చెయ్యడం చేతకాక..

ABN , First Publish Date - 2022-04-29T08:17:03+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మరో పథకం ప్రారంభించారు. అది... ‘జనం చెవిలో జగనన్న పూలు’! మొన్న ఒంగోలు సభలో!

చెయ్యడం చేతకాక..

మీడియాపై ముఖ్యమంత్రి ఆరోపణలు.. జనం చెవిలో జగన్‌ ‘అడ్డు’గోలు పూలు

మాయ మాటలు.. అడ్డగోలు అభాండాలు

విశాఖకు రాజధాని రాకుండా అడ్డుకున్నారట!

అప్పులు రాకుండా అడ్డుపడుతున్నారట!

పేదల ఇళ్ల స్థలాలకు అడ్డుపడ్డారట!

విపక్షంలో ఉండగా ఉత్తరాంధ్ర గుర్తురాలేదా?

మూడు రాజధానులపై చిత్తశుద్ధి ఉందా?

తీర్పు రాకముందే పిటిషన్‌ వెనక్కి ఎందుకు?

సుప్రీంకోర్టును ఆశ్రయించలేదెందుకు?

విభజన చట్ట సవరణకు కేంద్రాన్ని కోరలేదేం?

అమరావతిలో పేదల మధ్య విద్వేషమే ఉద్దేశం

చట్టం ఒప్పుకోదని తెలిసీ అక్కడే ఇళ్ల స్థలాలు

డీకేటీ పట్టాలు కాకుండా ‘కన్వేయన్స్‌’ కథలు

అడ్డగోలు అప్పులపై కాగ్‌, కేంద్రం నజర్‌

సమాధానం చెప్పలేక రాష్ట్రం సతమతం

ఇందులో మీడియా పాత్ర ఎక్కడ? ఏమిటి?


‘ఆడలేక మద్దెల వోడు’.. అనేది సామెత! సీఎం జగన్‌దీ అచ్చంగా ఇదే తీరు! పాలన చేతకాక, చెల్లుబాటయ్యే విధానాలు రూపొందించలేక, పద్ధతైన జీవోలు ఇవ్వలేక... ‘అడ్డుకున్నారు... అడ్డుకున్నారు’ అని మీడియా మీద నోరేసుకుని పడుతున్నారు. ‘పథకాలు ఆపాలంటున్నారు’ అని ఇటీవల ఒంగోలు సభలో అభాండాలు వేశారు. కానీ.. ఆయన పథకాల లోగుట్టు ప్రజలకు అర్థమైంది. పనికొచ్చే అనేక పథకాలు రద్దు చేసింది ఆయనేనని తెలిసిపోయింది. గురువారం అనకాపల్లిలో మరోసారి జగన్‌ ‘ఆడలేక మద్దెల వోడు’ వైఖరి ప్రదర్శించారు. విశాఖకు రాజధాని రాకుండా, అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా ఎవరో అడ్డుకున్నారని వాపోయారు. మాటల లెక్కేమిటో తేల్చే ప్రత్యేక కథనం.. 14లో


ఈ ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకున్నదెవరు?

అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామన్నా అడ్డుకున్నారని... జగన్‌ తెగ బాధపడ్డారు. ఆయన ఇస్తానన్న స్థలాలు ఎవరివనే సంగతి పక్కనపెడితే... ఇదే అమరావతి  పరిధిలోని ఏడు గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వం పేదల కోసం ఐదువేల టిడ్కో ఇళ్లను నిర్మించింది. జగన్‌ సర్కారు వాటిని పేదలకు ఇవ్వకుండా మూడేళ్లుగా సతాయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది టిడ్కో ఇళ్ల పరిస్థితి కూడా ఇంతే! పేదలపై ఇంత ప్రేమ ఒలకబోస్తున్న జగన్‌... టిడ్కో ఇళ్లను ఎందుకు పూర్తి చేయడంలేదు?  వాటిని లబ్ధిదారులకు అప్పగించకుండా ఎవరు అడ్డుకున్నారు? వాటిని ఎందుకు పాడుపెడుతున్నారు?


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మరో పథకం ప్రారంభించారు. అది... ‘జనం చెవిలో జగనన్న పూలు’! మొన్న ఒంగోలు సభలో! ఇప్పుడు అనకాపల్లిలో! మరోసారి ‘అడ్డు’గోలు కథలు చెప్పారు. ‘‘ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా విశాఖకు రాజధాని తీసుకొస్తానంటే అడ్డుకుంటారు. వారి రాజధాని అమరావతిలో పేదలకు ఇంటిస్థలాలు ఇద్దామంటే అదీ అడ్డుకుంటారు. అప్పులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు’’ అని వాపోయారు. పేదలు, బలహీనవర్గాలకు మంచి చేద్దామనుకుంటే దాన్ని మీడియా అడ్డుకుంటోందని ఆక్రోశించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఏమీ చేయలేని తన అసమర్థత, అవగాహనలేమిని కప్పిపుచ్చుకోవడానికి... మీడియా, ప్రతిపక్షాలు, కోర్టులపై అబద్ధాల దాడి చేశారు.


విశాఖకు రాజధానిని అడ్డుకున్నదెవరు?

‘ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలి’ అని విపక్షంలో ఉండగా జగన్‌కు ఎన్నడూ అనిపించలేదు. పైగా... అమరావతికే మద్దతు పలికారు. ‘మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు. రాజధాని ఇక్కడే ఉంటుంది’ అని వైసీపీ నేతలు నమ్మబలికారు. చివరికి... పరిపాలన వికేంద్రీకరణ పేరిట 3 రాజధానుల బిల్లు తెచ్చారు. ఎక్కడ, ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు. కానీ... నవ్యాంధ్ర పరిస్థితి వేరు. అమరావతి కోసం ప్రభుత్వం రైతుల నుంచి 32వేల ఎకరాలు ‘ల్యాండ్‌ పూలింగ్‌’లో తీసుకుంది. ‘ప్రపంచస్థాయి రాజధాని నగరం కడుతున్నాం. మీకు మేలు జరుగుతుం ది’ అని చట్టబద్ధమైన హామీ ఇచ్చి, ఒప్పందాలు చేసుకుంది. దానిని ఉల్లంఘిస్తే బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించకుండా ఎందుకు ఊరుకుంటారు.


కోర్టు కూడా వారికి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే... ఈ కేసు తీర్పు రాకముందే జగన్‌ సర్కారు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. దీనికి కారణం ఎవరు? ఎందుకు బిల్లును మధ్యలోనే ఉపసంహరించుకున్నారు? ఏ మీడియా అడ్డొచ్చింది? ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పరు. పోనీ... మూడు రాజధానులపై నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, పాలనా రాజధాని పెట్టి ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం నిలబెట్టాలనుకుంటే... హైకోర్టు తీర్పుపై ఇప్పటిదాకా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదు? అలా చేయకుండా ఎవరు అడ్డుకున్నారు?


కేంద్రాన్ని కోరవచ్చు కదా?

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నవ్యాంధ్రకు ఒకే రాజధాని ఉండాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దానిని మూడు రాజధానులుగా మార్చుకోవాలంటే కేంద్రమే తిరిగి పార్లమెంట్‌లో ఆ చట్టాన్ని సవరించాలని పేర్కొంది. నిజంగా... కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పాలనా రాజధానిగా మార్చాలనుకుంటే విభజన చట్టాన్ని సవరించాలని జగన్‌ ఈపాటికే కేంద్రాన్ని కోరాలి. ఆ పని కూడా చేయలేదు. పోనీ... ప్రభుత్వ పెద్దలే చెబుతున్నట్లుగా, ‘పకడ్బందీగా, సాంకేతిక లోపాలు లేకుండా’ మళ్లీ మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలోనైనా ప్రవేశపెట్టి ఆమోదించారా? అంటే అదీ లేదు! వెరసి... రాజధాని విషయంలో జగన్‌ వైఖరి ఏమిటంటే... ‘‘అమరావతిని కొనసాగించడం ఆయనకు ఇష్టంలేదు. మూడు రాజధానులను ఆయన ముందుకు తీసుకెళ్లలేరు. చివరికి... రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత రాజధానిలేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది’’ అని విశ్లేషకులు మండిపడుతున్నారు.


అప్పులపై అడ్డదిడ్డం వాదన!

‘‘రాష్ట్రానికి అప్పులిచ్చే బ్యాంకులను అడ్డుకుంటున్నారు. కేంద్రం ముందుకొచ్చి సాయం చేస్తామన్నా జీర్ణించుకోలేకపోతున్నారు’’ అని జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రాలు ఏమేరకు అప్పులు చేయాలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్రం నిర్ణయిస్తుంది. ఈ అప్పులను ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. ఆర్థిక పరిస్థితిని, గణాంకాలను ‘కాగ్‌’ పరిశీలిస్తుంది. పైగా... రాజ్యాంగ విరుద్ధమైన కార్పొరేషన్లను పెట్టిన జగన్‌ అడ్డగోలుగా అప్పులు తెస్తూనే ఉన్నారు. ఇంత కాలం కేంద్రం కూడా దీనికి సహకరిస్తూ వచ్చింది.


తాజాగా... ‘శ్రీలంక సంక్షోభం’ నేపథ్యంలో రాష్ట్రాల అప్పులపై కేంద్రం దృష్టి సారించింది. పాత అప్పులు, తప్పులకు సమాధానం చెబితే తప్ప కొత్త అప్పులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు ఈ పరిణామాలను ప్రజల ముందుంచడం తప్ప... ఇందులో మీడియా ప్రమేయంగానీ, పాత్రగానీ ఎక్కడుంది? ఇక... రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారని జగన్‌ ఆక్రోశించారు. సగటున నెలకు రూ.6వేల కోట్ల అప్పు చేస్తే తప్ప బండి నడవని స్థితి! రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం ఇదేనా?


ఇంటి స్థలాలు ఇవ్వొద్దన్నారా?

దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ఇష్టారాజ్యం కుదరదు. రాజ్యాంగం, నిబంధనలు, చట్టాలు పాటించాల్సిందే. కానీ... జగన్‌ లెక్కే వేరు. గత 40 ఏళ్లుగా ప్రభుత్వాలు పేదలకు ఏపీ అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం డీకేటీ రూపంలో  ఇంటి స్థలాలు ఇస్తున్నాయి. కేంద్ర చట్టాల ప్రకారం చూసినా... పట్టాలను ఆ రూపంలోనే ఇవ్వాలి. పేదలకు ఇచ్చిన భూములు చేతులు మారకుండా, వారు నష్టపోకుండా ఈ జాగ్రత్త తీసుకున్నారు.


కానీ...  జగన్‌ ఇందుకు విరుద్దంగా కన్వేయెన్స్‌ డీడ్‌లను తెరపైకి తెచ్చారు. రెవెన్యూశాఖ దీనిని వ్యతిరేకించినప్పటికీ... తన నిర్ణయమే అమలుకావాలంటూ జీవోలు ఇచ్చారు. వీటికి కోర్టులో చుక్కెదురైంది. ఏ చట్టం ప్రకారం కన్వేయెన్స్‌ డీడ్‌లు ఇస్తారన్న ప్రశ్నకు జగన్‌ సర్కారు జవాబు చెప్పలేకపోయింది. చివరకు సుప్రీం కోర్టుకు వెళ్లి... అక్కడ విచారణ కూడా మొదలుకాకముందే పలాయనం చిత్తగించారు. డీకేటీ పట్టాలే ఇస్తామంటూ కన్వేయెన్స్‌ డీడ్‌లు వెనక్కి తీసుకున్నారు. కోట్ల రూపాయలు, అంతకుమించి విలువైన సమయాన్ని వృథా చేశారు. 


‘అమరావతి’లో స్థలాల కథ ఇది..

‘వారి’ రాజధాని అమరావతిలోనూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు... అని జగన్‌ మరో ‘అడ్డు’గోలు కథ చెప్పారు. అమరావతిలో సీఆర్‌డీఏ చట్టం అమలవుతోంది. రైతుల నుంచి తీసుకున్న భూముల్లో 5 శాతం ఈ ప్రాంత పరిధిలోని పేదల ఇళ్ల కోసం కేటాయించారు. భవిష్యత్తులో పేదల అవసరాలకు మరో 5శాతం రిజర్వ్‌ చేశారు. బయటివారికి ఇక్కడ భూములు ఇవ్వకూడదు. ఈ ప్రాంత పరిధిలోని పేదలకే ఇవ్వాలి. ఇది సీఎంకు తెలియని విషయం కాదు. అయినాసరే... మున్ముం దు ‘అడ్డు’గోలు కథ వినిపించేందుకు పథకం రచించారు. రాజధాని బయట ఉన్నవారికి... ఉద్దేశ్యపూర్వకంగా అమరావతిలో ఇంటి స్థలాలు కేటాయించారు.  మాస్టర్‌ప్లాన్‌లో లేని కొత్తజోన్‌ను సృష్టించారు. అప్పటికే తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు దీనిపైనా న్యాయపోరాటం చేశారు. ఇదీ అసలు విషయం! చట్ట విరుద్ధమని తెలిసి, కేవలం అమరావతిని దెబ్బతీసి, పేదల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకే జగన్‌ ఈ పని చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 

Updated Date - 2022-04-29T08:17:03+05:30 IST