అమ్మఒడి వద్దు: విద్యార్థుల తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2021-10-25T21:24:37+05:30 IST

విశాఖ: నగరంలోని జ్ఞానాపురంలో ఉద్రిక్తత నెలకొంది.

అమ్మఒడి వద్దు: విద్యార్థుల తల్లిదండ్రులు

విశాఖ: నగరంలోని జ్ఞానాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు. సెంట్ ఆన్స్, సెయింట్ జోసఫ్‌తోపాటు సమీపంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తాము అమ్మఒడి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదని అన్నారు. తమకు అమ్మఒడి, చేయూత పథకాలు అవసరంలేదని, ఈ స్కూళ్లు ఇక్కడే ఉండాలని వారు కోరుతున్నారు. తమ పిల్లలను బయట చదివించుకునే స్థామత లేదని ఎయిడెడ్ స్కూల్స్ కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తామని ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నారు. అయితే ప్రభుత్వ సంస్థలు ఉండాలి.. లేదా ప్రైవేటు పరం చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెంట్ ఆన్స్, సెయింట్ జోసఫ్‌తోపాటు సమీపంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. పిల్లలను వేరే స్కూల్లో చేర్చుకోవాలని, సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేమని యాజమాన్యాలు  చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-25T21:24:37+05:30 IST