ఈ వార్త తెలియగానే స్టీల్‌ప్లాంటు అధికారులు ఆగమేఘాలపై కేసు వేసిన కంపెనీకి బకాయి ఉన్న మొత్తం సాయంత్రంకల్లా చెల్లించేశారు. ఆ వివరాలను కోర్టుకు సమర్పించి స్టే ఎత్తివేతకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-09-28T08:08:39+05:30 IST